ఆరెస్సెస్‌లో క్రమశిక్షణ ఎక్కువ. దాని సిద్ధాంతాలను మనసా, వాచా, కర్మణా నమ్మిన దాని కార్యకర్తలే ఆ సంస్థలో కొనసాగగలరు. ఆరెస్సెస్‌లో కాని, కమ్యూనిస్టుల్లో వాదోపవాదాలు తక్కువ. అధినాయకత్వం చెప్పినది తల వంచుకుని వింటారు. అలా వంచకుండా స్వతంత్రంగా ఆలోచించేవారిని, సందేహాలు వెలిబుచ్చేవారినీ సంస్థలో వుంచరు. కమ్యూనిస్టుల్లో ఆ కట్టుబాటు చెదిరిపోయి చాలాకాలమైంది. గోవా ఆరెస్సెస్ సంఘచాలక్ సుభాష్ వెళింగ్‌కర్‌ను 300 మంది అనుచరులతో సహా సంస్థ నుంచి బహిష్కరించడంతో ఆరెస్సెస్‌లో కూడా ముసలం ప్రారంభమైందన్న సంకేతం వెలువడింది. ఇంతకీ వెళింగ్‌కర్ చేసిన తప్పేమిటి? అవినీతికి పాల్పడ్డాడా, పాకిస్తాన్‌ను ప్రశంసించాడా అన్న సందేహం రావచ్చు. అదేమీ లేదు, బిజెపివారు గతంలో చేసిన వాగ్దానానికి కట్టుబడి వుండమని వెంటపడ్డాడు. 1990లో గోవాను మహారాష్ట్ర గోమంతక్ పార్టీ పాలించే రోజుల్లో కొంకణి, మరాఠీ మీడియం స్కూళ్లకు మాత్రమే ప్రత్యేక సాయం చేస్తానని ప్రకటించింది. ఆ సాయం కోసం 136 ఇంగ్లీషు మీడియం స్కూళ్లు (వాటిలో చాలాభాగం చర్చిలు నడిపేవే) రాత్రికి రాత్రి కొంకణి మీడియంలోకి మారిపోయాయి. రెండు దశాబ్దాలు అలా గడిచిపోయాయి. కానీ 2011 జూన్‌లో కాంగ్రెసు ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ క్రైస్తవులను సంతృప్తి పరచడానికి 'ఇంగ్లీషు మీడియం స్కూళ్లకు కూడా సాయం అందిస్తాం' అని ప్రకటించాడు. అంతే మళ్లీ రాత్రికి రాత్రి అవన్నీ కొంకణిని వదిలిపెట్టి ఇంగ్లీషు మీడియం స్కూళ్లగా మారిపోయాయి.
దీన్ని ప్రతిఘటిస్తూ ఆరెస్సెస్ గోవా ఆరెస్సెస్ అధినేత సుభాష్ వెళింగ్‌కర్ 'భారతీయ భాషా సురక్షా మంచ్' (బిబిఎస్‌ఎమ్) అనే సంస్థ ఏర్పాటు చేసి ఉద్యమం మొదలుపెట్టాడు. బిజెపి నాయకుడు మనోహర్ పారీకర్ దానికి మద్దతు యిచ్చాడు. కోర్టులో పిటిషన్ కూడా వేశాడు. తాము గెలిస్తే యీ విధానాన్ని తిరగతోడుతామని బిజెపి ఎన్నికల మానిఫెస్టోలో పెట్టి 2012లో అధికారంలోకి వచ్చింది. మనోహర్ ముఖ్యమంత్రి అయ్యాడు కానీ పాలసీని మార్చలేదు. ఎందుకంటే గోవాలో కాథలిక్ ఓటర్ల సంఖ్య గణనీయంగా వుంది, పైగా 2012 ఎన్నికలలో కాథలిక్కుల ఓట్లు బిజెపికి పడ్డాయి. అతని ఉపముఖ్యమంత్రి కూడా కాథలిక్కే. సుభాష్‌కు అలాటి మొహమాటాలు లేవు కాబట్టి ఉద్యమం కొనసాగించాడు. మనోహర్ సుభాష్‌ను పిలిచి కోర్టులో పిటిషన్ ఉపసంహరించుకోండి, ప్రభుత్వం దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకోబోతోంది అని చెప్పాడు. సుభాష్ విత్‌డ్రా చేసుకున్నాడు. అలా రెండేళ్లు మాటలతో కాలక్షేపం చేసి చివరకు తను కేంద్రమంత్రిగా వెళ్లబోతూ ఆ స్కూళ్లకిచ్చే గ్రాంట్లను కొనసాగిస్తూ ఆర్డరు పాస్ చేసి మనోహర్ వెళ్లిపోయాడు. అతని వారసుడు లక్ష్మీకాంత్ పర్శేకర్‌ను 'మీరైనా ఆ గ్రాంట్ ఆపించండి' అని అడిగాడు. అతనూ మాట్లాడలేదు. దాంతో సుభాష్ మే 21 న 3 వేల మందితో సభ నిర్వహించాడు. ఇంగ్లీషు మీడియం కారణంగా భారతీయ భాషలకు విఘాతం కలుగుతోందని, ఇంగ్లీషు స్థానంలో కొంకణి ప్రవేశపెట్టాలని వారి డిమాండు. ఇది ఆరెస్సెస్ భావజాలానికి సన్నిహితంగా వుండే వాదనే. అయినా బిజెపిపై ఒత్తిడి తేలేదు.
బిజెపికి రాజకీయ అవసరాలే ముఖ్యమై పోయాయి. సుభాష్‌కు ఉద్యమం ముఖ్యం. ఇద్దరిలో ఎవరినో ఒకరినే ఎంచుకోవాలసిన అగత్యం పడింది ఆరెస్సెస్‌కు. వాజపేయి హయాంలో కంటె మోదీ హయాంలో ఆరెస్సెస్-బిజెపి సంబంధాలు మెరుగ్గా వున్నాయి. అనేక విద్యాసంస్థలలో, సాంస్కృతిక సంస్థలలో బిజెపి ఆరెస్సెస్ వారికే పదవుల నిచ్చింది. కానీ ఆరెస్సెస్‌కు తృప్తి లేదు. బిజెపి తగినంతగా చేయడం లేదని ఫిర్యాదు చేస్తోంది. కానీ బిజెపి అధికారంలో వుంది కాబట్టి ప్రతిపక్షాలు, మీడియా చేసే విమర్శలు తట్టుకోవలసిన అవసరం దాని కుంది. హద్దు దాటి వెళ్లడానికి బెదురుతోంది. గోరక్షకుల విషయంలో కూడా మోదీ కాస్త తబ్బిబ్బు పడడం జరిగింది. వారిని విమర్శిస్తే ఆరెస్సెస్‌కు కోపం వస్తుందని కాస్త జంకినా, కానీ ఊనా ఘటన తర్వాత దళిత ఓట్లను దృష్టిలో పెట్టుకుని మోదీ 'గోరక్షకుల పేర పనిచేసే వారిలో 80% మంది బోగస్ అని, కావాలని గొడవలు సృష్టించేవారని' అనవలసి వచ్చింది. దీనికి విశ్వహిందూ పరిషత్ చీఫ్ ప్రవీణ్ తొగాడియా తీవ్రంగా స్పందించి మోదీతో 'తమరే గతంలో గోరక్షకులను కీర్తించారు' అని గుర్తు చేసి ఆరెస్సెస్‌కు ఫిర్యాదు చేశాడు. ఆరెస్సెస్‌కు ఏం చేయాలో బోధపడక చివరకు నకిలీ గోరక్షకుల మీద దృష్టి పెట్టాలని అంటూనే 80% మంది నకిలీ అనడం సబబు కాదంది.
ఏది ఏమైనా బిజెపికి రాజకీయంగా యిబ్బందులు కలిగించాలని యీ దశలో ఆరెస్సెస్ అనుకోవటం లేదు. అందుకనే సుభాష్‌పై చర్య తీసుకుంది. తన ఉద్యమానికి ఆరెస్సెస్, బిజెపి మద్దతు యివ్వకుండా అడ్డు తగలడంతో కినిసిన సుభాష్ కొంకణి భాషారక్షణకై బిజెపికి వ్యతిరేకంగా కొత్త పార్టీ పెడతానని ప్రకటించాడు. అదే అదనుగా ''అతను రాజకీయ పరమైన చర్యలకు పాల్పడ్డాడు. బిజెపి అధ్యక్షుడు అమిత్ షాకు వ్యతిరేకంగా నల్లజండాల ప్రదర్శన నిర్వహించాడు. ఆరెస్సెస్ క్రమశిక్షణను ఉల్లంఘించాడు. కొత్త పార్టీ పెట్టదలచుకుంటే ఆరెస్సెస్ పదవి వదిలేయాల్సింది. అతని భాషా ఉద్యమాన్ని సమర్థిస్తాం కానీ అతని చేష్టలను కాదు. అందుకే అతన్ని సంస్థ నుంచి పంపించివేశాం.'' అంటూ ఆరెస్సెస్ ప్రచార్ ప్రముఖ్ మన్‌మోహన్ వైద్యా ప్రకటించారు. ఈ ఉదంతం చెప్పే పాఠం ఏమిటంటే – ఏ క్రైస్తవ ఓట్ల కోసమైతే కాంగ్రెసు 2011లో రూలు మార్చిందో, అదే ఓట్ల కోసం బిజెపి యథాతథ పరిస్థితి కొనసాగిస్తోంది. ప్రతిపక్షంలో వుండగా ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట. తమకు రాజకీయాలతో సంబంధం లేదని ఆరెస్సెస్ చెప్పినా బిజెపి రాజకీయ ప్రయోజనాలు కాపాడడమే దాని లక్ష్యం. ఒక రాష్ట్ర సంఘచాలక్ స్థాయి దాకా వచ్చినా అది గ్రహించలేని సుభాష్ అమాయకుడు.
ఫోటో – సుభాష్ వెళింగ్‌కర్
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2016)