ప్రాంతీయపార్టీ సొంతంగా రాష్ట్రంలో అధికారంలోకి రావడం తమిళనాడులోనే ప్రారంభం. ఆ తొలి ప్రభుత్వం ఎలా నడిచిందో గమనించడం ఆసక్తికరం. ముఖ్యమంత్రిగా అణ్నా రెండు సంవత్సరాలు కూడా పూర్తిగా లేడు. చివరి 8 నెలలు కాన్సర్‌తో బాధపడ్డాడు. 1969 ఫిబ్రవరిలో మరణించాడు. అందువలన ఆ 15 నెలల పాలన చూస్తే అణ్నా జీవించి వున్నా ఎలా పాలించి వుండేవాడో, ఎన్నో వాగ్దానాలతో అధికారం చేపట్టాక ఏ మేరకు వాటిని నెరవేర్చేవాడో ఒక అంచనా వస్తుంది. ముందుగా అణ్నా సాధించిన కొన్ని విజయాలు – జమీందారీ రద్దు చట్టం వలన భూములు నష్టపోయినవారికి పరిహారం యివ్వడం, భూపరిమితిని 30 నుంచి 15 ఎకరాలకు తగ్గించి భూముల పంపిణీకి శ్రీకారం చుట్టడం, మంత్రుల జీతాలు సగానికి తగ్గించి చిన్న కార్లనే వాడాలని చెప్పడం, సేలం స్టీలు ప్లాంట్, ట్యూటికొరిన్ పోర్టుల ఫైళ్లను కదలించడం, పాత ప్రభుత్వం కంటె విద్యకు రూ.7 కోట్లు ఎక్కువ కేటాయించి, ఏడాదికి రూ.1500 ల ఆదాయం కంటె తక్కువ వచ్చే కుటుంబాలలోని పేదవిద్యార్థులకు కులంతో ప్రమేయం లేకుండా ప్రి-యూనివర్శిటీ వరకు ఉచిత విద్యను అందించడం, చెరువులు, బావుల్లో పూడిక తీయడానికి రూ. 11 కోట్లు కేటాయించడం, బస్సుల జాతీయకరణ చేయడం (దీనిలో రాజకీయకోణం లేకపోలేదు. ప్రయివేటు బస్సు ఆపరేటర్లందరూ కాంగ్రెసుకు నిధులు సమకూర్చినవారే), ఎంత ఒత్తిడి వచ్చినా మద్యనిషేధం కొనసాగించడం.. యిలా. అయినా అనేక విషయాలలో తన ప్రభుత్వం పనితీరుపై ఆయనే నిరాశ చెందాడు.
రూపాయికి మూడు పడుల బియ్యం యిస్తానన్న ఎన్నికల వాగ్దానాన్ని అధికారంలోకి వచ్చాక రూపాయికి ఒక పడి పథకంగా ప్రకటించారు. అదీ మద్రాసు, కోయంబత్తూరు జిల్లాలలో మాత్రమే. అది సరిగ్గా నడవడానికై జిల్లాల మధ్య బియ్యం రవాణాను అనుమతించలేదు. కూడా. కొన్ని నెలల తర్వాత నిధుల కొరత కారణంగా నిలిపివేశారు. 'ఇంతటి గొప్ప పథకాన్ని ఆదుకోమని కేంద్రాన్ని కోరాం. కానీ వాళ్లు నిధులు యివ్వలేదు, అందుకని ఆపేశాం' అన్నాడు అణ్నా. అప్పటి నుంచి యిప్పటిదాకా ప్రాంతీయపార్టీలది యిదే ధోరణి. పథకం ప్రకటించేముందు సాధ్యాసాధ్యాలను కేంద్రంతో చర్చించకుండా అలవికాని వాగ్దానాలు చేసి అమలు చేయకపోవడం, అదేమంటే కేంద్రాన్ని తప్పుపట్టడం. డిఎంకె పార్టీ వాడు కాబట్టి అణ్నా దానికి ఓ ద్రవిడ టచ్ కూడా యిచ్చాడు – 'ఇదే ఉత్తరాదివాళ్లు తినే గోధుమలిస్తామంటే వాళ్లు పది కోట్లయినా యిచ్చేవారు. బియ్యం యిస్తామన్నాం కాబట్టి యిలా చేశారు' అంటూ. అణ్నా ప్రభుత్వం ఆర్థికవ్యవహారాల మేనేజ్‌మెంట్ సరిగ్గా చేయలేక వడ్డీ రూ.16 కోట్లకు చేరింది. అది వెంటనే వసూలు చేయకుండా మారటోరియం విధించమని కేంద్రాన్ని కోరాడు అణ్నా. ఆర్థికమంత్రి మొరార్జీ అంగీకరించకపోవడంతో కేంద్రాన్ని తిట్టిపోశాడు.
అణ్నా అధికారానికి వచ్చేటప్పటికే నాలుగు టెక్స్‌టైల్ మిల్లులు మూతపడి వున్నాయి. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే మూతపడిన వాటి సంఖ్య 27 అయింది. అనేక పరిశ్రమలు, ఫ్యాక్టరీలలో కూడా సమ్మెలు జరగడంతో మూతపడే పరిస్థితి వచ్చింది. వర్కర్లు రోడ్డున పడుతూండడంతో అణ్నా బాధపడి వారికి నెలకు రూ.100 చొ||న యిస్తానన్నాడు. రెండు నెలలు అలా యిచ్చేసరికి నిధులు నిండుకున్నాయి. నిపుణుల కమిటీ వేసి దాని సలహా ప్రకారం రూ.2.50 కోట్లకు బ్యాంకులకు పూచీ పడి ఋణాలు సంపాదించి, మిల్లు యాజమాన్యాలకు డబ్బిచ్చి మళ్లీ ప్రారంభించమని కోరాడు. వాళ్లు ఆ డబ్బు మింగేసి, త్రేన్చేసి, నాలుగు రోజులకు మిల్లులు మూసేసి పారిపోయారు. ఆ పరిస్థితిలో ఏం చేయాలో తెలియక కేంద్రమే ఆ మిల్లులను టేకోవర్ చేయాలని డిమాండ్ చేశాడు అణ్నా. కనీసం వాళ్లకు ఎక్సయిజ్ పన్ను ఎత్తేయాలన్నాడు. ఇలా చేయడం మొదలెడితే ప్రతీ రాష్ట్రం యిలాటి కోర్కెలే కోరుతుందని భయపడి, కేంద్రం నిరాకరించింది. అణ్నా కేంద్రాన్ని విమర్శించి తృప్తిపడ్డాడు.
భక్తవత్సలం హయాంలో రూ.10 లక్షల అవినీతి జరిగిందని ఎన్నికలలో డిఎంకె చాలా యాగీ చేసింది. 'బక్తవచ్చలం – పత్తు లచ్చం' అనే స్లోగన్‌తో ప్రజలను ఆకట్టుకున్నారు. కానీ అణ్నా హయాంలోనే అవినీతి ప్రారంభమై పోయింది. పార్టీ నాయకులు, మంత్రులు లైసెన్సులు, పర్మిట్లు యివ్వడానికి డబ్బు పుచ్చుకోసాగారు. అణ్నా మాత్రం నిజాయితీగానే, అతి సింపుల్‌గా ఏ ఆడంబరమూ లేకుండానే బతికాడు. తన యింట్లోనే వున్నాడు. కానీ అతని అనుచరుల్లో చాలామంది డబ్బు మరిగారు. ఇది తెలిసి అణ్నా ఖిన్నుడై తన మిత్రుల వద్ద ''రావలసినదాని కంటె ముందుగానే మా పార్టీ అధికారంలోకి వచ్చేసింది. నా అనారోగ్యం వలన ఏమీ చేయలేకపోతున్నాను. విశ్రాంతికని ఏ కులూ మనాలీయో వెళదామంటే వీళ్లు కొంప ముంచేస్తారేమోనని భయం. అందుకని మద్రాసు విడిచి వెళ్లలేను.'' అని వాపోయాడు. డిఎంకె అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో మద్రాసులోనే 600 మురికివాడలు ఒకదాని తర్వాత మంటలకు ఆహుతి అయిపోయాయి. డిఎంకె నాయకులే కావాలని చేయించి, వాటిని ఆక్రమిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.
తమిళం పేరు మీద పనులు మాత్రం కొన్ని జరిగాయి. మద్రాసు రాష్ట్రం పేరు తమిళనాడుగా మార్చారు. రెండవ ప్రపంచ తమిళ మహాసభలు జరిపారు. 1966 ఏప్రిల్‌లో మలేసియాలో మొదటి సభ జరిగినప్పుడు దానికి హాజరైన భక్తవత్సలం 1968లో రెండవ సభ మద్రాసులో జరుపుతామని హామీ యిచ్చాడు. కానీ అప్పటికి అణ్నా ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ సందర్భంగా మౌంట్ రోడ్డును అణ్నా శాలైగా పేరు మార్చారు. అణ్నా విగ్రహం స్థాపించారు. మెరీనా బీచ్‌లో అనేకమంది తమిళ ప్రముఖుల విగ్రహాలు స్థాపించారు. సభలు జరుతున్నప్పుడే పార్లమెంటులో అధికారభాషా చట్టం జారీ అయింది. ఐయేయస్ పరీక్షలకు ఇంగ్లీషుతో బాటు హిందీని కూడా చేర్చారు. ప్రాంతీయ భాషలకు దేనికీ ఆ సౌకర్యం లేదు. (అది చాలా ఏళ్ల తర్వాత వచ్చింది) దానివలన హిందీ భాషీయులకు మాతృభాషలో రాయగలరు, కానీ యితరులు పరాయి భాష అయిన ఇంగ్లీషులో రాయాలి. దీన్ని నిరసిస్తూ తమిళనాడు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రతిపక్షంలో వుండగా అయితే డిఎంకె దీనికి మద్దతు పలికి వుండేది. అధికారంలో వుండి దీన్ని ఎలా హేండిల్ చేయాలో తెలియక తబ్బిబ్బు పడింది. అణ్నా వంటి తమిళ రక్షకుడు ముఖ్యమంత్రిగా వుండి కూడా ఏమీ చేయటం లేదని విద్యార్థులు ఆగ్రహించారు. బస్సులు కాల్చారు. ఏం చేయాలో తెలియక చివరకు 1968 జనవరిలో అసెంబ్లీ సమావేశపరచి యిప్పటినుంచి త్రిభాషా సూత్రం అమలు చేయం అనీ, తమిళనాడు గవర్నమెంటు స్కూళ్లలో హిందీ బోధన నిలిపివేస్తున్నామనీ తీర్మానం పాస్ చేయించాడు. స్కూల్లో, కాలేజీల్లో ఎన్‌సిసిలో హిందీ ఉపయోగించకూడదని కూడా ఆదేశాలు యిచ్చాడు.
ఒక ప్రాంతీయపార్టీ నాయకుడు ముఖ్యమంత్రి కావడం ఇండియాలో వున్న అమెరికా రాయబారి చెస్టర్ బౌల్స్‌ను మెప్పించింది. అమెరికాలోని యేల్ యూనివర్శిటీలో అణ్నా చేత ఉపన్యాసం ఏర్పాటు చేశాడు. 1968 ఏప్రిల్‌లో రోమ్ మీదుగా అమెరికా వెళ్లి తిరుగు ప్రయాణంలో టోక్యో, సింగపూరు ద్వారా తిరిగి వచ్చాడు. డిఎంకె అధికారంలోకి వచ్చిన 18 నెలలకు ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి కానీ అది నెగ్గలేదు. (సశేషం)
ఫోటో – ముఖ్యమంత్రిగా వున్న ప్రమాణస్వీకారం చేస్తున్న అణ్నా
-ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2015)