ఎమ్బీయస్‌: యూనివర్శిటీలా? యుద్ధభూములా? – 1/3

హైదరాబాదు యూనివర్శిటీకి అప్పారావుగారు విసిగా వుండకూడదని ఆందోళన చేస్తున్నారు. ఎవరు? ఆ యూనివర్శిటీలో చదివే (!?) విద్యార్థులు గుప్పెడు మందైతే యితర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు, యువతీయువకులు, రాజకీయనాయకులు, సామాజిక కార్యకర్తలు, యింకా…

హైదరాబాదు యూనివర్శిటీకి అప్పారావుగారు విసిగా వుండకూడదని ఆందోళన చేస్తున్నారు. ఎవరు? ఆ యూనివర్శిటీలో చదివే (!?) విద్యార్థులు గుప్పెడు మందైతే యితర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు, యువతీయువకులు, రాజకీయనాయకులు, సామాజిక కార్యకర్తలు, యింకా ఎవరైనా ఖాళీగా వుంటే వాళ్లు! అసలు వీళ్లందరికీ అక్కడేం పనో నాకు అర్థం కాదు. ఫలానా ఆయన విసిగా వుండకూడదంటూ వి హనుమంతరావుగారు పిల్‌ వేశారు. నాకు అర్థం కానిదేమిటంటే – విసిగా ఎవరుండాలో చెప్పేందుకు వీరెవరు? విసిగా నియమించినప్పుడు ఏదో ఒక వ్యవస్థ వుంటుంది కదా, వాళ్లు యీయన అర్హతలను లెక్కలోకి తీసుకుని, యితరుల శక్తిసామర్థ్యాలతో బేరీజు వేసి, అందరి నేపథ్యాలు పరిగణించి అప్పుడే ఎంపిక చేసి వుంటారు కదా. ఎంపిక ప్రక్రియ సజావుగా సాగి వుండకపోవచ్చు అనుకుందాం. అనేక చోట్ల సాగటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. పదవి ఆశించి ఇంటర్వ్యూలో భంగపడినవారు ఊరుకుంటారా. కేసు పెట్టరా? పెట్టే వుంటారు. దానికి తగిన సాక్ష్యాధారాలు సేకరించి అసలైన వారికి పంపుతారు కదా. అవేవో తేలనీయండి. ఇవన్నీ అక్కడ తేలవలసిన విషయాలు, యూనివర్శిటీ గేట్ల మీద విరుచుకు పడితే, అక్కడకు వచ్చి ఉపన్యాసాలు దంచితే, విసి ఆఫీసుపై పడి సిబ్బందిని కొడితే తేలేవి కావు. పిల్‌లో యివన్నీ రాశారో లేదో తెలియదు. అక్రమ నియామకాలు జరిగాయన్న అనుమానం వుంటే సంబంధిత శాఖకు అప్పీలు చేయాలి తప్ప పిల్‌ వేయడం దేనికి? పబ్లిసిటీ కోసమా? 'వివరాలు సేకరించకుండా, చట్టం తెలుసుకోకుండా రాకండి' అని కోర్టు మొట్టికాయ వేస్తే అదేం పబ్లిసిటీ? 

అప్పారావుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నవారికి మద్దతుగా కేరళ ముస్లిం యూత్‌ లీగ్‌ ప్రతినిథులు కూడా వచ్చి మద్దతు ప్రకటించారట, పేపర్లో వచ్చింది. ఎందుకో? కేరళలో విద్యాలయాల విసిలందరూ లక్షణంగా వున్నారా? విద్యాలయాలు అమోఘంగా వున్నాయా? సెంట్రల్‌ యూనివర్శిటీలో ఎడ్మిషన్‌ సాధించే విద్యార్హత లేనివాడు కూడా సెంట్రల్‌ యూనివర్శిటీ మీద పడి గోల చేసేస్తున్నాడు. అదేమీ తక్కువ యూనివర్శిటీ కాదని గణాంకాలు చాటి చెప్పాయి. నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ రాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ ప్రకారం యూనియన్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఎచ్‌ఆర్‌డి 3500 విద్యాసంస్థలను సర్వే చేసి ఫలితాలు ప్రకటించారు. యూనివర్శిటీలు, ఇంజనీరింగు స్ట్రీమ్‌, మేనేజ్‌మెంట్‌, ఫార్మసీ అని నాలుగు రకాలుగా విభజించిరీ ర్యాంకింగ్‌ యిచ్చారు. 230 యూనివర్శిటీల్లో హైదరాబాదు సెంట్రల్‌ వర్శిటీకి 85% స్కోరుతో 4వ స్థానం దక్కింది. బెంగుళూరు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌కు మొదటి స్థానం, ఐఐసిటి, ముంబయికి రెండో స్థానం దక్కాయి. మూసిపారేయాల్సిందే అని కొందరు 'జాతీయవాదులు' హుంకరిస్తున్న ఢిల్లీ జెఎన్‌యుకు మూడో స్థానం వచ్చింది. 

దీని అర్థం ఏమిటి? అక్కడ రాజకీయపరమైన, సాంఘికపరమైన ప్రదర్శనలు జరుగుతున్నా జరగవలసిన అసలు పని, అదే విద్యాబోధన జరుగుతోందన్నమాట. ప్రదర్శనలు చేసేవాళ్లు పదుల్లోనో, వందల్లోనో వుంటే, ఆ గోల లేకుండా చదువుకునేవాళ్లు వేలల్లో వున్నారు. ఉస్మానియా అనగానే హాస్టల్లో మెన్యూలో బీఫ్‌ పెట్టాలి, దసరాకు మహిషాసురుడికి సంతాపసభ చేయాలి, దీపావళికి నరకాసురుడికి తద్దినం పెట్టాలి అనే బ్యాచ్‌ గుర్తు వస్తుంది కానీ, చదువుకునే బ్యాచ్‌ కూడా వుంటుందని తట్టదు. ఆ బ్యాచ్‌ కూడా వుంది కాబట్టే దానికి 33 వ ర్యాంకు వచ్చింది. ఈ సర్వేని నమ్మడానికి వీల్లేదనీ, యూనివర్శిటీలు, కాలేజీలు చేసిన క్లెయిమ్స్‌ను ఎచ్‌ఆర్‌డి క్రాస్‌చెక్‌ చేయలేదని కొందరు వాదించవచ్చు. మేనేజ్‌మెంట్‌ విభాగంలో ఐఐఎమ్‌ బెంగుళూరుకు 1 వ స్థానం, ఐఐఎమ్‌ అహ్మదాబాద్‌కు 2వ స్థానం, ఇంజనీరింగు స్ట్రీమ్‌లో ఐఐటి మద్రాసుకు 1వ స్థానం, ఐఐటి హైదరాబాదుకు 7వ స్థానం వచ్చాయంటే నమ్మేట్టుగానే వుంది కదా. 'తెలంగాణలో 20 వర్శిటీలు, ఆంధ్రలో 26 వున్నాయి. వీటిలో 6 మాత్రమే మంచి ర్యాంకులకు నోచుకున్నాయి. 35 పోటీకి దూరంగా వున్నాయి.' అంటే కాదనేట్టుగా లేదు కదా. చైతన్యభారతి మేనేజ్‌మెంటు వివాదాల్లో పడి గతవైభవం పోగొట్టుకుందని చదివాను. ఇప్పుడు చూస్తే ఇంజనీరింగు విభాగంలో 71 వ ర్యాంకు వచ్చింది. అందువలన ఉరామరిగా యివి వాస్తవానికి దగ్గరగానే వున్నాయనవచ్చు. 

ఎచ్‌సియుకు యిప్పుడు 4 వ ర్యాంకు వచ్చింది. అప్పారావుగారు విసిగా ఓ ఏడాది వున్నాక మళ్లీ యిలాటి సర్వే జరిగి అది ఏ పదో ర్యాంకుకో పడిపోతే 'అదిగో ఆయనకు ఎడ్మినిస్ట్రేషన్‌ రాదు, యూనివర్శిటీ క్వాలిటీ పడగొట్టేశాడు' అని గొడవ చేస్తే అర్థముంది. అదేమీ జరగకుండానే ఆయన్ని సాటి ప్రొఫెసర్లు కూడా చిన్నచూపు చూస్తున్నారు. అకడమిక్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేస్తే సగం మంది హాజరు కాలేదు. వచ్చినవారిలో కొందరు కూడా సబ్జక్ట్‌ గురించి మాట్లాడకుండా అప్పారావు గురించి మాట్లాడారు. కౌన్సిల్‌ ఎక్స్‌టెర్నల్‌ మెంబర్‌ హోదాలో వచ్చిన ఢిల్లీ వర్శిటీ ప్రొఫెసర్‌ నందినీ సుందర్‌ '2007 నుంచి 2014 వరకు మీరు పరిశోధక వ్యాసాలను కాపీ కొట్టారు, మీపై కేసులు నమోదయ్యాయి, మీరు తప్పుకోవాలి' అని అప్పారావును డిమాండ్‌ చేశారట. మరో ప్రొఫెసర్‌ దానికి మద్దతు పలికారట. అప్పారావు కాపీ కొట్టి డాక్టరేటు తెచ్చుకుంటే 2007 నుంచి యీవిడ యిన్నాళ్లూ ఏం చేస్తున్నారట? సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయలేదా? రోహిత్‌ చచ్చిపోయి వుండకపోతే యీయన దొంగ డాక్టరేటుతో తిరుగుతున్నా ఆవిడకి అభ్యంతరం లేదా? రిసెర్చి స్కాలర్లపై యిలాటి ఆరోపణలు సర్వసాధారణం. నిజానిజాలు ఆ రంగంలో వున్నవాళ్లకే తెలుస్తాయి. ఆరోపణ చేయగానే సరిపోదు, నిరూపించి, ఆ పై కళ్లు మూసుకుని డాక్టరేటు యిచ్చినవాళ్ల పని కూడా పట్టాలి. అవేమీ చేయకుండా యిప్పుడీ ప్రస్తావన దేనికి? ప్రొఫెసర్లకు దమ్ముంటే ఎకడమిక్‌ సర్కిల్స్‌లో ఎదుర్కోవాలి. విద్యార్థులను వెంటేసుకుని గోల చేయడం కాదు, మధ్యలో విద్యార్థుల భవిష్యత్తు తగలబడుతుంది. ఆయనకు పాఠాలు చెప్పడం రాదు అన్నా విసి అయ్యాక ఆ మాట ఎత్తితే శోభించదు. ఆ పదవిలో ఎడ్మినిస్ట్రేటివ్‌ స్కిల్సే మాత్రమే చూడాలి. 

'మీపై ఎస్సీ, ఎస్టీ కేసులున్నాయి' అనే ఆరోపణ కూడా హాస్యాస్పదం. అలాటి కేసు ఎవరిమీద పడితే వారిమీదనే క్షణాల్లో పెట్టవచ్చు. తనకు ట్రాన్స్‌ఫర్‌ ఆర్డరిచ్చిన సీనియర్లపై కూడా ఆ కేసు మోపాడు మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి కర్ణన్‌. కేసు నిరూపించి శిక్ష పడితే తప్ప దాన్ని ఒక పాయింటుగా తీసుకోకూడదు. రోహిత్‌ దళితుడని యిప్పటివరకు ఎవరూ నిర్ద్వంద్వంగా నిరూపించలేకపోయారు. వాళ్ల తల్లి 'దళితుడిలా పెంచాను, దళితవాడలో పెంచాను అంటోంది'. దళితుడిలా పెంచడమేమిటో నాకు అర్థం కాలేదు. ఆవిడా వివరించలేదు. ఇక పెంపుడు తల్లి నడిగితే ఆవిడ 'రోహిత్‌ తల్లిని మా యింటి దగ్గర పనిచేసిన కూలివాళ్ల దగ్గర దత్తత తీసుకున్నానంటుంది. వాళ్ల కులమేమిటో ఆవిడకూ తెలియదు, తెలిసినా ఎక్కడా రికార్డు చేయలేదు. దానికి రుజువు లేదు. వాళ్లెవరో ఎవరూ కనుక్కోలేదు. పెంపుడు తల్లి ఆమెను వడ్డెర పిల్లలా పెంచింది కాబట్టే వడ్డెర్లకు యిచ్చి పెళ్లి చేసుకుంది, వాళ్లూ చేసుకున్నారు. ఇక రోహిత్‌ కూడా ఇంటర్‌ దాకా వడ్డెర సర్టిఫికెట్టే, సడన్‌గా దళితుడైతే బాగుంటుందనుకున్నారు, కులం మార్చేశారు, ఆ విధంగా చూస్తే అచ్చమైన దళితులకు రావలసిన అవకాశాలను యిప్పుడో, భవిష్యత్తులోనో దోచుకోచూసిన దళితద్రోహి అనాలి, అతని పేర ఎవార్డు ఏ దళితుడైనా తీసుకుంటే అంతకంటె అవమానం వుండదు. 

రోహిత్‌ 'నా చావుకి ఎవరూ కారణం కార'ని రాసి చనిపోయినా తక్కినవాళ్లు మాత్రం వదలటం లేదు. కేంద్రమంత్రులు,  విసి అప్పారావు బాధ్యులని చెప్పి, ఎస్సీఎస్టీ అత్యాచార కేసు పెట్టడం ఎంత వింత? ఇలాటి బోగస్‌ కేసుల వలన చట్టం సాంతం ఎత్తేయాలనే డిమాండు వస్తుంది. ఈ కేసు పేరు చెప్పి పదవి దిగిపోవాలంటే రేపు మరొకర్ని నియమించినా ఆయన మీదా 'నన్ను కులం పేరుతో దూషించాడు' అని ఎవరో మరోడు కేసు పెడితే చాలు, ఆయన్నీ తీసేయాలి. ఇకపై ఎవరినైనా విసి చేయాలంటే పాఠం బాగా చెప్పగలడా లేదా, యూనివర్శిటీ స్థాయి నిలపగల నిర్వహణాసామర్థ్యం వుందా లేదా అని చూడనక్కరలేదు, భవిష్యత్తులో కూడా కేసులు రావని హామీ యిచ్చినవాడికే వుద్యోగం యివ్వాలి. వెంకయ్యనాయుడు సిఫార్సుతో అప్పారావుకు ఉద్యోగం వచ్చిందని యింకో మాట. అది నిజమే కావచ్చు. కానీ ఎవరి సిఫార్సూ లేకుండా విసి నియామకాలు జరగటం లేదన్నది వాస్తవం. ఈ రోజు నినాదాలిస్తున్న కుర్రవాళ్లలో చాలామంది రేపు ఉద్యోగం కోసం వెతికేటప్పుడు తమ కులస్తుడో, గ్రామస్తుడో అయిన అధికారినో, నాయకుణ్నో పట్టుకుని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారన్నది కూడా పచ్చి నిజం. 

ఒక కాలమిస్టు అప్పారావును తప్పక తీసుకురావాలనుకుంటే అధికారికంగా వివరణ యిచ్చి అందరితో మాట్లాడి ముందుకు పోవాలికానీ నిగూఢరీతిలో తీసుకురాకూడదు అని రాశారు. ఎవరికి యివ్వాలి వివరణ? ఎవరితో మాట్లాడి ఒప్పించాలి? అతని రాజీనామాకు, రోహిత్‌ ఆత్మశాంతికి ముడిపెట్టి మాట్లాడేవాళ్లతోనా? ఇక్కణ్నుంచి వేరే చోటకి బదిలీ చేస్తే అతను తప్పు చేసినట్లు, దళిత విరోధి అయినట్లు సంకేతం పంపినట్లు కాదా? వేరే వర్శిటీలో అడుగుపెడుతూండగానే అక్కడి దళిత, లెఫ్ట్‌, కాంగ్రెసు విద్యార్థులు జెండాలు పట్టుకుని అడ్డుపడరా? ఇక్కడ చేసినట్లే అక్కడా ఆయన ఆఫీసు మీద పడి ఫర్నిచర్‌ విరక్కొట్టి, రాళ్లతో దాడి చేసి, సిబ్బందిని బెదరగొట్టినవారా? అలా చేసినవాళ్లు ఎబివిపి విద్యార్థులే, విసిపై సింపతీ రావాలని చేశారని ఆప్‌ వాళ్లన్నారు. అది నిజమో కాదో కోర్టులో తెలుస్తుంది కానీ యీ లోపున ఎంతమంది ఆ దాడిని ఖండించారు చెప్పండి. ఎవరు చేసినా ఒక విద్యాలయంలో అరాచకం సృష్టించడం తప్పు అని ఎందరు మేధావులు అన్నారు? ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రికి మెజారిటీ వుందా లేదా అని అసెంబ్లీలో కాకుండా కళ్యాణమంటపాల్లో తేలుస్తున్నారు. దాన్ని ఖండిస్తున్నవారు దీన్నీ ఖండించాలి. విసి  పదవికి ఒక వ్యక్తి తగినవాడా కాదా అని తేల్చవలసినది అతని కంటె ఉన్నతమైన పదవుల్లో వున్నవారు తప్ప ఇంకా చదువు కూడా పూర్తి కాని విద్యార్థులు, వాళ్లని వెంటేసుకుని తిరిగే విద్వత్తుపై ఏ మాత్రం గౌరవం లేని రాజకీయనాయకులు కాదు అని కూడా ఎలుగెత్తి చాటాలి. (సశేషం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2016) 

[email protected]