అలా మనసులో వుంచుకుంటే ఫరవాలేదు, యితరులపై తమ ప్రతాపం చూపనంతవరకు! నేను వెజిటేరియన్ కాబట్టి నువ్వు నాన్‌వెజ్ తినడానికి వీల్లేదు అన్నప్పుడే చిక్కు వస్తుంది. ఒక్కోప్పుడు శాకాహారులు, మాంసాహారులు పెళ్లి చేసుకుంటూ వుంటారు. కొన్ని సర్దుబాట్లు చేసుకుంటూ వుంటారు. ఇంట్లో వండకూడదు కానీ బయట హోటల్లో తినవచ్చనే టైపులో! ఆ షరతులకు ఒడంబడే పెళ్లాడతారు. ఎలాటి ఒప్పందం లేకుండా నువ్వు మా కాలనీలో వున్నావు కాబట్టి తినడానికి వీల్లేదు, మా వూళ్లో వున్నావు కాబట్టి తినడానికి వీల్లేదు అనడం అన్యాయంగా తోస్తుంది. పాలితాణా అని గుజరాత్‌లో ఒక వూరుంది. జైనుల పుణ్యక్షేత్రం. జైనులు శాకాహారులు కాబట్టి ఆ వూళ్లో ఎవరూ మాంసాహారం తినడానికి వీల్లేదు, అమ్మడానికి వీల్లేదు అని గత ఏడాది రూలు పెట్టబోయారు. అది అన్యాయం. అలాటి రూలు ఆ గుళ్లో పెట్టవచ్చు, ఆ గుళ్లన్నీ (వందలాది వుంటాయి) వున్న కొండ ప్రాంతమంతా పెట్టవచ్చు. అక్కడ జంతువులను వేటాడవద్దు అనవచ్చు. అంతేకానీ వూరు మొత్తమంతా వెజిటేరియన్లే వుండాలంటే ఎలా? అక్కడ ఆఫీసులున్నాయి, బ్యాంకులున్నాయి, బదిలీపై వెళ్లినవాళ్లపై యిలాటి నిబంధనలు పెడితే ఎలా? ఇవాళ శాకాహారం అంటారు, రేపు జైనులు భూమి కింద పండే బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, చేమ, కంద యిలాటివి తినరు కాబట్టి మీరూ అవి మానేయాలంటారు. సహించాలా? కలకత్తాలో మా కొలీగ్ ఒక మార్వాడీ వుండేవాడు. వేసుకుని వచ్చిన కొత్త ప్యాంటు, చొక్కా ఎలకలు కొట్టేసి వుండేవి. అదేమంటే చెప్పేవాడు – బడా బజార్‌లో డెబ్భయి, ఎనభై ఎపార్టుమెంట్లు వుండే పాతకాలం భవంతిలో వుంటారు వాళ్లు. బిల్డింగు అప్పటికే 80 ఏళ్లు పాతది, ఎలకలు, పందికొక్కులు యిష్టారాజ్యంగా తిరిగేవి. ఎలకల మందు పెడితే తప్ప చావవు. కానీ అ బిల్డింగంతా జైన్ మార్వాడీలే కాబట్టి హింసను సహించరు కాబట్టి ఎలకల మందు పెట్టనివ్వరు. దాంతో ఎలకలు యింట్లో గిన్నెల్లో మూతులు పెట్టడమే కాదు, పిల్లల్ని కొరికేయడమే కాదు, యిదిగో బట్టలు కూడా కొట్టేసేవి. అహింస కూడా మితిమీరితే కష్టమేరా బాబూ అనిపించింది.
జైనులు ఎక్కడైతే సంఖ్యాపరంగా బలంగా వున్నారో అక్కడ రాజకీయంగా ఒత్తిడి చేసి యిలాటివి అమలు చేయిస్తూంటారు. వాళ్ల పర్యూషన్ పండగ సందర్భంగా మహారాష్ట్రలో మీరా-భయాందర్ మునిసిపల్ కార్పోరేషన్‌లో యీ ఏడాది ఏకంగా 8 రోజుల పాటు మాంసం అమ్మకాలు నిషేధించేట్లా చేశారు. ఆ వూళ్లో జనాభా 8.5 లక్షలుంటే జైనులు 2.5 లక్షలున్నారు. వీళ్ల గురించి తక్కిన 6 లక్షల మంది మాంసభక్షణ మానేయాలట! అది చూసి ముంబయి మునిసిపల్ కార్పోరేషన్‌లో కూడా అలాటిది అమలు చేశారు. 1964లో యిది మొదలుపెట్టినపుడు 2 రోజులు నిషేధించారు. 1994లో సమీక్ష చేసిన కాంగ్రెసువారు కూడా 2 రోజులే అమలు చేశారు. ఇప్పుడు 8కి చేరింది. పోనుపోను ఏమవుతుందో చూడాలి. జైనులు ఒక శక్తిగా వున్న రాష్ట్రాలన్నిటిలో దీన్ని అమలు చేయిద్దామని చూస్తూ వచ్చారు. గుజరాత్‌లో కూడా చేశారు. రాజస్థాన్‌లో కాంగ్రెసు ప్రభుత్వం 5 రోజులు చేస్తే ప్రస్తుతం వసుంధరా రాజె 3 రోజులకు తగ్గించింది. మధ్యప్రదేశ్‌లో ఏడాదిలో మొత్తం 17 రోజుల పాటు నిషేధం వుంటోంది – ఏ పార్టీ అధికారంలో వున్నా! జైనులు ధనికులు కాకపోతే, వారి అభ్యర్థనను ఏ పార్టీ పట్టించుకునేదే కాదన్నది అందరికీ తెలుసు.
చెప్పవచ్చేదేమిటంటే – నీకు ఏదైనా యిష్టం లేకపోతే నువ్వు తినవద్దు, తినమని యింకోళ్లు బలవంతం చేస్తే ఎదిరించు, అదే సమయంలో నువ్వు యింకోళ్లని ఏం తినాలో, ఏం తినవద్దో శాసించకు. అలా చేస్తే దౌర్జన్యం అంటాం. గోవా (అప్పట్లో గోమంతకం అనేవారనుకుంటా)ను పోర్చుగీసు వారు ఆక్రమించినపుడు హిందువులను బలవంతంగా క్రైస్తవంలోకి మార్చారట. ఏదో మీ యింట్లో కృష్ణుడు ఫోటో తీసి క్రీస్తు ఫోటో పెట్టుకోండి అని వూరుకోలేదు. వాళ్ల చేత బీఫ్, పోర్కు బలవంతంగా తినిపించి హిందూమతాచారాల ప్రకారం మతభ్రష్టులను చేశారు. ముఖ్యంగా వారు గోమంతక బ్రాహ్మణులపైనే గురి పెట్టి వాళ్లు రోజూ బీఫ్ తింటున్నారో లేదో యిళ్లకు చెకింగ్‌కు వచ్చేవారు. ఈ యాతన భరించలేక కొంతమంది మంగుళూరుకి పారిపోయి వచ్చారు. మంగుళూరు క్రైస్తవులు కొంతమంది తాము ఒరిజినల్‌గా గోవా బ్రాహ్మలని చెప్పుకుంటూ వుంటారు. మతమార్పిడి ఒక అంశం, యిలా బలవంతంగా బీఫ్ తినిపించడం మరో అంశం. అణచివేతదారులే యిలాటి పనులు చేస్తారు. ఫలానాది తినవద్దని అనడం కూడా అణచివేతే. ముస్లిములు పందిని తినరు. అల్లా నామస్మరణ చేసి, ఒక క్రమపద్ధతిలో కోయని జంతుమాంసాన్ని తినరు. అది వాళ్ల యిష్టం. వాళ్ల మతం. 'అల్లా నామస్మరణ చేయకుండా కోయని మాంసాన్ని మీరూ తినకండి' అంటేనే మనకు మండుతుంది. కురాన్ దృష్టిలో పంది అపరిశుభ్రమైన జీవి. మరి హిందువులకు అది సాక్షాత్తూ విష్ణుస్వరూపం. భూదేవిని రక్షించి వివాహమాడిన అవతారం. తిరుమలలో వెంకన్నను చూసేందుకు ముందుకు వరాహస్వామిని దర్శించి తీరాలి. ఆయన పేరు పిల్లలకు పెట్టుకుంటాం. రాజులు, చక్రవర్తులు వరాహాన్ని ఆరాధించారు. 6 వ శతాబ్దానికి చెందిన చాళుక్యులు ఆదివరాహాన్ని తమ గుర్తుగా స్వీకరించి వరాహం బొమ్మతో నాణాలు వేయించారు. అందుకే వాటికి 'వరహా' అనే పేరు వచ్చింది. ఇదంతా ఇండియాను పాలించిన ముస్లిము పాలకులకు చికాగ్గా తోచి వుండవచ్చు. అయినా వరాహాన్ని పూజించవద్దని మనపై ఒత్తిడి తేలేదు.
ముస్లిములకు తొండ అన్నా అసహ్యమే. దాని ఫ్యామిలీకే చెందిన బల్లిని మనం పూజిస్తాం. బంగారు బల్లి, వెండి బల్లి విగ్రహాలు కంచిలో పెట్టి పిల్లల చేత ముట్టిస్తాం. ఆర్కాటును చాలాకాలం పాలించిన నవాబులు ఇదేం పని? అని నిరసించలేదు. వాటి జోలికి వెళ్లలేదు. మన అలవాట్లు, మన నమ్మకాలు మనవి. ఏదో జాతి వాళ్లకు గుడ్లగూబ చూస్తే వికారంగా తోచవచ్చు. కానీ అది మనకు లక్ష్మీదేవి వాహనం! కోతిని చూస్తే వాళ్లకు వెక్కిరింతగా తోచవచ్చు, అది మనకు భగవత్స్వరూపం. సూర్యుడు వాళ్లకు ఒక నక్షత్రం మాత్రమే. మనకు ప్రత్యక్ష నారాయణుడు! అటువైపు తిరిగి అనాచారం చేయడానికి భయపడతాం. అది చాదస్తమని ఎవరైనా అనుకుంటే అనుకోవచ్చు. ఇలాటి సందర్భాల్లో 'నా జోలికి నువ్వు రావద్దు, నీ జోలికి నేను రాను' అనడమే మంచిది. ఎదుటివాళ్ల నమ్మకాలను, ఆహారపు అలవాట్లను గౌరవించడం నాగరికత మాత్రమే కాదు, మానవీయత కూడా. ఇంకోలా వుంటే అమానుషం. చాలామంది మధ్యయుగపు రాజులే ఉదారంగా వ్యవహరించినప్పుడు, వలసపాలకులైన ఆంగ్లేయులే ఉదారంగా వుండి మన తిండి జోలికి రానప్పుడు, యీ ఆధునిక యుగంలో మనం మరోలా వుంటే ఎలా? (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2015)