ప్రపంచంలో అనునిత్యం ఎన్నో దేశాల నాయకుల మధ్య, అధికారుల మధ్య చర్చలు, సంప్రదింపులు జరుగుతూ వుంటాయి. ఆ చర్చల్లో తీసుకున్న నిర్ణయాలు చాలాసార్లు చరిత్ర గతినే మార్చివేస్తాయి. అయితే యీ నాయకులందరిదీ ఒకే భాష కాదు. అందుకని వారు దుబాసీలను ఏర్పాటు చేసుకుంటారు. దుబాసీలు తమ నాయకులకు కాస్త దూరంగా సౌండ్ ప్రూఫ్ క్యూబికల్లో ఒక చెవికి హెడ్సెట్ తగిలించి కూర్చుంటారు. ఒక చెవితో వింటూ, వెంటవెంటనే అనువాదం చేసి చెపుతూ వుండాలి. ఏకసమయంలో వినడం, మాట్లాడడం చేసేటప్పటికి మెదడు అలిసిపోతుంది. 30 ని||ల తర్వాత వేరే వాళ్లు వచ్చి కూర్చుంటారు. అమెరికా, రష్యా అధ్యకక్షులు చర్చల్లో పాల్గొనాలంటే రష్యా అధ్యకక్షుడితో బాటు దుబాసీలు వుంటారు. ఈయన రష్యన్లో చెప్పినదాన్ని అవతలివారికి ఇంగ్లీషులో చెప్పి, వారి సమాధానాన్ని మళ్లీ వీళ్లకు రష్యన్ భాషలో అనువదించి చెప్తారు. అనేక మంది రష్యా అధ్యకక్షులకు దుబాసీగా పని చేసిన విక్టర్ సుఖోద్రేవ్ తన 81 వ యేట యీ ఏడాది మే నెలలో మరణించాడు. ఆ సందర్భంగా కొందరు దుబాసీల అనుభవాలపై, కొన్ని సంఘటనలపై మీడియా దృష్టి సారించింది. విక్టర్ విషయమే చెప్పాలంటే నికితా కృశ్చేవ్ 1959లో తొలిసారి అమెరికాకు వెళ్లినపుడు యితనే దుబాసీగా వున్నాడు. ''కమ్యూనిజం కాపిటలిజం కంటె ఎక్కువ కాలం మనగలుగుతుంది.'' అని కృశ్చేవ్ రష్యన్లో చెపితే యితను అనువదించేటప్పుడు 'వి విల్ బరీ యూ' (మేం మిమ్మల్ని పాతిపెడతాం) అన్నాడు. అది అమెరికన్ల మెదళ్లలో నాటుకుపోయింది.
ఎలీనా కిడ్ అనే దుబాసీ మైకేల్ గోర్బచేవ్‌కు దుబాసీగా పని చేసింది. అతను చాలా స్నేహపూర్వకంగా వుండేవాడని అంటుందామె. ''అతని దక్షిణాది యాస అర్థం చేసుకోవడం సులభమే కానీ అతని వాక్యాలు చాలా దీర్ఘంగా, క్లిష్టంగా వుంటాయి. వాటిని అలాగే అనువదించడం అసాధ్యం. ముక్కలుగా విడగొట్టి చెప్పేదాన్ని. వాక్యనిర్మాణంలోనే రష్యన్‌కు, ఇంగ్లీషుకు తేడా వుంది. వాక్యం చివరిదాకా వింటే తప్ప అర్థం బోధపడదు. అసలు రష్యాలో ఉపన్యాస కళను, సంభాషణ కళను నాయకులెవరూ పట్టించుకోలేదు. అంతా మిలటరీ వాతావరణమే కాబట్టి తాము ఏం చెప్పినా అవతలివాళ్లు చచ్చినట్లు వింటారనే ధోరణి వాళ్లది. సభను రంజింపచేయడానికి జోక్స్ చెప్పాలని, చమత్కారంగా మాట్లాడాలని ఎవరూ అనుకోరు. పుస్తకాల్లో రాసినట్లు మాట్లాడతారు. అందుకే వారిని అనువదించడం కష్టం.'' అంటుందామె. 'గోర్బచేవ్‌ను కలవడానికి చాలామంది వచ్చేవారు. ఓ రోజు ఇంటర్నేషనల్ ఫైనాన్స్ గురించి మాట్లాడితే, మర్నాడు ఇంటర్నేషనల్ లా గురించి మాట్లాడేవారు. వాటి సాంకేతిక పదజాలం తెలుసుకోనిదే మనం సరిగ్గా అనువదించలేం. అందుకని మేం కూడా చాలా చదువుకుని, అనేక విషయాలు అధ్యయనం చేసి డ్యూటీకి వచ్చేవాళ్లం. ఒకసారి ఎన్సైక్లోపీడియా బ్రిటానికాను రష్యన్ భాషలో అనువదించి ప్రచురిస్తామంటూ ఒకతన వచ్చాడు. 'ఎలక్ట్రిక్ బల్బు కనిపెట్టిన దెవరు?' అని అడిగాడు గోర్బచేవ్. 'బెంజమిన్ ఫ్రాంక్లిన్' అన్నాడతను. 'మా రష్యన్ అయిన అలెగ్జాండర్ పొపోవ్. అదేమీ తెలియకుండా పట్టించుకోకుండా మీరు ఎన్సైక్లోపీడియా తయారుచేస్తే ఎలా?' అంటూ గోర్బచేవ్ అతనితో వాదనకు దిగాడు.' అంటూ నవ్విందామె.
విక్టర్ గావో అనే అతను చైనీస్ ఫారిన్ సర్వీసులో పనిచేశాడు. డెంగ్ జియావోపింగ్‌కు దుబాసీగా పనిచేశాడు. 'డెంగ్ మితభాషి. సూటిగా, తన ప్రాంతపు యాసతో మాట్లాడేవాడు. నిత్యజీవితంలోని ఉపమానాలతో కాస్త మొరటుగానే చెప్పేవాడు. 'పిల్లి నల్లగా వుందా, తెల్లగా వుందా అన్నది కాదు చూడాల్సింది, ఎలకల్ని పడుతుందా లేదా అనేది చూడాలి' అనేది అని తరచుగా చెప్పేవాడు. చైనాలో ప్రభుత్వోద్యోగులు వృద్ధులయ్యాక రిటైర్ కావాలని, చైనా సైన్యం నుండి పదిలక్షల మందిని తీసేయాలని, 1950లో జరిగిన గ్రేట్ లీప్ ఫార్వార్డ్ విఫలమయిందని.. యిలా తన అభిప్రాయాలను కచ్చితంగా చెప్పేవాడు. 1985లో ఇంగ్లండు హాంగ్‌కాంగ్‌ను చైనాకు అప్పగించింది. ఆ సందర్భంగా డెంగ్ లండన్ వెళ్లినపుడు నేను కూడా కూడా వెళ్లి మార్గరెట్ థాచర్‌ను కలిశాను. 1985లోనే రిచర్డ్ నిక్సన్ చైనాకు అయిదు రోజుల పర్యటనపై వచ్చాడు. కూడా ఒక బాడీ గార్డు, ఒక పి.ఎ. అంతే! నిక్సన్‌తో నేను చాలా సమయం గడిపాను. అతనూ, డెంగ్ కలిసి చైనాను చాదస్తపు పద్ధతుల్లోంచి బయటకు లాగారు.' అంటాడతను.
నలుగురు ఇరాన్ అధ్యకక్షులకు దుబాసీగా పనిచేసిన బానాషే కీనౌష్ కూడా తన అనుభవాలు చెప్పింది. ఆమె తండ్రి, తాత అందరూ ఫారిన్ సర్వీసులో ఉన్నతాధికారులు. 1970లలో తండ్రి లండన్‌లో ఇరానియన్ ఎంబసీలో పనిచేసేటప్పుడు ఆమె లండన్‌లో చదువుకుంది. తర్వాత ఇరాన్‌కు తిరిగి వచ్చింది. దుబాసీ ఉద్యోగం గురించి విని దాన్ని తన కెరియర్‌గా చేసుకుందామనుకుంది. అప్పట్లో ఇరాన్లో మగవాళ్లకు మాత్రమే ఆ విద్యలో తర్ఫీదు యిచ్చేవారు. ఈమె ఇంగ్లీషులో ఎమ్ఏ చేసి, యూనివర్సిటీలో ప్రొఫెసరుగా పనిచేస్తూ దుబాసీగా ఫ్రీలాన్సింగ్ చేసింది. ''మహమ్మద్ ఖతామీ, మహమూద్ అహ్మదినెజాద్, రఫ్సన్జాని, హసన్ రౌహనీ – వీళ్లందరికీ నేను పని చేశాను. ఒక్కొక్కరిది ఒక్కో స్టయిల్. రఫ్సన్జాని చాలా రిలాక్స్డ్గా మాట్లాడేవాడు. అహ్మదినెజాద్ అయితే చాలా ఆవేశపూరితంగా మాట్లాడేవాడు. రౌహనీ నేను ఏం మాట్లాడుతున్నానో చాలా జాగ్రత్తగా గమనించేవాడు. ఓ సారి యుఎన్ సెక్రటరీ జనరల్ బాన్ కి మూన్తో సమావేశం. ఆయన చాలా తగ్గు గొంతులో మాట్లాడుతున్నాడు. నాకు అవేళ రొంప చేసి సరిగ్గా వినబడటం లేదు. గదిలో చుట్టూ జనం. అనువదించడం కష్టంగా వుంది. నా అవస్థ చూసి రౌహనీ 'నాకు ఇంగ్లీషు అర్థమవుతుంది. ఆయన చెప్పేది నువ్వు అనువదించనక్కరలేదు. నేనే డైరక్టుగా విని ఫార్సీలో సమాధానం చెప్తాను. అది ఇంగ్లీషులో అనువదించి ఆయనకు చెప్పు చాలు' అన్నాడు. హమ్మయ్య అనుకున్నాను.''
దుబాసీలు తమ నాయకుల మాటలనే మక్కికి మక్కిగా అనువదించకుండా, వారి భావాలను కూడా స్పష్టంగా వ్యక్తీకరించే సరైన మాటలను వెతికి పొదుగుతారు, వాటిని సరైన అనుభూతితో పలుకుతారు. అప్పుడే ఎదుటి వ్యక్తికి వీరి భావం పూర్తిగా బోధపడుతుంది. కానీ దుబాసీల పాత్ర ఎప్పుడూ తెర వెనుకనే వుంటుంది.
-ఎమ్బీయస్ ప్రసాద్