2010లో పోస్కోకు ఎన్వైర్మెంట్ క్లియరెన్సు యిచ్చే విషయంలో అప్పటి పర్యావరణ మంత్రి జైరాం రమేష్ నలుగురు సభ్యుల కమిటీ వేశాడు. 2011లో పర్యావరణ శాఖ అటవీభూముల మార్పిడికి అంగీకరించింది. కానీ ఒడిశా హై కోర్టు ప్రయివేటు భూముల సేకరణపై యథాతథ స్థితి కొనసాగాలంది. పోస్కో సేకరిస్తున్న భూమిలో వెయ్యి ఎకరాలు గిరిజనులకు చెందినది కావడంతో దాని గురించి క్లియరెన్సు వస్తే తప్ప ముందుకు సాగలేమని జయంతి ఫైలు ఆపేసింది. 2012లో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జిటి) పోస్కోకు యిచ్చిన ఎన్వైర్మెంట్ క్లియరెన్స్ (పర్యావరణ అనుమతి) సస్పెండు చేసింది. పరిస్థితుల పునఃపరిశీలించి అప్పుడు అనుమతి యివ్వాలంది. ఈ లోగా పోస్కో ప్రతిరోధ్ సంగ్రామ్ సమితి వంటి అనేక ప్రజాహిత సంస్థలు పోస్కోకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి.
2013లో పోస్కోకు మైనింగ్ లైసెన్సు యివ్వవచ్చనుంటూ సుప్రీం కోర్టు తీర్పు వచ్చింది. కానీ ఆ దిశగా అడుగులు పడలేదు. అడవుల గురించి ఎన్జిటి అభ్యంతరాలు తెలుపుతూనే వున్నా జిల్లా అధికారులు 1700 ఎకరాలు సేకరించి పోస్కోకి యిస్తే అది చుట్టూ ప్రహారీ గోడ కట్టేసింది. ఇంకో వెయ్యి ఎకరాలు సేకరించారు. కంపెనీకి అప్పగించడమే తరువాయి. స్టీలు ఫ్యాక్టరీకి కాప్టివ్ మైన్ (దానికే అంకితమైన గని), ఎగుమతులు చేయడానికి నౌకాకేంద్రం లేకపోతే ఉపయోగం పెద్దగా లేదు. ఇప్పుడు గని, నౌకాకేంద్రం విడగొట్టి మొయిలీ స్టీలు ఫ్యాక్టరీకి మాత్రమే అనుమతి యిచ్చాడు. అది కూడా గ్రీన్ క్లియరెన్సు యిచ్చారు. ఫారెస్టు క్లియరెన్సు లేకుండా యిది అర్థరహితం. కానీ ఫారెస్టు క్లియరెన్సు యివ్వవలసినది రాష్ట్రప్రభుత్వం. మైనింగ్ లైసెన్సు లేకపోతే మేం పని మొదలుపెట్టం అంటున్నారు పోస్కో వారు.
విదేశాలనుండి భారీ పెట్టుబడులు వస్తున్నపుడు వారికి పర్యావరణం పేరుతో, పునారావాసం పేరుతో అభ్యంతరాలు పెట్టడం భావ్యమా? అనే ప్రశ్న వుంది. పర్యావరణం పేరిట కొన్ని సంస్థలు, కొందరు మేధావులు ప్రతీదాన్నీ అడ్డుకుంటారు. పోలవరం ప్రాజెక్టు గానీయండి, రణస్థలం వద్ద ప్రాజెక్టు కానీయండి – అవి వస్తే ఎందరో ప్రజలకు మేలు కలుగుతుంది. కానీ గిరిజనుల గ్రామాలు మునిగిపోతాయని, వారి సంస్కృతి నాశనమవుతుందని, పకక్షులు తరలివెళ్లిపోతాయని, విదేశాలనుండి కొంగలు రావడం మానేస్తాయనీ, అరుదైన వన్యప్రాణులకు ఆవాసం లేకుండా పోతుందని యిలా కొందరు అభ్యంతరాలు చెప్పి, కోర్టులకు వెళతారు. సరే ప్రాజెక్టు కట్టలేదు, భూకంపం వచ్చింది. అప్పుడు గిరిజనుల ఊళ్లేమవుతాయి? ఇక సంస్కృతి అంటే ఏమిటి? అది ఎల్లకాలం ఒకేలా వుంటుందా? శతాబ్దాలు గడిచినా వారు చదువూ సంధ్యా లేకుండా తోళ్లు కట్టుకుని యీటెలు పట్టుకుని తిరగాలా? తిరుగుతారా? వాళ్ల వూరికి సవ్యమైన రోడ్డు ఒకటి పడినా చాలు, జీవన సరళిలో నాగరికతలో మార్పు వస్తుంది. వాళ్లలో ఒక్కడు చదువుకుని గ్రామానికి వచ్చి తనవాళ్లను ఉద్ధరిస్తే చాలు, వారిలో చాలామంది ఆ వూరు వదలి నాగరికులై వూరు వదలిపోతారు. ఇక పకక్షులు, చేపలు, ఎలుగుబంట్లు అంటారా, అనువైన చోటు ఎక్కడ దొరికితే అక్కడికి అవి తరలి వెళ్లిపోతాయి. లేకపోతే మనమే తరలించవచ్చు.
నగరాలలో సెల్ టవర్లు వచ్చాక, పిచికలు నశిస్తున్నాయి. అలాగని మనం సెల్ఫోన్ వాడకం మానేస్తున్నామా? రోడ్ల విస్తరణ పేరుతో చెట్లు కొట్టి పారేస్తున్నాం. మళ్లీ యింకో చోట అడవులు పెంచుతున్నామా? ఎపార్టుమెంటు కాంప్లెక్సులు కట్టేటప్పుడు కొంతమేర మొక్కలు పెంచి తీరాలన్న నియమాలు పాటిస్తున్నామా? విద్యుత్ ప్రాజెక్టులు, హైడల్ ప్రాజెక్టులు కట్టేటప్పుడు మాత్రమే యివన్నీ గుర్తుకు వస్తాయి. అవి కట్టేచోటకు వెళ్లి రోడ్డుకి అడ్డంగా పడుకుంటే మీడియాలో సామాజిక కార్యకర్తగా కవరేజి వస్తుంది. నేననేది – అభివృద్ధీ జరగాలి, పర్యావరణం కాపాడుతూనే పునరావాసం చేపట్టాలి. వనాలు పెంచడమనేది నిరంతరం జరుగుతూనే వుండాలి. టిటిడి వద్ద అంత డబ్బుంది కదా, తిరుపతి కొండల నిండా రకరకాల మొక్కలు వేసి అడవులుగా మార్చేస్తే ఎంత బాగుంటుంది! ఎన్టీయార్ ముఖ్యమంత్రిగా వుండగా ఒక పథకం రూపొందించారు. దేవుడి దర్శనం తర్వాత ప్రసాదంగా ఒక మొక్క యివ్వాలని. దేవుడి కానుక అనే భావంతో దాన్ని మనం యింటికి వచ్చి జాగ్రత్తగా పెంచుతాం. తద్వారా హరితవనాలు పెరుగుతాయి. మంచి పథకం కానీ ఎందుకో ఎవరో గోవింద కొట్టించారు. ఇలాటివి ఏవీ చేపట్టకుండా ప్రాజెక్టులు అడ్డుకోవడం కొందరు అదేపనిగా పెట్టుకుంటారు.
మొక్కల సంగతి సరే, మనుష్యుల విషయంలో చిక్కు ఎక్కడ వస్తుందంటే నష్టపరిహారం ఎంత యివ్వాలి, వారికి పునారావాసం ఎక్కడ కల్పించాలి అన్న విషయంలో. ప్రభుత్వం యింత అందనుకోండి. ప్రతిపక్షంవాళ్లు వచ్చి వూళ్లోవాళ్లను రెచ్చగొట్టి అంతేనా, యింకా అడగండి అంటారు. అది ఎప్పటికీ తేలదు. ఎక్కడో అక్కడ తెగాలి. తెగకుండా లాగుతారు. పెట్టుబడి పెట్టడానికి వచ్చినవాడికి విసుగు వస్తుంది. ఇక పునరావాసం. చాలా ముఖ్యమైన అంశం. కానీ హామీలిచ్చిన కంపెనీవాళ్లు తర్వాత పట్టించుకోరు. ప్రభుత్వాన్ని నడిపే నాయకులు, అధికారులు వారిని ఏమీ అనరు. అనకుండా కంపెనీవారు మేనేజ్ చేస్తారు. ప్రాజెక్టు పూర్తి చేశాక పునరావాసం అని కాకుండా, పునరావాసం అయితేనే అనుమతి అని పెట్టాలి. ఇక్కడా గొంతెమ్మ కోర్కెలు కోరతారు. అవి తీరవు.
ఫ్యాక్టరీ పెడితే స్థానికులకు ఉద్యోగాలు యివ్వాలంటారు. అత్యాధునికమైన టెక్నాలజీతో కట్టిన ఫ్యాక్టరీలో అక్షరాస్యత సైతం లేని గిరిజనులకు, గ్రామీణులకు సాంకేతికపరమైన ఉద్యోగాలు యివ్వగలరా? ఇస్తే ఆ యంత్రాల గతి ఏమిటి? అందువలన ఫ్యాక్టరీ సైట్లో కూలీపనులు, అన్స్కిల్డ్ లేబరు పనులు యిస్తారు. అది కూడా కంపెనీ ఉద్యోగులుగా కాకుండా కంట్రాక్టరు వద్ద ఉద్యోగులుగా తీసుకుంటారు. ఫ్యాక్టరీ నిర్మాణం కాగానే పొమ్మంటారు. వీళ్లు లబోదిబో మంటారు. బయటి వూళ్లనుండి వచ్చినవారికి ఉద్యోగాలు యిచ్చారని గోల పెడతారు. అర్హత లేకపోయినా స్థానికుడు కాబట్టి యివ్వాలంటే ఫ్యాక్టరీవాడు అడుక్కుతినాలి. దీనికి పరిష్కారం కావాలంటే ఫ్యాక్టరీ తలపెట్టగానే అక్కడ ఆ పరిజ్ఞానానికి సంబంధించిన సాంకేతిక శిక్షణా కేంద్రాలు నెలకొల్పి స్థానికులకు తర్ఫీదు యివ్వాలి. వారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యత యివ్వాలి. ఇవన్నీ సవ్యంగా జరగాలంటే రాజకీయనాయకులు తలదూర్చకూడదు, స్థానికులను ప్రాంతం పేర, కులం పేర రెచ్చగొట్టకూడదు. ఇలాటి సమగ్రవిధానం లేకుండా విదేశీ పెట్టుబడుల కోసం వెంపర్లాడడం తప్పు. పైగా ఎన్నికల నిధుల కోసం ఆఖరి నిమిషంలో అనుమతులు యిచ్చేయడం యింకా తప్పు. ఆ తప్పు చేసి జయంతి నటరాజన్ పాపాలభైరవి కావడానికి యిష్టపడలేదని అనుకోవాలి. టి-బిల్లు గత్తరపాపం, రిలయన్సు పాపం వగైరా చాలా పాపాలు మోస్తున్న పాపాల భైరవుడు వీరప్ప మొయిలీ 'కానీయ్, మరోటి చేరితే నష్టం లేదు' అనుకుని సిద్ధపడి వుంటాడు.
– (సమాప్తం) ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2014)