జులై 24 – డిక్సన్, కాంతన్ ఫోటోలతో సిట్ పత్రికల్లో ఒక ప్రకటన వేసింది. ''రాజీవ్ గాంధీ హత్యకేసుతో సంబంధం వున్న వ్యక్తులు వీరు. ఆచూకీ తెలిస్తే వెంటనే తెలియచేయండి.'' అంటూ. దానితో బాటు ఒంటికన్నుతో శివరాజన్ ఫోటోను కూడా వేశారు. అది చూసి ఎల్‌టిటిఇ అధినాయకత్వం కూడా నిర్ఘాంతపోయింది. రాజకీయ విభాగానికి, హత్యకు వున్న లింకు ఎలా బయటపడిందాని ఆందోళన పడింది.
xxxxxxxxxxxxxxxx
తన సహాయకుడు, వైర్లెస్ ఆపరేటర్ అయిన రమణన్తో కలిసి కన్నియూరులో రవి నడుపుతున్న తమ వైర్లెస్ శిబిరంలో వున్న కాంతన్ తన పేర వచ్చిన ప్రకటన చూసి కాంతన్ భయపడిపోయాడు. ఈ రవి ఎల్‌టిటిఇ మద్దతుతో టిఎన్ఆర్టి (తమిళ్ నేషనల్ రిట్రీవల్ ట్రూప్స్) అనే సంస్థ నడుపుతాడు. దీనిలో సభ్యులంతా భారతీయ తమిళులే. ఇతని గురించిన వివరాలు 46 వ భాగంలో చూడవచ్చు. రాజీవ్ హంతకులు హత్య చేశాక సురక్షితంగా శ్రీలంక పారిపోవడానికి సురక్షితమైన తీరప్రాంతాన్ని ఎంపిక చేసే పని యితనికి అప్పగించారు. తమిళనాడంతా టిఎన్ఆర్టి శిబిరాలు ఏర్పరచడానికి శివరాజన్ యిచ్చిన 10 లక్షల రూ.లతో కన్నియూరులో ఎల్‌టిటిఇ సానుభూతి పరుడి యింట్లో శిబిరం పెట్టుకుని అక్కడ వైర్లెస్ సెట్టు ఏర్పరచుకున్నాడు. సిట్ ఎప్పుడైతే శివరాజన్‌ను వేటాడసాగిందో అప్పుడు పొట్టుఅమ్మన్ రవి-శివరాజన్ లింకు తెంపేశాడు. శివరాజన్ తను జాఫ్నా ఎలా పారిపోయేదీ రవికి, కాంతన్‌కు చెప్పనవసరం లేదని, తిరుచ్చి శంతనే అన్నీ చూసుకుంటాడని సందేశం పంపాడు. అతను శివరాజన్‌ను కాపాడుకోవాలని చూస్తున్నాడనీ, తాము ఏమై పోయినా పట్టించుకోడనీ కాంతన్‌కు అర్థమై పోయింది. దానికి తోడు యీ ప్రకటన ఒకటి. శిబిరం నడుస్తున్న యింటి యజమాని ఇక మా యింటి నుంచి వైర్లెస్ ఆపరేషన్లు నడిస్తే మాట దక్కదని చెప్పాడు. వేరే చోటకి మార్చేస్తానని రవి అతనికి హామీ యిచ్చాడు.
జులై 25 – తమిళనాడు పర్యటనకు వచ్చినపుడు సిట్ యిచ్చిన వివరణ ఆధారంగా ఎస్బి చవాన్ రాజ్యసభలో 'షణ్ముగంది ఆత్మహత్యే అనిపిస్తోంది. అయినా సంఘటనపై సిట్ యిచ్చిన వివరణతో నేను తృప్తిపడలేదు, కానీ వాళ్లను మనం తీసిపారేయవద్దు, నిరుత్సాహపరచవద్దు.' అని ప్రకటించారు. దీనిపై ఎడిఎంకె, కాంగ్రెస్ (ఐ) సభ్యులు అభ్యంతరం తెలిపారు. ''రాజీవ్ హత్యలో ఎల్టిటిఇది మాత్రమే కాదు విదేశీ శక్తుల ప్రమేయం కూడా వుందని సందేహం వుంది.''అని కూడా చవాన్ అన్నారు.
xxxxxxxxxxxxxxxxxxx
సిట్‌కు కోయంబత్తూరు నుండి ఎవరో ఫోన్ చేసి చెప్పారు – పేపర్లో వేసిన డిక్సన్ పోలికలున్న వ్యక్తి తమ ఏరియాలోని సాయిబాబా కాలనీ టెలిఫోన్ బూత్‌కు తరచు వచ్చివెళ్లడం చూశాం అని. వెంటనే సేలంలో వున్న సిట్ యూనిట్‌ను కోయంబత్తూరు వెళ్లి అక్కడ వున్న సిబిఐ అధికారుల సాయం తీసుకోమన్నారు. ఎల్‌టిటిఇ రాజకీయ విభాగం గురించి, దానిలో పనిచేసే డిక్సన్ గురించి సిబిఐ వారి వద్ద సమాచారం వుంది. 'అతను ప్రధానంగా వైర్లెస్ ఆపరేటరు. ఇక్కడే ఎక్కడో వుండి వుంటే రాజీవ్ హంతకుల గురించి ఎల్‌టిటిఇ ప్రధాన కార్యాలయంతో వైర్లెస్ ద్వారా మాట్లాడుతూ వుండాలి. ఆ సెట్ కారణంగా చుట్టుపక్కల వున్న ప్రాంతాల్లో టీవీ సిగ్నల్స్ తరచుగా అస్తవ్యస్తంగా వస్తూ వుండాలి. అదెక్కడో తెలుసుకుంటే అతన్ని పట్టుకోవచ్చు.'' అన్నారు వాళ్లు. వెంటనే 'టీవీ కార్యక్రమాల సిగ్నల్స్‌లో అంతరాయం వస్తూ వుంటే మాకు తెలియపరచండి' అంటూ పత్రికలో ప్రకటన యిచ్చారు.
జులై 26 – సిట్ ప్రకటన చూసి కోయంబత్తూరులోని తుడియలూరు పోలీసు స్టేషన్‌కు ఓ పెద్ద మనిషి వచ్చి 'తరచుగా ఏమిటండీ, మా టీవీలో రోజూ యిదే తంతు' అని గోలపెట్టాడు. అతని ఎడ్రసు రాసుకుని పంపించివేశారు. అక్కడున్న అన్ని యిళ్లమీద నిఘా పెట్టాలని సిట్, సిబిఐ నిశ్చయించాయి.
xxxxxxxxxxxxxxxxxxxxxx
సిట్‌లో ఒక టీము సుధేంద్ర రాజామీదే దృష్టి పెట్టింది. ఎల్‌టిటిఇకి నిధులు ఎలా వస్తున్నాయి అని అడిగితే 'ఇలాటి పనులు అప్పచెప్పినపుడు మాకు మా శ్రీలంకలో బంగారు బిస్కట్లు యిచ్చి పంపుతారు. వాటిని యిండియాకు వచ్చి నగదు క్రింద మార్చుకుంటాం' అన్నాడు. మరి శివరాజన్‌కు అలా కట్టల కొద్దీ బిస్కెట్లు యిచ్చి వుండవచ్చు కదా, ఎక్కడ దాచి వుంటాడు? అతనికి పరిచయమున్న శ్రీలంక తమిళుల యిళ్లన్నీ మాకు చూపించు అని సుధేంధ్ర రాజాను సిట్ తిప్పసాగింది. ఒక్కొక్కరి వద్దకు వెళ్లి సోదా చేయగా బస్తాలు బస్తాల కొద్దీ బంగారు బిస్కట్లు దొరికాయి. వాటితో బాటు శివరాజన్ డైరీలు దొరికాయి. వాటిలో రాసుకున్న లెక్కల ప్రకారం అతను 5 కిలోల బంగారు బిస్కెట్లను తంబి అన్న అనే అతని ద్వారా రూ.17 లక్షల రూపాయలకు అమ్మేశాడు. దాన్నంతా యిలాటి హత్యా కార్యక్రమాలకు ఖర్చు పెట్టాడు. ఇవన్నీ సిట్‌కు తెలిశాయి.( సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2015)
(ఫోటోలు -శివరాజన్, శుభల ఆచూకీకై వేసిన పోస్టర్, డిక్సన్ (ఒత్తు జుట్టుతో), కాంతన్ (టైతో), తంబి అన్న(తక్కువ జుట్టు) ఫోటో సౌజన్యం – ఇండియా టుడే, ఫ్రంట్‌లైన్