ఇటీవలి కాలంలో అనేక రాష్ట్రాలలో కాపు, జాట్, మరాఠా, పటేల్, వణ్నియార్ వంటి సామాజికంగా అగ్ర శూద్రకులాలు తమను కూడా వెనుకబడిన శూద్రకులాలు (బిసి)లుగా మార్చమని కోరడం ఎక్కువైంది. బిసిల్లోకి కులాల్ని చేర్చిన కొద్దీ డిమాండ్లు మరింతగా వస్తున్నాయి. గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో దాదాపు 180 కులాలను బిసిల్లో చేర్చారు. ఇప్పుడు అక్కడ పటేళ్లు, కాపులు, వణ్నియార్‌లు తమను కూడా చేర్చమని ఆందోళన చేస్తున్నారు. మహారాష్ట్రంలో ఏకంగా 261 కులాలను చేర్చారు. దానివలన సమస్య చల్లారలేదు సరికదా అక్కడ మరాఠాలు పెద్దపెట్టున ఆందోళన చేస్తున్నారు. అంటే బిసిలుగా మార్చడంలో పరిష్కారం లేదని గ్రహించాలి.
ఈ కులాల వాళ్లు రిజర్వేషన్ల కోసం యితర బిసిలతో కలహిస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ వింతగా దళితులపై వ్యతిరేకత కనబరుస్తున్నారు, ముఖ్యంగా మరాఠాల విషయంలో యిది స్పష్టంగా కనబడుతోంది. రిజర్వేషన్ల కారణంగా దళితులు బలపడ్డారని, అనవసరంగా తమపై అత్యాచార కేసులు పెట్టి అప్రతిష్ఠపాలు చేస్తున్నారనీ అంటున్నారు. రాష్ట్రం మొత్తం మీద పెట్టిన అత్యాచార కేసుల్లో 90% మంది నిందితులు మరాఠాలే అని ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు కానీ వాస్తవాలు మరోలా వున్నాయి. మొత్తం ఎఫ్‌ఐఆర్‌లలో దళితులు పెట్టేవి 1% మాత్రమే. ఆ కేసుల్లో కూడా 40% మాత్రమే అత్యాచార చట్టం కింద చేసిన ఫిర్యాదులు. వాటిల్లో కూడా శిక్ష పడినవి అతి తక్కువ. దాదాపు లేవనే చెప్పవచ్చు. ఇప్పుడు మరాఠాల ఆందోళన తర్వాత ఫడ్నవీస్ ప్రభుత్వం ఆ చట్టంలో కొన్ని మార్పులు సూచిస్తోంది. ప్రస్తుతానికి దళితులపై అత్యాచారం వంటి కేసులు పెడితే నిందితుడు బెయిలు కోసం జిల్లా కోర్టుకి వెళ్లలేడు. హైకోర్టుకి వెళ్లి తెచ్చుకోవాలి. దానికి కనీసం రెండు నెలలు పడుతుంది. అప్పటిదాకా కారాగారవాసమే. ఇప్పుడు ప్రభుత్వం జిల్లా కోర్టులు కూడా బెయిలివ్వవచ్చని సవరించబోతోంది. కులం పేరుతో తిట్టాడని పెట్టిన కేసుల్లో వారం కల్లా బెయిలు వచ్చేట్లు చూద్దామనుకుంటోంది.
ముంబయి యూనివర్శిటీలో ఎకనమిక్స్ ప్రొఫెసర్ ఐన నీరజ్ హటేకర్ ప్రకారం '2004 నుంచి 2012 వరకు దేశంలో మధ్యతరగతి బలపడింది. అభివృద్ధి రేటు 6-7% వుండి, గ్రామీణ దారిద్య్రం తగ్గిపోయి, జీతాలు పెరిగి, దళితుల స్థితిగతులు మెరుగుపడ్డాయి. మరాఠా రైతులకు దళిత వ్యవసాయ కూలీలు దొరకడం మానేశారు. తర్వాతి రోజుల్లో దేశ ఆర్థికస్థితి క్షీణించినా 7,8 ఏళ్ల కాలంలో బాగుపడినవాళ్ల దళితులను చూసి మరాఠాలు అసూయపడ్డారు. చదువుపై, ఉద్యోగాలపై శ్రద్ధ పట్టకుండా కేవలం వ్యవసాయాన్ని నమ్ముకోవడం తాము చేసిన పొరపాటని గుర్తించని మరాఠాలు దళితులపై ఆగ్రహం పెంచుకున్నారు.'
''కాస్ట్ బేస్‌డ్ రిజర్వేషన్స్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్, ఎకనమిక్ రిఫార్మ్‌స్, సోషల్ ఎక్స్‌క్లూజన్'' అనే పుస్తకం రాసిన కె.ఎస్.చలం ప్రకారం 'పబ్లిక్ సెక్టార్, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు అన్నీ కలిపి చూస్తే యిప్పటివరకు 25 లక్షల మంది దళితులు రిజర్వేషన్ వలన లాభపడ్డారు. జనాభాలో 25 కోట్ల మంది దళితులున్నారనుకుంటే లాభపడినవారి శాతం 1 మాత్రమే అన్నమాట! ఇక ఒబిసిల దగ్గరకి వస్తే 15 లక్షల మంది ఒబిసిలు రిజర్వేషన్ వలన లాభపడ్డారు. పబ్లిక్ సెక్టార్ ఉద్యోగాలు 1990లలో 1.95 కోట్లు వుంటే 2014 నాటికి అవి 1.70 కోట్లకు పడిపోయాయి. ప్రస్తుతం ప్రయివేటు రంగంలోని ఐటీ సెక్టార్, సర్వీసెస్ సెక్టార్‌లలో ఉద్యోగావకాశాలు పెరిగాయి. వాటిల్లో రిజర్వేషన్ నిబంధన లేకపోవడం చేత, బాగా చదువుకున్న బ్రాహ్మణ, బనియా, యితర సామాజిక అగ్రవర్ణాల వారు ఉద్యోగాలు సంపాదించుకుని యిబ్బడిముబ్బడిగా సంపాదించుకుంటున్నారు.'
అంకెల మాట ఎలా వున్నా చివరి పరిశీలన వాస్తవమే అని చెప్పాలి. ప్రయివేటు సెక్టార్‌లో ఉద్యోగాలు పెరిగినకొద్దీ అవి కులపరంగా కాక, ప్రతిభ, పనిచేసే తీరు వంటి అంశాలపై ఆధారపడుతున్నాయి. ప్రభుత్వోద్యోగాలలో రిజర్వేషన్ బాదరబందీతో విసిగిన అగ్రవర్ణాలు యీ ఉద్యోగాలకై శ్రమించి చేజిక్కించుకుంటున్నారు. అది దళితులకు, బిసిలకు కన్నెఱ్ఱగా వుంది. పేరుకు రిజర్వేషనే తప్ప, ఆచరణలో తమకు దక్కేది ఏమీ లేదని, నిజంగా బాగుపడుతున్నది అగ్రవర్ణాలే అని వారికి అర్థమవుతోంది. దానికి విరుగుడు ప్రయివేటు రంగంలో కూడా రిజర్వేషన్ పద్ధతి ప్రవేశపెట్టడమే అని వారి కులాల నాయకులు వారికి నచ్చచెపుతున్నారు. కానీ పెట్టుబడిదారుడి అడుగులకు మడుగులు ఒత్తే యీ రోజుల్లో ప్రభుత్వం యిలాటి నిబంధనలు వారిపై విధిస్తుందా అన్నది సందేహమే. రిస్కు తీసుకుని పెట్టుబడి పెట్టేవాడికి ఉద్యోగులను ఎంచుకునే హక్కు యివ్వకపోతే అతను విసిగి, వేసారి ఫ్యాక్టరీ మూసేస్తానంటే ఏం చేయాలన్న భయం ప్రభుత్వానికి వుంటుంది. ఈ విషయాన్ని ఆ యా కులాల యువత గ్రహిస్తే, తమ ప్రతిభావ్యుత్పత్తులను పెంచుకోవడానికి ప్రభుత్వసాయం అడిగేవారు తప్ప, కాలేజీ సీట్లలో, ఉద్యోగాలలో రిజర్వేషన్లకై పట్టించుకునేవారు కారు. వారు ఆ విషయాన్ని గ్రహించకుండా వారిని కులం పేర ఆవేశకావేషాలలో ముంచెత్తడానికే కులనాయకులు ప్రయత్నిస్తూండడం దురదృష్టకరం.
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2016)