ఎట్టకేలకు సెప్టెంబరు 17 విమోచనదినంపై తెరాస పెదవి విప్పింది. అధికారికంగా జరపడం జాన్తానై, పార్టీ ఆఫీసుపై జండా ఎగరేస్తారని ప్రకటన. అది కూడా కెసియార్ కాదు, నాయినివారు. బియాస్ నదీ బాధితుల శవాలను వెలికిదీయించడం, గణేశోత్సవాల పందిళ్లను పదిరోజులూ పర్యవేక్షించడం వంటి గురుతర బాధ్యతలను నిర్వహించే గౌరవనీయ గృహమంత్రిగారు యీ ప్రకటన భారాన్ని కూడా నెత్తిపై వేసుకున్నారు. ఉద్యమపార్టీగా, ప్రతిపక్షపార్టీగా వున్నంతకాలం విమోచన దినాన్ని ఎందుకు జరపటం లేదని అధికారపార్టీపై నిప్పులు చెరిగిన తెరాస, యిప్పుడు చప్పుడు చేయకుండా వుంది. అప్పట్లో జరపకపోవడానికి కారణం – వలసపాలకులు, తెలంగాణ పోరాటపు విలువ తెలియని ఆంధ్ర పాలకులు ఏలడమే అంటూ వచ్చిన కెసియార్ యిప్పుడు ఆ వూసే ఎత్తడం లేదు. నిజానికి తెలంగాణ సాయుధపోరాటానికి నాయకత్వం వహించి, కార్యకర్తలను అర్పించినది ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీయే అని అందరికీ తెలుసు. చరిత్ర తెలిసిన కెసియార్‌కూ తెలిసి వుండాలి. వాళ్ల మాట సరే, నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన బూర్గుల రామకృష్ణారావుగారు ముఖ్యమంత్రిగా వుండగా కూడా దీన్ని ఎందుకు నిర్వహించలేదో తెలియదు. మహరాష్ట్ర, కర్ణాటకలలో దీన్ని ఉత్సవంగా చేస్తారట. మరి వాళ్లకు లేని అభ్యంతరాలు వీళ్ల కెందుకు? 'ముస్లిములు నొచ్చుకుంటారు కాబట్టి..' అనేస్తారు. మరి ఆ రాష్ట్రాలలోనూ ముస్లిములున్నారు. ముఖ్యంగా కాశీం రజ్వీ లాటూరు (మహారాష్ట్ర) వాడే కదా!
సెప్టెంబరు విమోచన దినం కాదు, విద్రోహదినం అని తెరాస కొమ్ము కాసే కొందరు మేధావులు వాదిస్తున్నారు. భారతసైన్యం తెలంగాణ ప్రజలపై దాడి చేసిందట. నిజాంతో కుమ్మక్కయి కమ్యూనిస్టులను చంపిందట. దీనికి నిదర్శనం ఏమిటంటే నిజాంను చంపివేయకుండా, రాజప్రముఖ్ పదవి, రాజభరణం యిచ్చి సత్కరించడమట! ఆ మాట కొస్తే ఏ సంస్థానాధిపతినీ పటేల్ చంపించలేదు. వాళ్ల అధికారాలు లాక్కున్నాడు. నిజాం విషయంలోనూ అదే జరిగింది. దేశంలో కల్లా అతి పెద్ద సంస్థానాధిపతి కాబట్టి, నిజాంను సగౌరవంగా సాగనంపి, రాజప్రముఖ్ చేశారు. దేశంలో రాజులందరికీ రాజభరణం యిచ్చారు. ఇందిరా గాంధీ రద్దు చేసేవరకూ అవి కొనసాగాయి. నిజాంకు ప్రత్యేకంగా యిచ్చినదేమీ లేదు. తనది వేరే దేశమని విర్రవీగి, తన సేనలు భారతసైన్యాన్ని మట్టికరిపిస్తాయని నమ్మిన నిజాంకు బుద్ధి చెప్పి, గద్దె దింపి, రాజరికాన్ని రూపుమాపి, ఆ స్థానంలో భారతీయ అధికారులను తెచ్చిపెట్టారు. అయితే నిజాంకు వ్యతిరేకంగా పోరాడని కమ్యూనిస్టు పార్టీ భారతప్రభుత్వాన్ని కూడా శత్రుసైన్యంగానే చూసి, సాయుధపోరాటాన్ని ఆపలేదు. హింసాయుతంగా రష్యా మోడల్లో కమ్యూనిస్టు దేశాన్ని నెలకొల్పుతామంటూ యుద్ధం చేస్తూ పోయారు. అది చాలా తెలివితక్కువ పని అని థాబ్దాలు పోయాక వాళ్లే ఒప్పుకున్నారు. దీనిపై పార్టీలో చర్చించడానికి అప్పట్లో కమ్యూనిస్టు పార్టీ అధినేతగా నియంత పోకడలు పోయే బి టి రణదివే నిరాకరించి, సమావేశాలే పెట్టలేదు. చివరకు వ్యవహారం స్టాలిన్‌దాకా వెళ్లి అతను మందలించాడని, దాంతో పోరాటం ఆగిందని చెప్పుకుంటారు.
నిజానికి ప్రజలు ఫ్యూడల్ వ్యవస్థ నడిపిన నిజాంపై తిరగబడినట్లుగా ప్రజాస్వామ్యయుతంగా పాలన నడిపిన యూనియన్ సైన్యాలపై తిరగబడలేదు. గతంలోలా జమీందార్లు అధికారం చెలాయించలేకపోయారు. జరిమానాలు లేవు, వర్తకవ్యాపారాలు చేసుకోవచ్చు, పొలాలు దున్నుకోవచ్చు, శాంతిభద్రతలకు లోటు లేదు. రజాకార్ల పీడ లేదు. ఇంకా ఎందుకు కొట్లాడుతున్నారు? అని కమ్యూనిస్టులను ప్రజలు అడగసాగారు. అలాటి పరిస్థితుల్లో కూడా మూర్ఖంగా పోరాటం సాగించి కమ్యూనిస్టు పార్టీ మొత్తం 3 వేల మంది నాయకులను పోగొట్టుకుంది. నిజాం కాలంలో పెత్తనం చలాయించిన జమీందారులు సాయుధపోరాటం కారణంగా హైదరాబాదులో తలదాచుకుని, ఆ తర్వాత కాంగ్రెసు టోపీలు తొడుక్కుని, తిరిగి గ్రామాల్లో ప్రవేశించి, మారిన మనుష్యుల్లా నటించారు. వారికి కాంగ్రెసు ప్రభుత్వం మద్దతు యిచ్చింది. కమ్యూనిస్టులు పేదలకు పంచేసిన తమ వేలాది ఎకరాలను ప్రభుత్వ సాయంతో మళ్లీ పేదల నుండి లాక్కున్నారు. ఇవి ఎలాగూ మనవి కావు కదా అనుకుని పేదలు వెనక్కి యిచ్చేశారు కూడా.
పోరాట కాలంలో కమ్యూనిస్టులు జమీందార్ల నుండి భూములు లాక్కుని పేదలకు పంచిపెట్టి పేరు తెచ్చుకుంటున్నారు, అది జరగకుండా చూడాలని కాంగ్రెసు పార్టీ వినోబా భావేను పంపింది. ఆయన భూదాన ఉద్యమం అంటూ మొదలుపెట్టి దేశంలో యింకెక్కడా మిగులు భూమి లేనట్లు తెలంగాణకు వచ్చి పోచంపల్లిలో మొదలుపెట్టాడు. కమ్యూనిస్టులు ఎత్తుకుపోయే బదులు, యీ భూదాన బోర్డుకి యిస్తే మన భూమి మనకే వుంటుంది కదాని జమీందార్లు వినోబాకు 'దానాలు' చేశారు. కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గగానే మళ్లీ తమ భూములు తాము ఆక్రమించేశారు. కెసియార్ భూదాన బోర్డు కింద వున్న భూముల లెక్కలు తీయిస్తున్నారిప్పుడు. బోర్డు దగ్గర మిగిలిన భూమి చాలా తక్కువని తేల్తోంది. ఇదీ యీ దాతల ఔదార్యం!
భారతసైన్యాల చేతిలో కమ్యూనిస్టులు చావుదెబ్బ తిన్నారు కాబట్టి యిది విద్రోహదినం అనే వాదన యింత లక్షణంగా వుంటుంది. ఇక ముస్లిముల పట్ల విద్రోహం అనేదానికి కూడా అర్థం లేదు. నిజాం దోపిడికి మతం అడ్డుగా లేదు. పాలన చివరి సంవత్సరాల్లో ఇస్లామీకరణను ప్రోత్సహించాడు కానీ మొదట్లో అది లేదు. దోచుకుతినడానికి ముస్లిం, హిందూ, గొప్ప, బీదా తేడా ఏమీ లేదు. నా 'నిజాం కథలు'లో కొన్ని వివరాలు యిప్పటికే రాస్తాను, యికపై యింకా రాస్తాను. మధ్యయుగాల రాజుల్లాగానే తన అధికారం ఆమోదించినవాడు ఆప్తుడు, తిరగబడినవాడు శత్రువు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడినవారిలో అనేకమంది ముస్లిములున్నారు. తుఱ్ఱెబాజ్ ఖాన్, షోయబుల్లా ఖాన్, ముఖ్దుం మొహియుద్దీన్… యిలా అనేక పేర్లు చెప్పవచ్చు. నిజాం పీడ వదిలినందుకు సంతోషించినవారిలో ముస్లిములు కూడా వున్నారు. అయితే సైనిక పాలన సాగిన కాలంలో కొందరు ముస్లిములపై అత్యాచారాలు సాగాయనే ఆరోపణ వుంది. సైన్యం యిన్వాల్వ్ అయిన ప్రతి చోట యిలాటి సంఘటనలు జరుగుతాయి. గత రెండు, మూడు థాబ్దాలుగా కశ్మీర్‌లో కాని, ఈశాన్య రాష్ట్రాలలో కాని.. ఎక్కడైనా యిదే గొడవ. అయినా సైన్యం తెలంగాణపై రావడానికి కారకుడెవడు? నిజాం కాదా? తక్కిన సంస్థానాధీశుల్లా మర్యాదగా విలీనానికి ఒప్పుకుంటే యీ పేచీ వుండేది కాదు కదా. కాశీం రజ్వీ గొప్ప కబుర్లు నమ్మి, భారతసైన్యంతో భంగపడి, తన ప్రజలకు సైనికపాలన రుచి చూపించాడు.
ఏ విధంగా చూసినా సెప్టెంబరు 17 విమోచన దినమే. 'నిజాం తరతరాల బూజు' అన్న దాశరథిని కెసియార్ కీర్తిస్తారు, నిజాంపై పోరాడిన కాళోజీని ఆకాశానికి ఎత్తుతారు. మరి వారి జీవితధ్యేయం నెరవేరిన సెప్టెంబరు 17ను అధికారికంగా నిర్వహించడానికి జంకెందుకు? ఉద్యమం నడిచినంత కాలం 'మా తెలంగాణ పోరుగడ్డ, కొట్లాడడానికి వెరువం' అంటూ చెప్పుకున్నది యీ సాయుధపోరాటం గురించే కదా. బెంగాలీలో 'తెలంగాణ' అనే నాటకం ప్రదర్శించేవారంటే దాని థీమ్ యీ సాయుధపోరాటమే కదా! ఇలాటి పోరాటంలో అమరులైన వారికి ముఖ్యమంత్రి హోదాలో నివాళి అర్పిస్తే నామోషీయా? ప్రత్యేక తెలంగాణ కోసం అంటూ పిరికివాళ్లలా ఆత్మహత్య చేసుకున్నవాళ్లను అమరవీరులని కీర్తిస్తున్నారే. వాళ్ల కుటుంబసభ్యులకు ఉద్యోగాలు, లక్షల్లో నష్టపరిహారాలు యిస్తున్నారే. గుట్టుచప్పుడు కాకుండా ఏ చీకటిరాత్రో ఓ కాగితమ్ముక్కపై 'జై తెలంగాణ' అని రాసి యింత విషం గొంతులో పోసుకున్నవాడు అమరవీరుడు కాగా లేనిది, నియంత నిజాం సేనలను ఎదిరించి వారితో పోరాడినవారు అమరులు కాకపోయారా? ప్రభుత్వపరంగా వారిని స్మరించుకుంటే పాపమా? కెసియార్ వద్ద వీటికి సమాధానం లేదు. ఉన్నా పైకి చెప్పటం లేదు. అందువలన మనమే ఊహించుకోవాలి – దీన్ని విమోచనదినంగా పాటిస్తే వూరుకోమని చెప్పిన కొన్ని ముస్లిము సంస్థలకు, మజ్లిస్‌కు కోపం వస్తుందని మానేశారని! మజ్లిస్ అంటే అంత భయం ఎందుకు? ముస్లిం ఓట్లన్నీ వాళ్ల దగ్గర వున్నాయా? లేవే! పాతనగరంలో తప్ప తెలంగాణలో తక్కిన ప్రాంతాల్లోని ముస్లిములందరూ తెరాసకే ఓటేశారుగా! మజ్లిస్ కూడా 2014 ఎన్నికలలో తన స్థానాలను పెంచుకోలేకపోయిందిగా!
అయినా మజ్లిస్ గురించి అంత ఆలోచన దేనికి? వారికి ఏ పాలసీ లేదు, అధికారంలో ఏ పార్టీ వుంటే వారితో అంటకాగడం తప్ప! వాళ్లు ముస్లిములందరికీ ప్రతినిథి కూడా కాదు. కెసియార్ యిప్పటికే ముస్లిములను చాలా బుజ్జగిస్తున్నారు. రిజర్వేషన్ల పెంపు విషయంలో, హజ్ భవన్ విషయంలో, వక్ఫ్ బోర్డు విషయంలో.. అన్నిటా ముస్లిములను నెత్తి కెక్కించుకుంటున్నారు. సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ ఎంబాసిడర్‌గా నియమించి, కోటి రూపాయలు యిచ్చినపుడే ముస్లిము కోణం వుందని అనుకున్నారు. ఆ విమర్శలకు కోపం వచ్చి కాబోలు, కెసియార్ యింకో కోటి యిచ్చారు. ఎందుకంటే ఆమె ఆటలో విజయం సాధించిందట! రేపు ఓడిపోతే వెనక్కి తీసుకుంటారా? విద్యార్థులకు యివ్వడానికి డబ్బులు లేవు, రైతుల రుణమాఫీ భారం తగ్గించడానికి నానారకాల సాకులూ వెతుకుతున్నారు, విద్యుత్ కొనడానికి డబ్బు లేక మూడేళ్ల దాకా మూలుగుతూనే వుండమంటున్నారు, సానియమ్మ వాయినాలకు మాత్రం సొమ్ము వచ్చి పడుతోంది. నేనేం చేసినా చెల్లుతుంది అని కెసియార్ వ్యవహరిస్తున్నారు. మీడియా నోరు మూసుకుని చూస్తోంది. రెండు ఛానెళ్లు మూతపడి వంద రోజులు దాటినా, యీ వంది మాగధులు అదేమిటనటం లేదు. కట్జూ గారు తనంతట తానే చొరవ తీసుకుంటున్నారు. గత ప్రభుత్వాలను ప్రతి చిన్నదానికి విమర్శించే తెలంగాణ మేధావులు, ప్రొఫెసర్లు, బుద్ధిజీవులు, కళాకారులు, ప్రజాకళాకారులు అందరూ మూగనోము పట్టారు. తెలంగాణ ప్రజలు చైతన్యమూర్తులు, అన్యాయాన్ని ఎదిరించడంలో ముందువరసలో వుంటారు, దేనినీ లెక్కచేయరు అంటూ గొప్పలకు పోయినవారు యీనాడు కిక్కురుమనటం లేదు. వారిలో కొందరికి పదవులు దక్కాయి. తక్కినవారు భయభ్రాంతులై వున్నారో, లేక విభ్రమకు గురయ్యారో తెలియదు. విమోచనదినంపై కాంగ్రెసు ప్రభుత్వాన్ని నిలదీసినవారిలో పదోశాతం మందైనా యీ రోజు నిరసన తెలపటం లేదు.
ఇవన్నీ నిజాం రోజులను తలపింపచేస్తున్నాయి. నేటి నిజాం కెసియార్ అన్నది నిజం. అందుకే కెసియార్ నిజాంను కీర్తించారు, కీర్తిస్తున్నారు. నిజామే ఆయనకు ఆరాధ్యుడు, లేకపోతే మెట్రోకు మాస్కట్‌గా 'నిజ్' ను రూపొందించడమేమిటి చెప్పండి. నిజ్‌కో కథ వుందట. అతను నిజాం వారసుడట. ఆధునికత సంతరించుకున్నాడట… అసలు మన ఏడో నిజాంగారికి ఆధునికత అంటేనే పడదు. ఉస్మానియా ఆసుపత్రి కట్టించాడే కానీ అలోపతి వైద్యుణ్ని దగ్గరకు రానీయలేదు. ఎన్నడూ రక్తపరీక్షలు చేయించుకోలేదు. అసలు ఏ ఆధునిక వైద్య పరికరమూ ఆయన శరీరాన్ని తాకలేదు. యునానీ వైద్యమే చేయించుకునేవాడు. చావు దగ్గరపడినప్పుడు అంటే 1967 ఫిబ్రవరిలో పోనీ అలోపతీ డాక్టర్లను పిలుద్దామా అన్నారు ఎవరో. ఠాఠ్ వీల్లేదు అంది నిజాం పెద్దకూతురు షెహజాదీ (యువరాణి) పాషా. అడ్డు చెప్పేటంత ఓపిక కూడా నిజాంకు లేదు కదాన్న ధైర్యంతో ఆయన మెడికల్ ఎడ్వైజర్ డా. వ్యాఘ్రే ముగ్గురు అలోపతి డాక్టర్లను పిలిపించాడు. వీళ్లు అడుగుపెట్టేసరికి ఆ గది చీకటిగా, అశుభ్రంగా వుంది. తను ఏదో పాతాళగృహంలోకి అడుగుపెట్టినట్టు అనిపించింది. వెళ్లి నిజాం నాడి చూడబోయారు. ఒళ్లు ముట్టుకోగానే జ్వరం వుందని, పరిస్థితి క్షీణిస్తోందని అర్థమైంది. రక్తపరీక్ష చేయాలన్నారు. నిజాం ఒంటిమీదకు సూది దిగడానికి వీల్లేదంది కూతురు పాషా. రక్తం తీయడానికి వీల్లేదు. ఇంజక్షన్ యీయడానికి వీల్లేదు అని పట్టుబట్టింది. ఇదీ నిజాం వంశీకుల ఆధునికత! అత్యాధునిక ప్రయాణ సాధనమైన మెట్రోకు వీళ్ల పేరు పెట్టడమా!? ఇలాటి కెసియార్ నిజాంను గద్దె దింపిన దినోత్సవాన్ని ఎలా సెలబ్రేట్ చేస్తారు? అధికారంలో లేనప్పుడు పాలకులను అల్లరి పెట్టడానికి దాన్ని వాడుకున్నారు. ఈ రోజు తన నిజస్వరూపాన్ని చూపుతున్నారు. ఏమైతేనేం, బిజెపి పంట పండింది. కెసియార్ ముస్లిము పక్షపాత ధోరణిని ఎత్తి చూపి, ఎండగట్టి, తటస్థుల ఓట్లు కూడా గెలుచుకోవడానికి మంచి అవకాశం సంపాదించుకుంది. వాళ్లకా అవకాశం యిచ్చినది కెసియారే!
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2014)