రాజు వుండేవాడు, అతని తప్పులని ఎత్తి చూపించి ధర్మాన్ని నిలబెట్టేందుకు బ్రాహ్మణ వ్యవస్థ వుండేది. ఇక్కడ అర్థం చేసుకోవలసినది ఒకటుంది. బ్రాహ్మణుడు అంటే ఆ కులంలో పుట్టిన ప్రతివాడికీ ధర్మం చెప్పే అర్హత వున్నట్టు కాదు. బ్రాహ్మణులు అనేక వృత్తులలో వుండేవారు. సైనికులుగా, రైతులుగా, పురోహితులుగా, పూజారులుగా, ఉపాధ్యాయులుగా, రాజోద్యోగులుగా రకరకాల పనులు చేసేవారు. పంచతంత్రం కథల్లో చూసినా యీ విషయం బోధపడుతుంది. ఇది గమనించని కొందరు పూర్వవ్యవస్థలో బ్రాహ్మణులు తిని కూర్చునేవారని ఆపోహ పడతారు. కొంతమంది ధర్మస్వరూపులైన బ్రాహ్మణులను మాత్రమే సమాజం పోషించేది. భుక్తికోసం వారు ఆరాటపడనక్కరలేకుండా, ఎవరిపై ఆధారపడనక్కరలేకుండా వారి అవసరాలు తీర్చే ఏర్పాటు చేసేది. అందువలన వారు ఎవరికీ జంకకుండా న్యాయాన్యాయాల గురించి తీర్పు చెప్పేవారు. రాజు తప్పు చేసినా దండించే హక్కు వాళ్లకు వుండేది. సమాజానికి ప్రతినిథి రాజు కాబట్టి రాజు అవి సమకూర్చేవాడు. తనకు వ్యతిరేకమైన తీర్పు చెప్పాడు కదాని వాటిని వెనక్కి తీసుకునే అధికారం రాజుకి లేదు. దురాశతో వాళ్ల ఆస్తి హరించబోతే దండనీయుడే. జమదగ్ని – కార్తవీర్యార్జునుడు కథలో యిది తెలుస్తుంది. ఎవరైనా ఋషి రాజు వద్దకు కుశలప్రశ్నలు వేసినపుడు 'మీ రాజ్యంలో బ్రాహ్మణులు నిర్భయంగా, సుఖంగా వున్నారు కదా' అని అడిగినప్పుడు యిటువంటి బ్రాహ్మణుల గురించే అడుగుతున్నారని గ్రహించాలి. అంతేకానీ మీ పురోహితుడు, మీ వంటబ్రాహ్మడు, మీ మంత్రి, మీ పిల్లలు ధనుర్విద్య నేర్పించే ఆచార్యుడు… అని కాదు. 'చతుస్సాగర పర్యంతం గోవులు, బ్రాహ్మణులు సుఖంగా వుంటే లోకమంతా సుభిక్షంగా వుంటుంది' అనే సూక్తిలో అర్థం కూడా అదే. మన దేశం వ్యవసాయిక దేశం కాబట్టి, మనది స్థిరనివాస జాతి కాబట్టి గోవు, గోరక్షణ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గోవులను ఎత్తుకు పోవడానికి రాజుల మధ్య యుద్ధాలు కూడా జరిగాయి. ఈ బ్రాహ్మణ వ్యవస్థే వేదాలు, పురాణాలు అధ్యయనం చేస్తూ దేశకాల పరిస్థితుల బట్టి స్మృతులు, న్యాయసూత్రాలు ఏర్పరచేది. సమాజంతో బాటు మారుస్తూ వుండేది. ఈ ధర్మవ్యవస్థకు ప్రతినిథిగా వున్న వ్యక్తికి 'ఈ పృథివిపై రాజు తప్ప వేరే విష్ణువు లేడు' అని అందరిచేత అనిపించుకునే రాజు కూడా మోకరిల్లేవాడు. ఆజ్ఞను శిరసా వహించేవాడు. బ్రాహ్మణులుగా పుట్టినా రాజు కొలువులో పనిచేసే ఉద్యోగులకు యిలాటి మన్నన వుండేది కాదు. మంత్రుల స్థాయిలో వున్నవారు సలహా చెప్పగలరు కానీ రాజాజ్ఞను
ఇటువంటి మన సమాజపు తీరుతెన్నులను దృష్టిలో పెట్టుకునే మన రాజ్యాంగ నిర్మాతలు మూడు స్తంభాల వ్యవస్థను ఏర్పరచారు. రాచరికపు వ్యవస్థలో ఉద్యోగుల నియామకాలు రాజు యిష్టాయిష్టాలపై ఆధారపడతాయి. కానీ ప్రజాస్వామ్యంలో ఐదేళ్ల కోసారి ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకులైనవారికి తమ చిత్తం వచ్చినట్లు ఉద్యోగులను తీసేసే అధికారం వుండదు. నాయకులు వస్తూ వుంటారు, పోతూ వుంటారు. కొంతకాలం రాష్ట్రపతి పాలన వుంటుంది, మరి కొంతకాలం ఆపద్ధర్మ ప్రధాని వుంటాడు, కానీ పాలనావ్యవస్థ మాత్రం నడుస్తూనే వుండాలి. ఉద్యోగిగా చేరినవాడు తన ఉద్యోగధర్మాన్ని అతిక్రమించకుండా వుంటే 35, 40 ఏళ్ల పాటు నిరాఘంటంగా పనిచేసుకునే హక్కు కోల్పోడు. పాలకుల కోపతాపాలకు దడిసి వారు నియమాలను అతిక్రమించవలసిన అవసరం లేదు. వారి ఉద్యోగాలకు రాజ్యాంగం ఆ భద్రత కల్పించింది. మరి పాలకుల అవసరం ఏమిటి అంటే అధికార యంత్రాంగానికి ప్రజల పట్ల జవాబుదారీ లేదు. ఉద్యోగభద్రత కారణంగా వారిలో నిర్లక్ష్యం పెరగవచ్చు. అందుకని ప్రజల ప్రతినిథులుగా, వారితో నిత్యం సంపర్కం కలిగిన వ్యక్తులుగా రాజకీయ నాయకులు అధికారులను అదుపు చేస్తూ, నియంత్రిస్తూ, నచ్చచెపుతూ వారి నుండి పని రాబట్టుకోవాలి. వారిద్దరి మధ్య సమీకరణాలు తూకంగా వున్నపుడే పరిపాలన బాగుంటుంది. కొన్ని సందర్భాల్లో యిద్దరూ కుమ్మక్కయి, ప్రజలను దోచుకుంటే అప్పుడు నివారణోపాయం ఏమిటి? దానికోసమే న్యాయవ్యవస్థ పెట్టారు. దానికి స్వతంత్ర ప్రతిపత్తి యిచ్చారు. ఈ మూడు వ్యవస్థలు ఒకరికి మరొకరు చెక్, ఎవరూ వేరేవారిని దాటిపోకుండా నియంత్రిస్తూ వున్నపుడే సమాజం బాగుపడుతుంది.
గతంలో చాలామంది ఉన్నతాధికారులు ధైర్యంగా వుండేవారు. నియమాలను అతిక్రమించిన నాయకులను ఎదిరించేవారు, దాని వలన సంభవించే కష్టనష్టాలను భరించేవారు. ఇటీవలి కాలంలో భజనపరులు ఎక్కువయ్యారు. ఎవరు అధికారంలో వుంటే వారికి తాళం వేయడం ఎక్కువైంది. గట్టిగా మాట్లాడేవారిని అధికారంలోకి వచ్చిన రాజకీయ నాయకులు కీలకమైన పదవుల నుంచి తప్పిస్తున్నారు. కేసులు బనాయిస్తున్నారు. ఇదే ఒక దుష్పరిణామం అనుకుంటే యిప్పుడు న్యాయస్థానాలను కూడా నియంత్రించాలని చూస్తున్నారు. ఇది తప్పు. ఇందిరా గాంధీ హయాంలో యిలాటి ధోరణి వెర్రితలలు వేసింది. వామపక్ష భావాలున్న న్యాయాధీశులు యాక్టివ్ జ్యుడిషియరీ పేరుతో తమ పరిమితులు మీరి ప్రవర్తించారు. సమాజంలో అనేక వ్యవస్థలు భ్రష్టు పట్టాయి. న్యాయవ్యవస్థకు కూడా దానికి అతీతం కాదు. అదీ చెడింది. దాన్ని బాగు చేయాలి. లేకపోతే 2 జి స్కాములు, కోల్‌గేట్ స్కాములు వంటివి ఎప్పటికీ వెలుగులోకి రావు. దాన్ని రాజకీయ నాయకులు చేతిలోకి తీసుకోవాలని చూడడం మంచిది కాదు. అమిత్ షా కేసులో న్యాయస్థానాలు ఎలాటి ఒత్తిళ్లకు లోనయ్యాయో సోదాహరణంగా చూశాం. ఇప్పుడే యిలా వుంటే కొత్త వ్యవస్థ వచ్చాక ఎలా వుంటుందో వూహించుకుంటే భయం వేస్తుంది. ఇదీ యీ అంశంపై నా అభిప్రాయం. ఇక ముక్తాయింపుగా కొన్ని వాక్యాలు రాయాలి. నన్ను విమర్శించేవారు సైతం నన్ను మేధావిగా పేర్కొంటారు. నా బొంద నేనేం మేధావిని?
నా పాఠకుల్లో కొందరు సూపర్ మేధావులు. ఏదైనా అంశాన్ని తెలుసుకోవడానికి, క్రమపద్ధతిలో అర్థం చేసుకోవడానికి నేను చాలా అవస్థ పడతాను. సొహ్రాబుద్దీన్ కేసు చాలా ఏళ్లుగా అప్పుడప్పుడు చదువుతూ వచ్చాను. అతను టెర్రరిస్టు అని చాలా ప్రచారం జరిగింది. 2007 ఎన్నికల సభల్లో మోదీ సొహ్రాబుద్దీన్ వంటి టెర్రరిస్టులను ఏం చేయాలి? అని జనాల్ని అడగడం, 'చంపేయాలి, చంపేయాలి' అని మూకుమ్మడిగా కేకలు పెట్టడం పేపర్లలో చదివాను. హిందూ రక్షకుడైన మోదీని చంపడానికి వచ్చిన ముస్లిం ఉగ్రవాది అన్నారు, తర్వాత కొన్ని రిపోర్టులు చూస్తే అతను పోలీసు రక్షణలో బతికే గూండా అని వుంది. అలాగే ఫేక్ ఎన్‌కౌంటర్ అని గుజరాత్ పోలీసులే ఒప్పేసుకోవడం నాకు బోధపడలేదు. చివరకు యీ కథనం చదివాక అన్ని విషయాలూ తెలిశాయి. అయితే అన్నీ యీజీగా అర్థం కావు. కొంత సమాచారం మెయిన్ స్టోరీలో వుంటుంది, కొంత బాక్సుల్లో, మరి కొంత ఇంటర్వ్యూలలో.. కథనం కూడా సాఫీగా వుండదు. ఫ్లాష్‌బ్యాక్‌లో, ఫ్లాష్ ఫార్వార్డ్‌లో గెంతుతూ వుంటుంది. చిన్నప్పటినుంచి లెక్కల మేస్టారు స్టెప్పులో, స్టెప్పులో అని చంపడం వలన అన్నీ వరుసగా తారీకుల వారీగా వేసుకుంటే తప్ప నాకు రీజనింగ్ అర్థం కాదు. అప్పుడు చచ్చీచెడి, చెమటోడ్చి పాఠకుడికి అర్థమయ్యే భాషలో చెప్పడానికి తంటాలు పడతాను. కానీ కొందరు పాఠకులున్నారే, వాళ్లకు నేనేం రాయబోతానో ముందే తెలిసిపోతుంది. మొదటి భాగం చదవగానే నేను మూడు భాగాలు రాస్తానో, ముప్ఫయి భాగాలు రాస్తానో తెలియకుండానే ఆఖరి భాగంలో ఏమిటుంటుందో, దాని వెనక నా ఉద్దేశం ఏమిటో యిట్టే కనిపెట్టేస్తారు. మా కజిన్ వున్నాడు. అనూరాధా ప్రొడక్షన్స్ వారి మూడో చిత్రం ప్రారంభం అనే వార్త పేపర్లో రాగానే 'ఇది ఫ్లాప్‌రా' అనేవాడు. తారాగణం, సాంకేతిక నిపుణుల గురించి ఏమీ తెలియకుండానే అప్పుడే ఎలా చెప్పగలవ్ అంటే అదంతే అనేవాడు. మళ్లీ అంత మేధస్సు వున్న పాఠకులు యిన్నాళ్లకు తగిలారు. హెడింగ్‌కు, లోపలి సబ్జక్టుకు సంబంధం లేదని మొదటి భాగం చదవగానే చెప్పేయగలుగుతున్నారు. నేను చెప్పినది వాస్తవం కాదని ఖండిస్తే అదో పద్ధతి. ఆ ప్రయత్నం చేయరు.
వీళ్లు చదవగానే.. అని మాటవరసకి అన్నాను కానీ, వాళ్లు చదవనక్కరలేకుండానే అన్నీ గ్రహించేస్తారు. మొదటి భాగంలోనే నేను ఇందిర గురించి రాసి, యిటీవలి కాలంలో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే ప్రభుత్వాలు అనేక కుంభకోణాలపై విచారణలు యిష్టం లేకపోయినా చేపట్టవలసి వచ్చింది అని కూడా రాశాను. అది వీళ్ల కంటికి ఆనలేదు. యుపిఏ గురించి ఏమీ రాయలేదట. ఎనిమిదేళ్లగా కాలమ్ రన్ చేస్తున్నవాణ్ని యుపిఏ గురించి రాయకుండా మోదీ గురించే రాస్తూ వచ్చానా యిన్నాళ్లూ!? అయినా యిది రాజకీయ వ్యవస్థ న్యాయవ్యవస్థను లొంగదీసుకునే ప్రయత్నం. సొహ్రాబుద్దీన్ గూండా అయినా ఎన్‌కౌంటర్ చేసే హక్కు నాయకుల కుందా? మరి సొహ్రాబుద్దీన్ భార్య తప్పేమిటి? ఆమెను చంపినా తప్పు లేదా? ఇక్కడ జరుగుతున్నదేమిటి? రాజకీయనాయకులు పోలీసుల ద్వారా, గూండాల ద్వారా వ్యాపారస్తులను బెదిరించి డబ్బు లాగడం. అన్ని రాష్ట్రాలలో వేర్వేరు స్థాయిల్లో జరుగుతోంది. అమిత్ షా హిందూత్వవాది కాబట్టి దాన్ని సమర్థించాలా? రేపు యుపిలో ఆజం ఖాన్ యిదే పని చేస్తే..? ఒవైసీ యిదే పని చేస్తే…? అప్పుడూ సమర్థిస్తారా?
– (సమాప్తం) ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2015)