హిందీని ఎలాగైనా ఇంగ్లీషు స్థానంలో తెచ్చేసి, తమ ఆధిపత్యం పెంచుకోవాలని గోవింద వల్లభ్ పంత్ వంటి కొందరు నాయకులు ప్రయత్నిస్తూండగానే ఫ్రాంక్ ఆంథోనీ అనే నామినేటెడ్ ఆంగ్లో-ఇండియన్ ఎంపీ రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్‌లో ప్రస్తావించబడిన ప్రాంతీయ భాషలతో బాటు ఇంగ్లీషును కూడా జోడించాలని పార్లమెంటులో ఒక ప్రయివేటు బిల్లు ప్రవేశపెట్టాడు. ఆ బిల్లు చర్చ సందర్భంగా 1959 ఆగస్టు 7 న నెహ్రూ హిందీయేతరులకు యీ విధంగా హామీ యివ్వడం జరిగింది. ''హిందీని ఎవరిపైనా బలవంతంగా రుద్దడం జరగదు. ఇంగ్లీషును తొలగించడం యిప్పట్లో జరగదు. హిందీతో బాటు ఇంగ్లీషును అనుబంధ భాషగా కొనసాగిస్తాం. దానికి కాలపరిమితి ఎంతో నేను చెప్పలేను. ఆ నిర్ణయం తీసుకోవలసినది హిందీ ప్రాంతీయులు కాదు, హిందీయేతర ప్రాంతీయులే. హిందీ రాకపోవడం చేత తమ అభివృద్ధికి ఆటంకం లుగుతోందన్న భీతి హిందీయేతర ప్రాంతాలవారికి కలగకుండా చూసినప్పుడే యిది సాధ్యపడుతుంది. వారు కోరుకున్నంతకాలం వారు కేంద్రంతో ఇంగ్లీషులో ఉత్తరప్రత్యుత్తరాలు సాగించవచ్చు.'' దీన్ని ఇంగ్లీషు వాడకం గురించి నెహ్రూ హామీగా పేర్కొంటారు. దీన్ని హిందీయేతర రాష్ట్రప్రజలందరూ హర్షించారు.
పెరియార్ అన్న కొడుకు ఇవికె సంపత్ 1957 లోకసభ ఎన్నికలలో గెలిచి, ఢిల్లీ వెళ్లడంతో అతని దృక్పథం విశాలమైంది. జాతీయస్థాయిలో ఆలోచించిన కొద్దీ ప్రాంతీయ దురభిమానంతో కూడిన తన పార్టీ పద్ధతులు రుచించడం మానేశాయి. పైగా తన పార్టీలో సినిమావాళ్లందరూ చేరి, పార్టీని పాప్యులర్ చేసిన మాట నిజమే కానీ, మొదట్లో వున్న సిద్ధాంతాలు పలచబడ్డాయని గ్రహించాడు. 1959 జులైలో జరిగిన సమావేశంలో ఒకే వ్యక్తికి పార్టీ పదవి, చట్టబద్ధమైన పదవి వుండకూడదని ఏదో ఒకదాన్ని వదులుకోవాలనీ ప్రతిపాదించాడు. అణ్నా, కరుణానిధి యిద్దరికీ పార్టీ పదవులతో బాటు ఎమ్మెల్యే పదవి కూడా వుంది. అలా ఒక సంప్రదాయం వుంటే మంచిదే కానీ, అలాటి రూలు పెట్టుకోనక్కరలేదని అణ్నా అందరినీ ఒప్పించాడు. 1960లో జనరల్ సెక్రటరీ పదవికై సంపత్ అభ్యర్థి, కరుణానిధి అభ్యర్థి పోటీ పడితే ఘర్షణ నివారించడానికి అణ్నా తనే ఆ పదవి చేపట్టాడు. ఆ సమయంలో సంపత్ మనుషులను తనవైపు తిప్పుకుని అతన్ని బలహీనపరచాడు.
1961 జనవరిలో వెల్లూరులో జరిగిన సమావేశంలో సంపత్‌పై అణ్నా అనుచరుల దాడి జరిగింది. సంపత్‌కు వ్యతిరేకంగా అణ్నా ఒక వ్యాసం రాస్తే సంపత్ దానికి జవాబుగా రాసిన వ్యాసంపై అభ్యంతరం తెలుపుతూ కరుణానిధి, ఎమ్జీయార్, ఎస్‌ఎస్ రాజేంద్రన్ సంపత్‌పై విరుచుకుపడ్డారు. రాజేంద్రన్ అతన్ని కొట్టాడు కూడా. దాంతో సంపత్, అతని అనుచరులు తమ పదవులకు రాజీనామా చేశారు. ''పీఠాధిపతిగా వ్యవహరిస్తున్నందుకే పెరియార్‌ను విడిచిపెట్టాం, ఇక్కడ అణ్నాను మరో పీఠాధిపతిగా కానివ్వం'' అన్నాడు సంపత్. అణ్నా సంపత్‌తో రాజీ పడినట్లే ప్రవర్తించాడు కానీ వారి మధ్య పొసగలేదు. చివరకు ఏప్రిల్ నెలలో సంపత్, కణ్ణదాసన్ పార్టీలోంచి బయటకు వచ్చి ''తమిళ నేషనల్ పార్టీ (టిఎన్‌పి)'' అని పెట్టారు. కానీ నిలదొక్కుకోలేక పోయారు. ఏడాది తిరిగేసరికి కామరాజ్ హితవు విని కాంగ్రెసులో పార్టీని విలీనం చేసేశారు.
1962 సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెసుకు వ్యతిరేకంగా ముస్లిం లీగు, కమ్యూనిస్టులు, రాజాజీ పెట్టిన స్వతంత్ర పార్టీలను కూడగట్టి కూటమి తయారుచేద్దామని డిఎంకె ప్రయత్నించింది. కానీ నియోజకవర్గాల గురించి పేచీ వచ్చింది. చివరకు ముక్కోణ పోటీ ఏర్పడింది. స్వతంత్ర పార్టీ కాంగ్రెసు ఓటుబ్యాంకుకు గండి కొట్టడంతో డిఎంకె లాభపడింది. ఎన్నికల సమయంలో పెరియార్ ''నేను వృద్ధుణ్నయిపోయాను. నా తర్వాత తమిళుల హక్కులు కాపాడగలిగేవాడు కామరాజ్ ఒక్కడే, అతనే నా వారసుడు'' అని ప్రకటించగా, మొన్నటిదాకా కాంగ్రెసులో వుండి బయటకు వచ్చిన రాజాజీ ''ఎలాగైనా సరే కాంగ్రెసును మట్టి కరిపించండి'' అని పిలుపు నిచ్చాడు. ఎమ్జీయార్ తన భార్య సదానందవతి ఆసుపత్రిలో వున్నా (పోలింగు పూర్తయిన మర్నాడే ఆమె మరణించింది) రోజుకు 30-40 మీటింగుల్లో ప్రసంగించేవాడు.
ఫలితాలు వచ్చాయి. 142 అసెంబ్లీ స్థానాలకు, 18 పార్లమెంటు స్థానాలకు పోటీ చేసిన డిఎంకె 50, 7 గెలుచుకుంది. కానీ కరుణానిధి మినహా డిఎంకె నాయకులు చాలామంది – అణ్నాతో సహా – ఓడిపోయారు. 39 స్థానాలకు పోటీ చేసిన స్వతంత్ర పార్టీ 6 తెచ్చుకుంది. కాంగ్రెసు 139 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఓటమితో అణ్నా అసెంబ్లీకి వెళ్లలేకపోవడంతో రాజ్యసభకు ఎంపీగా వెళ్లడానికి నిశ్చయించుకున్నాడు. 1962 మే 1న అణ్నా రాజ్యసభలో యిచ్చిన తొలి ఉపన్యాసంతో జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చేందుకు అవకాశం వచ్చింది. ద్రవిడనాడు డిమాండ్‌కు తక్కిన దక్షిణాది రాష్ట్రాలలో ఎప్పటికీ స్పందన రాదని గ్రహించిన అణ్నా దాన్ని పక్కకు పెట్టేశాడు. ఇక హిందీ వ్యతిరేక ఉద్యమం ఒక్కటే వాళ్లకు మిగిలింది. 1963లో నెహ్రూ తనిచ్చిన హామీని చట్టబద్ధం చేస్తూ పార్లమెంటులో అఫీషియల్ లాంగ్వేజి బిల్లు ప్రవేశపెట్టాడు. దానిపై ప్రసంగిస్తూ అణ్నా ''రేపు మరో ప్రభుత్వం మెజారిటీని ఆసరా చేసుకుని దీన్ని తిరగతోడవచ్చు. అందువలన రాజ్యాంగసవరణ ద్వారా హామీని రాజ్యాంగంలో చేర్చాలి.'' అన్నాడు. 1963 జూన్‌లో డిఎంకె జనరల్ కౌన్సిల్ సమావేశంలో హిందీకి వ్యతిరేకంగా ''ప్రత్యక్ష చర్య'' చేపట్టాలని నిర్ణయించబడింది. ఆ ఉద్యమానికి నాయకుడిగా కరుణానిధిని నియమించారు. హోం మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జులైలో 'ఎప్పటికైనా ఇంగ్లీషు స్థానాన్ని హిందీ ఆక్రమించక తప్పద'ని ప్రకటించారు. ఆ పై నెలలో అణ్నా తంజావూరులో మాట్లాడుతూ 'నిన్నమొన్నటి భాష హిందీ వేలాది సంవత్సరాల తమిళం కంటె గొప్పదా? ప్రపంచంలో ముందుకు సాగడానికి ఇంగ్లీషు, మానసిక అనుబంధం వుండాలంటే తమిళం కావాలి. హిందీతో పనేముంది?' అన్నారు. (సశేషం) ఫోటో – ఇవికె సంపత్
-ఎమ్బీయస్ ప్రసాద్