ఎమ్బీయస్‌: తిండిపై ఆంక్షలు- 4

ఆ వ్యాసకర్త ఆవుపై ఆదాయం గురించి రాశారు కానీ దాణాకు ఎంత ఖర్చవుతుందో దానిలో రాయలేదు. ముఖ్యమైన సమస్య దాణా లభ్యత. గతంలో జమీందార్లు, నవాబులు పశుగ్రాసం కోసం పశుపాలకులకు ఎకరాలకు ఎకరాలు యినాముగా…

ఆ వ్యాసకర్త ఆవుపై ఆదాయం గురించి రాశారు కానీ దాణాకు ఎంత ఖర్చవుతుందో దానిలో రాయలేదు. ముఖ్యమైన సమస్య దాణా లభ్యత. గతంలో జమీందార్లు, నవాబులు పశుగ్రాసం కోసం పశుపాలకులకు ఎకరాలకు ఎకరాలు యినాముగా యిచ్చారు. వాటన్నిటినీ యిటీవలి కాలంలో ప్లాట్లుగా మార్చేసి జెండాలు పాతేశారు. ఇప్పటి పాలకులకు పశువుల కోసం స్థలాలు కేటాయించే అలవాటు లేదు. వెనకబడిన వర్గాలు, ప్రభుత్వోద్యోగులు కేటగిరీలోకి అవి రావు. దానాదీనా పశువులకు దాణా లేదు, మనకు కూరగాయలూ లేవు. ఆవు, గేదె, గొఱ్ఱె ఏది పెంచాలన్నా అతి కష్టంగా. ఆర్థికభారంగా మారింది. అందుకే గోదానం యిస్తానంటే పుచ్చుకునే బ్రాహ్మడు లేడు. 1969లో మా నాన్న పోయినపుడు లక్షన్నర జనాభా వుండే మా పట్టణంలోనే దానగ్రహీత దొరకలేదు – దాన్ని సాకాలంటే గడ్డి ఖరీదు భరించలేమండి అనేశారు. దగ్గర్లో వున్న పల్లెటూరి నుంచి రప్పించాల్సి వచ్చింది. 2006లో మా అమ్మ పోయినపుడు యీ మహానగరంలో పుచ్చుకునేవాడు దొరకడం అసాధ్యమని తేలిపోయింది. కావాలంటే ప్రత్యామ్నాయంగా డబ్బిచ్చేయండి, తప్ప ఆవుని తీసుకోలేం అని స్పష్టంగా చెప్పారు. గోరక్షణ సమితి అని పెట్టాలంటే పెద్దపెద్ద సంస్థలకే చెల్లుతుంది. 

ఇదీ నేటి సమాజంలో నెలకొన్న పరిస్థితి. నాకు అనిపిస్తూ వుంటుంది మనం హిందువులం 'గోవు మాకు పూజనీయమైనది, తల్లి లాటిది' అనడమే తప్ప చేస్తున్న గోసేవ ఏమిటా అని. గోవులకు గ్రాసం కూడా దొరకని పరిస్థితి తెచ్చిపెట్టాం కదా. నా చిన్నప్పుడే ఆవులు ఆకలేసి సినిమా వాల్‌పోస్టర్లు తినేవి. నిజానికి అవి వాటి తిండి కాదు. ఈ కాలంలో ఏం కనబడితే అది తినే పరిస్థితి దాపురించింది వాటికి. చాగంటి కోటేశ్వరరావుగారు ఓ ప్రవచనంలో చెప్పారు – ఆవులకు తినేందుకు ఏమీ దొరక్క ప్లాస్టిక్‌ సంచులు మింగేస్తే, అవి కడుపులో ఉండలుగా చుట్టుకుని పోయి ఆవులు మహాబాధపడ్డాయట. ఆపరేషన్‌ చేసి, కిలోల లెక్కలో వాటిని బయటకు తీశారట. ప్లాస్టిక్‌ నిషేధం గురించి ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా మనం వాటిని పట్టించుకోవటం లేదు. పులులు తగ్గిపోతున్నాయి, గోమాయువులు తగ్గిపోతున్నాయి, రాబందులు తగ్గిపోతున్నాయి, వాటిని రక్షించి వాటి జనాభా పెంచాలని ఆతృతపడిపోతున్నాం. ఆవుల మాటేమిటి? గోమాతను తల్లితో పోల్చి దణ్ణాలు పెడుతున్నాం. కానీ సొంత తల్లితండ్రులనే వృద్ధాశ్రమాలకు తరిమివేస్తున్నపుడు గోమాతల ఆలనాపాలనా చూస్తున్నామని ఎలా చెప్పుకోగలం? పర్యావరణ రక్షణతో సహా ఎన్నో రకాలుగా చర్యలు తీసుకుని, కార్యక్రమాలు చేపట్టి ఆవుల్ని కాపాడి, ఆ తర్వాత గోమాంస భక్షణ గురించి అవతలివాళ్లకు లెక్చర్లివ్వాలి, కోర్టుల కెళ్లి కేసులు పెట్టాలి.

అసలీ చట్టం కూడా ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలా వుండడమేమిటి? బీఫ్‌ తినేవాళ్లు ఎక్కువమంది వున్న రాష్ట్రానికి కన్సెషనా? అదేం లెక్క? తక్కువమంది వుంటే వాళ్లను తిననివ్వమా? మరి భయాందర్‌లో జైనులు మైనారిటీలోనే వున్నారు. వాళ్ల కంటె తక్కినవాళ్లు రెండున్నర రెట్లు వున్నారు. అయినా వాళ్ల మాట చెల్లింది. జైనుల మనోభావాలు గౌరవించాం అంటారు. హిందువుల మనోభావాలకు దెబ్బ తగులుతోంది కాబట్టి దేశంలో ఎవరూ బీఫ్‌ తినకూడదంటున్నారు. మరి జైనులు, హిందువుల్లో వెజిటేరియన్ల మనోభావాల మాటేమిటి? వాటిని పరిగణనలోకి తీసుకుని దేశంలో ఎవరూ నాన్‌వెజ్‌ తినకూడదంటే అప్పుడేమవుతుంది? నాన్‌వెజిటేరియన్లు వెజిటేరియన్‌ ఫుడ్‌మీద జోకులేస్తూంటారు, రుచీపచీ లేని గడ్డీ, గ్రాసం అంటూ సినిమాల్లో కూడా యీసడిస్తారు. హీరోగారి సినిమా ఓపెనింగ్‌ రోజున దున్నపోతును బహిరంగంగా బలి యిచ్చి వీధులన్నీ రక్తసిక్తం, మాంససిక్తం చేస్తారు. దానివలన శాకాహారుల మనసులు గాయపడవా? దున్నపోతుకు బదులు నీ తలకాయ తెగేసి ఫుట్‌బాల్‌ ఆడతానంటే..? మా చిన్నప్పుడు యజ్ఞయాగాదులు జరుగుతూంటే జీవకారుణ్యసంఘం వాళ్లు వచ్చి బలి యివ్వడానికి తీసుకుని వచ్చిన మేకపిల్లను ఎత్తుకుని పోయేవారు. ఇప్పటికీ జంతుప్రేమికులు మీరు మొసలి చర్మంతో చేసిన బ్యాగులు వాడినా, గొఱ్ఱె బొచ్చుతో చేసిన టోపీలు వాడినా మా మనోభావాలు దెబ్బ తింటున్నాయంటున్నారు. వీటినీ నిషేధిస్తున్నారా? 

ఈ మనోభావాలను కొలిచే సాధనం ఏముంది? ప్రజాభిప్రాయం సేకరించారా? ఈ రోజు శాకాహారిగా వున్నవాడు రేపు మాంసాహారిగా మారవచ్చు, ఇవాళ్టి మాంసాహారి రేపు శాకాహారి కావచ్చు. వెంటనే అర్జంటుగా మనోభావం మార్చేసుకుంటాడా? శాకాహారిగా వున్నవాడికి, కోడిమాంసం తింటే ఒప్పు, ఆవుమాంసం తింటే తప్పు అనుకుంటాడని గ్యారంటీ వుందా? ఇవాళ బొంబాయి మహానగరంలో తమ మాట పరిమితంగా చెల్లించుకుంటున్న జైనులు రేపు కేంద్రంలో నిర్ణయాత్మకమైన స్థానంలోకి వచ్చి దేశం మొత్తం మీద మాంసాహారం తినకూడదని చట్టాలు చేయిస్తే…? అప్పుడు 'మా నోటికాడ తీసేయడం అన్యాయం' అని హిందూమాంసాహారులందరూ గగ్గోలు పెట్టరా? అదే మాట యిప్పుడు ముస్లిములు, క్రైస్తవులు అంటున్నారు. ఏ రాష్ట్రంలో ఏ మతస్తులు ఎంతమంది వున్నారు అనే లెక్కలేసి చట్టాలు అమలు చేయడం కాదు, అసలు తినే తిండి జోలికి వెళ్లే హక్కు ప్రభుత్వానికి వుందా లేదా అన్నది ప్రశ్న. తాగుడు, పొగాకు సేవనం విషయంలో జోక్యం చేసుకుంటోంది కాబట్టి తిండి విషయంలో చేసుకోవచ్చు అనే వాదన చెల్లదు. ఎందుకంటే ఆ అలవాట్లు ఆ వ్యక్తికి, అతని కుటుంబానికి, సమాజానికి చెరుపు చేస్తాయి. బీఫ్‌ తినడం వలన అలాటి ప్రమాదాలు వున్నాయని ఎవరూ చెప్పటం లేదు కదా. 

మద్యనిషేధం వంటి సీరియస్‌ విషయంలో కూడా ఏ ప్రభుత్వాన్నయినా చూడండి 'తాగుడు మంచిది కాదు, మద్యపాన నిషేధం మా లక్ష్యం, అయితే దాన్ని నిషేధిస్తే అలవాటు పడ్డవాళ్లు యిబ్బంది పడతారు. అలవాటు ఒక్కసారిగా మాన్పించడం కష్టం. అందుకని యీలోగా వారిని లాలించి, బుజ్జగించి, నచ్చచెప్పి, నీరా వంటి ప్రత్యామ్నాయాలు చూపించి అప్పుడు మాన్పిస్తాం' అంటూంటారు. ఈ లాజిక్‌ బీఫ్‌ విషయంలో ఎందుకు అవలంబించరు? బెదిరింపులతో మాన్పిద్దామని ఎందుకు చూస్తారు? ముస్లిముల చేత, క్రైస్తవుల చేత బీఫ్‌ మాన్పించాలంటే వారికి ప్రత్యామ్నాయం చూపించగలగాలి. ఇతర మాంసాలను బీఫ్‌ కంటె చవగ్గా అందించడం ఉత్తమమైన మార్గం. లెగ్‌హారన్‌ కోడిగుడ్లు పుట్టించినట్లు, ఫ్రూట్‌ జ్యూస్‌ల స్థానంలో ఎస్సెన్స్‌తో డ్రింకులు కనిపెట్టినట్లు, మాయాగోమాంసాన్ని కెమికల్‌గా సృష్టించి వాడకంలో పెట్టడం మరో మార్గం. ఇది చెప్పినంత సులభం కాదు. ధరవరలను తగ్గించాలి. కందిపప్పు కిలో 150 రూ||లకు చేరి ఫక్తు వెజిటేరియన్లు కూడా ప్రొటీన్ల కోసం గుడ్డు తినడం మొదలుపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాటి పరిస్థితుల్లో మాంసం ధర తగ్గించే ఏర్పాట్లు ఏం చేయగలుగుతారు? నిజానికి యితర మతస్తులే కాదు, హిందువుల్లో కూడా చాలామంది బీఫ్‌ తింటున్నారు కాబట్టే, దాని వాడకం ఏటేటా పెరుగుతోందట. వాళ్లంతా బీఫ్‌ తినడం మానేసి యితర మాంసాలే తినడం మొదలెడితే నాన్‌వెజ్‌ ధరలూ పెరిగిపోతాయి. ఆ ధరలు భరించలేకో, లేక జైనుల పండగనో, మరొకటనో చెప్పి ఏడాదికి ఓ నెల్లాళ్లపాటు నాన్‌వెజ్‌ తినకూడదని నిషేధాలు పెడితే అందరూ వెజిటేరియన్లయి పోయి కూరగాయల ధరలు ఆకాశానికి అంటుతాయి. ప్రకృతిలో ఒక బాలన్సింగ్‌ వుంటుంది కాబట్టే అన్ని ప్రాణులకూ ఏదో ఒక ఆహారం లభిస్తోంది. మతం పేరు చెప్పో, చట్టం పేరు చెప్పో, అధికారం అండ చూసుకునో మనం తూకాన్ని అటూయిటూ చేస్తే అంతా గందరగోళమే! (సమాప్తం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2015)

[email protected]

Click Here For Archives