మీరు గమనించారో లేదో, మనం తరచుగా వాడే సారిడన్, గ్లయికోడిన్ కాఫ్ సిరప్, కోరెక్స్, విక్స్ యాక్షన్ 500, డీకోల్డ్ టోటల్ వగైరా 344 ఔషధాలను ప్రభుత్వం నిషేధించింది. దానిపై మందుల కంపెనీలు కోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకున్నాయి కాబట్టి అమ్మకాలు సాగుతున్నాయి. నిషేధించిన కారణం ఏమిటంటే యివి ఎఫ్డిసి (ఫిక్సెడ్ డోస్ కాంబినేషన్) మందులు. సాధారణంగా ఒక్కో కెమికల్ కాంపౌండు ఒక్కో గుణం కలిగి ఒక్కో రకమైన రోగలక్షణాన్ని నయం చేస్తుంది. ఒక వ్యాధిలో వుండే రెండు మూడు లక్షణాలకై రెండు మూడు మందులు యివ్వాల్సి వుంటుంది. అన్ని మందులంటే రోగి కొనడేమోనని ఆ రెండు, మూడు మందులు కలిపి ఒకే కాంబినేషన్ డ్రగ్‌గా అమ్మేస్తున్నారు. ఇంకో విషయమేమిటంటే – రోగిని బట్టి ఆ యా మందులు ఆ యా డోసుల్లో యివ్వాలి. కానీ యీ కాంబినేషన్ డ్రగ్స్‌ల్లో అన్ని రకాల రోగులకు ఒకేరకమైన నిష్పత్తిలో మందులు కలుపుతున్నారు. అది మంచిది కాదు. ఉదాహరణకి సారిడన్లో పారాసెటమాల్, కెఫేన్, ప్రొపైఫెనాజోన్ అనే మూడు మందులను ఒక స్థిరనిష్పత్తిలో (ఉదాహరణకి 3:3:3 అనుకుందాం) కలిపి అమ్ముతారు. రోగలక్షణాలను బట్టి ఎ అనే రోగికి వాటిని 2:5:4 నిష్పత్తిలో, బి అనే రోగికి 4:2:1 నిష్పత్తిలో యివ్వాలనుకోండి. మరి యిలా 3:3:3గా యిస్తే దుష్ఫలితాలు కలుగుతాయి కదా! పైగా కొన్ని వ్యతిరేక లక్షణాలున్న మందులను కూడా కలిపివేసి ఎఫ్‌డిసిలను తయారుచేస్తున్నారు. నిముసులైడ్ అనే ఎనాల్జిసిక్ భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి, సెర్రాషియోపెప్టిడేస్ అనే ఎంజైమ్‌ను భోజనానికి అరగంట తర్వాత తీసుకోవాలి. అసంబద్ధంగా రెండిటినీ కలిపి కాంబినేషన్ డ్రగ్ చేసి అమ్మడం ఘోరం కదా అంటారు డాక్టర్లు. మరి కొన్ని సందర్భాల్లో ఒక కెమికల్ మరొక కెమికల్ పనితనాన్ని తగ్గిస్తోంది. భారత ఔషధాల గైడ్‌లైన్స్ ప్రకారం మధుమేహానికి చికిత్స – సరైన ఆహారం, తగినంత వ్యాయామం, మెట్ఫార్మిన్ అనే ఒకే ఒక్క మందు! అయితే ''లాన్సెట్'' అనే ప్రముఖ పత్రిక 2013లో చేసిన అధ్యయనం ప్రకారం ఇండియాలోని మధుమేహ రోగుల్లో మెట్ఫార్మిన్ విడిగా వాడేవాళ్లకంటె యితర మందులతో కలిపి కాంబినేషన్ డ్రగ్‌గా వాడేవాళ్లే ఎక్కువ! జలుబు, జ్వరం, నొప్పి, డయాబెటిస్, బిపి, కొలెస్టరాల్, అనేక యాంటిబయాటిక్స్.. యిలా సర్వ రోగాలకు మనం యివి వాడేస్తున్నాం. మనంతట మనం మందులషాపుల్లో కొనేవే కావు, డాక్టర్లు మనకు రాస్తున్న మందుల్లో కూడా యివి వున్నాయి.
ఏదైనా మందుకు అనుమతి కావాలంటే క్లినికల్ ట్రయల్స్ చేసి ఎలా పనిచేస్తోందో నిరూపించాలి. మందు మార్కెట్లోకి వచ్చాక కూడా వాటి పనితనాన్ని పరీక్షించే లాబ్స్ వుండాలి. మన దేశంలో ఆ ప్రక్రియ పటిష్టంగా లేదు. కొన్ని మందులకు రాష్ట్రస్థాయిలో అనుమతి యిచ్చేస్తారు. వారి వద్ద లాబ్స్ వుండవు, డ్రగ్ కంట్రోలు వ్యవస్థ కూడా సవ్యంగా వుండదు. మందుల కంపెనీలు మందులు తయారుచేసి పబ్లిసిటీ గుప్పిస్తాయి. తమ రిప్రజెంటేటివుల ద్వారా డాక్టర్లను ప్రభావితం చేస్తాయి. పరిశోధన ఫలితాలు తెలుసుకునే సావకాశం డాక్టర్లకుండదు. అందువలన సాధారణ ప్రజలమీదనే సకల ప్రయోగాలు జరుగుతాయి. ఏదైనా చెడుప్రభావం కనబడినా అది దీని కారణంగానే కలిగిందన్న స్పృహ వుండదు. నిరూపించలేరు కూడా. 2010లో కమ్యూనిటీ డెవలప్మెంట్ మెడికల్ యూనిట్, హెల్త్ యాక్షన్ ఇంటర్నేషనల్ అనే స్వచ్ఛంద సంస్థ కలిసి అధ్యయనం చేసి పైన చెప్పిన అసంబద్ధ ఔషధాలు 1356 వున్నాయని, అవి 4559 బ్రాండ్ నేమ్స్‌తో అమ్ముడవుతున్నాయని వెలుగులోకి తెచ్చింది. 2012లో పార్లమెంటు కమిటీ దీనిపై అధ్యయనం చేసి ఒక నివేదిక యిచ్చింది. అనేక ఔషధాలకు సరైన క్లినికల్ ట్రయల్స్ (ఔషధ పరీక్షలు) జరగటం లేదని తేల్చి చెప్పింది. దానిపై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఒక కీ||శే|| రంజిత్ రాయ్ చౌధురీ నేతృత్వంలో నిపుణుల కమిటీ వేసి డ్రగ్ రెగ్యులేటరీ సిస్టమ్‌లోని లోపాలను సరిదిద్దమన్నారు. ఆ కమిటీ 2013లో 100 పేజీల నివేదిక యిచ్చింది. 85 వేల ఫార్ములేషన్స్‌ను పునర్మూల్యాంకనం (రీఎసెస్‌మెంట్) చేయాలని చెప్పింది.
అప్పుడు ప్రభుత్వం బెళగాం యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డా. చంద్రకాంత్ కోకాటే నాయకత్వంలోని నిపుణుల కమిటీకి మార్కెట్లో ఏయే మందులను నిషేధించాలో నిర్ణయించే పని అప్పగించింది. వాళ్లు తయారుచేసిన తొలి జాబితాలో 344 వున్నాయి. వాటిలో చాలాభాగం మందులను పశ్చిమదేశాల్లో ఎప్పుడో నిషేధించారు. దీనితో బాటు సెంట్రల్ ఎక్స్పర్ట్ కమిటీ కూడా అధ్యయనం చేసి 500 ఎఫ్‌డిసిల జాబితా తయారుచేసింది. వాటిని కూడా నిషేధిద్దామనుకుంటున్నారు. ఇది వినగానే ఇండియన్ ఫార్మా యిండస్ట్రీ గందరగోళపడింది. ఎందుకంటే 344 కాంబినేషన్లంటే సుమారు 2500 బ్రాండెడ్ డ్రగ్స్ అన్నమాట. వాటి అమ్మకం వలన వాళ్లు ఏటా రూ. 5 వేల కోట్లు సంపాదిస్తున్నారు. ఎలా చూసుకున్నా తక్షణ నష్టం వెయ్యి కోట్ల రూ.లు. రెండో జాబితాలోని 500 మందులు కూడా నిషేధిస్తే అప్పుడు వాళ్ల నష్టం రూ.10 వేల కోట్లు. మన దేశంలో ఔషధ పరిశ్రమ విలువ రూ.2 లక్షల కోట్లు కాబట్టి ప్రజారోగ్యం దృష్ట్యా వాళ్లు యీ నష్టాన్ని భరించడమే సబబు. అయినా వాళ్లు నిషేధాన్ని ఆపేయమంటూ కోర్టుకి వెళ్లారు. ఢిల్లీ హైకోర్టు వారి పట్ల ఉదారంగా వుంది. మద్రాసు హై కోర్టు ఢిల్లీ హైకోర్టు తీరుతో విభేదిస్తోంది. ప్రజాసంక్షేమం దృష్ట్యా నిషేధం వెంటనే అమలు చేయాలంటోంది. రెండు కోర్టులు చెరోలా చెపుతున్నాయి కాబట్టి విషయం సుప్రీం కోర్టుకి చేరవచ్చు. అక్కడ ఎన్నాళ్లు పడుతుందో, యీ లోగా ఎందరి ఆరోగ్యాలు చెడతాయో తెలియదు. వ్యవహారాన్ని కడదాకా, వేగిరంగా నడిపించే చిత్తశుద్ధి ప్రభుత్వానికి వున్నప్పుడే యిలాటి నిషేధాలు అమలవుతాయి. లేకపోతే కమిటీ నివేదికలు బుట్టదాఖలే! మన ప్రాణాలు దవాఖానాదాఖలే!
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2016)