ఎమ్బీయస్‌ : వినోద్‌ మెహతా – 12

వినోద్‌ మెహతా పురాణపురుషుడు కాడు, అతని యితిహాసంలో నేనేమీ ప్రక్షిప్తాలు చొప్పించి తారుమారు చేయటం లేదు. అతని కథే కావాలంటే ''లక్నో బాయ్‌'' తెప్పించుకుని ఒక్క రోజులో చదివేయవచ్చు, 1, 2, 3.. అంటూ…

వినోద్‌ మెహతా పురాణపురుషుడు కాడు, అతని యితిహాసంలో నేనేమీ ప్రక్షిప్తాలు చొప్పించి తారుమారు చేయటం లేదు. అతని కథే కావాలంటే ''లక్నో బాయ్‌'' తెప్పించుకుని ఒక్క రోజులో చదివేయవచ్చు, 1, 2, 3.. అంటూ సాగదీసే నా సీరీస్‌తో వేగనక్కరలేదు. గోడ్సే సీరీస్‌ విషయంలో కూడా ఒకాయన 'గోడ్సే రాసినది ఉన్నదున్నట్టు యివ్వక మధ్యలో యీయన వ్యాఖ్యానమెందుకు' అంటారు. ఆ వ్యాఖ్యానం లేకపోతే యిక్కడకెందుకు రావడం? గోడ్సేది డైరక్టుగా చదివేస్తే పోయె కదా! గోడ్సే ప్రస్తావించిన వ్యక్తుల పరిచయాలిస్తూ గోడ్సే మరణించిన తర్వాత కూడా వారి పరిస్థితి ఏమైందో రాసి అప్‌టుడేట్‌ చేస్తున్నాను కదా. వేదకాలం నుండి మనకు భాష్యాలు, వ్యాఖ్యానాలు రాసే సంప్రదాయం వుంది. మల్లినాథ సూరి వ్యాఖ్యానం వల్లనే కాళిదాసు ఘనత అందరికీ తెలిసిందంటారు. 'ఇక నా రచనల గురించి, సంపాదకత్వం గురించి చెప్పాలా?' అన్న ప్రశ్నకు – ''హాసం'' గురించి ఆ పాఠకుడికి గౌరవం లేకపోవచ్చు, నాకుంది. ఆ పత్రికకు రాసిన వేటూరి, పరుచూరి వంటి అనేకమంది పండితులకుంది. తనికెళ్ల భరణి తన 'ఎందరో మహానుభావులు' పుస్తకాన్ని ఆ పత్రికకు అంకితం యిచ్చారు. (పత్రికకు అంకితం యివ్వడం చాలా అరుదైన సంగతనుకుంటా). నా 'అచలపతి  కథల' గురించి పాఠకుడు తీసి పారేయవచ్చు. ఆయనిష్టం. కానీ అదే నాకు అవిభక్త (యిప్పుడు రెండు రాష్ట్రాల పెట్టున్న రాష్ట్రం) ఆంధ్రప్రదేశ్‌ తెలుగు యూనివర్సిటీ నుంచి హాస్యరచనకు కీర్తి పురస్కారం తెప్పించింది. నా పాఠకుల్లో రచయితలు కొందరు వుండవచ్చు కానీ సంపాదకులు చాలా తక్కువమందే వుంటారని నాకు బాగా తెలుసు. పత్రికా సంపాదకత్వంలో నాకు అనుభవం వుంది కాబట్టి దాని కష్టనష్టాలెలా వుంటాయో యీ సీరీస్‌లో కాస్త రుచి చూపించానంతే. ఇక ముందు కూడా చూపిస్తా. ఉడ్‌హౌస్‌లా ఛాలెంజ్‌ చేయడం లేదు, కాలమ్‌ కారెక్టరు గుర్తించమంటున్నాను. టైటిల్‌లోనే నా పేరు పెట్టి పాఠకులకు ముందే వార్నింగు యిస్తున్నా – ఎవరిదో అనుకుని యిక్కడకు వచ్చి అవస్థ పడవద్దని! చేపల మార్కెట్లోకి వచ్చి చేపల కంపు కొడుతోందనీ ఫిర్యాదు చేయకండి.

మళ్లీ వినోద్‌ కథలోకి వద్దాం – ఈ సారి మజిలీ ''ఇండియన్‌ పోస్ట్‌''. ఇది రూ.5 వేల కోట్ల కంపెనీ అయిన రేమాండ్స్‌ గ్రూపు చైర్మన్‌ విజయ్‌పత్‌ సింఘానియాకు చెందినది. విజయ్‌ గొప్ప వ్యాపారవేత్తే కాదు, వ్యక్తిగతంగా సాహసి. అత్యంత ప్రమాదకరమైన విమానయానాలు చేశాడు. బెలూన్‌లో సుమారు 70 వేల అడుగుల ఎత్తుకి వెళ్లి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. డబ్బుకు లోటు లేదు కాబట్టి హై టెక్నాలజీతో అతను 1987 ఏప్రిల్‌లో ''ఇండియన్‌ పోస్ట్‌'' అనే దినపత్రిక స్థాపించి దానికి సంపాదకుడిగా అనుభవజ్ఞుడైన సంపాదకుడు ఎస్‌. నిహాల్‌ సింగ్‌ను పెట్టుకున్నాడు. నిహాల్‌ సమర్థులైన జర్నలిస్టులతో టీము ఏర్పరచుకుని పని ప్రారంభించాడు. అయితే మూణ్నెళ్లకే రాజీనామా చేశాడు. కారణం ఏమిటంటే 'మీ ఇంగ్లీషు బాగా లేద'ని విజయ్‌ ఆయనకు చెప్పడం. కలకత్తాలోని ''స్టేట్స్‌మన్‌''కు చాలాకాలం బ్రిటిషు ఎడిటర్లే వుండేవారు. వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని అదే స్థాయిలో ఆ పత్రిక నడిపిన నిహాల్‌ సింగ్‌కు యింతకంటె అవమానం వుండదు. ఆయన గుడ్‌బై చెప్పి వెళ్లిపోయాడు. అప్పుడు విజయ్‌ దృష్టి వినోద్‌పై పడింది. తనకు తెలిసున్న మురళీ దేవ్‌రా, నానా చూడాసమాల చేత వినోద్‌కు కబురంపాడు. రెక్కలు కట్టుకుని పైపైకి ఎగురుదామని చూస్తున్న వినోద్‌కు యిది ఒక అద్భుత అవకాశంగా తోచింది. సరేనన్నాడు. నిహాల్‌ టీమును అలాగే వుంచి, 'సండే అబ్జర్వర్‌' నుంచి అమృతా అబ్రహాంను మాత్రం తీసుకుని వచ్చాడు. మళ్లీ మొయినుద్దీన్‌ను కన్సల్టెంటుగా తీసుకుని వచ్చి పేపరును రీడిజైన్‌ చేయించాడు. 

ఇదంతా జరుగుతూండగా మీడియా సర్కిల్‌లో ముక్కుమీద వేలేసుకోసాగారు. బొంబాయి, ఢిల్లీలలో యిప్పటికే దినపత్రికలుండగా యింకోటి అవసరమా? అవసరమైనా వారపత్రికల ఎడిటరైన వినోద్‌ దినపత్రికకు పనికి వస్తాడా? అని. అప్పట్లో దినపత్రికలకు అప్రకటితమైన సరిహద్దులు వుండేవి. ఉత్తరాదిన ''హిందూస్తాన్‌ టైమ్స్‌'', పశ్చిమాన ''టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా'', తూర్పున ''స్టేట్స్‌మన్‌'', దక్షిణాదిన ''హిందూ'' రాజుల్లా వుండేవి. ''ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌'' అన్నిచోట్లా వుండేది కానీ ఎక్కడా అగ్రస్థానంలో లేదు. కలకత్తాలో ఆనంద్‌ బజార్‌ పత్రిక గ్రూపు ''టెలిగ్రాఫ్‌'' పేపరును స్టేట్స్‌మన్‌కు పోటీగా తీసుకువస్తోంది. ఇప్పుడీ పేపరు సక్సెస్‌ కావాలంటే కొందరు పాఠకులు రెండో పేపరు కూడా కొనాలనుకోవాలి. సాధ్యమా? 

1987 డిసెంబరులో ''ఇండియన్‌ పోస్ట్‌'' మార్కెట్లోకి వచ్చి అందరి ప్రశంసలూ పొందింది. విజయ్‌ సంతోషంతో పొంగిపోయాడు. వినోద్‌ ఫీచర్స్‌లో దిట్ట కాబట్టి యీ పత్రికలో కూడా అవి దట్టించి డైలీ కమ్‌ మ్యాగజైన్‌గా రూపొందించాడు. ఫీచర్స్‌లో నవ్యత, లేఔట్‌పై శ్రద్ధ తీసుకోవడంతో  సంపన్నవర్గాల క్లాస్‌ పాఠకులకు ఎక్కువగా నచ్చింది. క్లాస్‌, మాస్‌ అన్ని వర్గాలకు సంబంధించిన ఉత్పాదనల యాడ్స్‌ తెచ్చుకుంటున్న టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు క్లాస్‌ యాడ్స్‌కు గండిపడసాగింది. వాళ్లు మేలుకుని మార్పులు చేయసాగారు. ఇటు చూస్తే యీ పత్రిక మేనేజ్‌మెంటు సైడు బాగా వీక్‌గా వుంది. విజయ్‌తో బాటు గుఱ్ఱప్పందాలకు వచ్చే స్నేహితుడొకడు ఎడ్వర్టయిజింగ్‌ విభాగం చూసేవాడు. రేమాండ్‌లో పనిచేసే చిరుద్యోగి సర్క్యులేషన్‌ చూసేవాడు. 'వీళ్లని తీసేసి ప్రొఫెషనల్స్‌ను పెట్టండి' అని వినోద్‌ మొత్తుకున్నా విజయ్‌ వినలేదు. అతనికి ఓ పేపరు వుండడం సరదా, అది పదిమందికి చేరాలి, దాని కాళ్లమీద అది నిలబడాలి అనే చింతలేమీ లేవు. పోనీ అతని కుటుంబసభ్యులెవరైనా కలగజేసుకుంటారా అంటే అసలు వాళ్లకు విజయ్‌ పత్రిక పెట్టడమే యిష్టం లేదు. వాళ్లది జెకె గ్రూపు. ఇతను కుటుంబంలోంచి విడిగా వచ్చి యిది పెట్టుకున్నాడు. ఈ పేపర్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా వస్తే తమకు చిక్కులు వస్తాయని వారి భయం.

వినోద్‌ ప్రభుత్వానికి భజన చేస్తూ రాస్తే వాళ్లకిలాటి భయాలు వుండేవి కావేమో, కానీ మనవాడు ఎప్పటిలాగా పరిశోధనాత్మకమైన కథనం ఏదైనా దొరికితే ధైర్యంగా వేసేసేవాడు. సండే అబ్జర్వర్‌లో వుండగా అతని వద్దకు వచ్చి, అతని ప్రోత్సాహంతో ఎన్నో సాహసకృత్యాలు చేసిన ధీరేన్‌ భగత్‌ 1988 ఏప్రిల్‌లో భారతప్రభుత్వం ఎల్‌టిటిఇకి ఆర్థికసాయం చేసిందన్న విషయాన్ని బయటపెడుతూ కథనం రాసుకుని వచ్చాడు. 1987 జులై నాటి ఇండియా-శ్రీలంక ఒప్పందానికి అడ్డు రాకుండా వుండడానికి తమిళపులులకు భారతదేశం 2 లక్షల పౌండ్లు డబ్బు యిచ్చి, 4.30 లక్షల పౌండ్లు జాఫ్నాకు ఆర్థికసాయం అందించడానికి అంగీకరించిందని కొలంబోలోని ఇండియన్‌ హై కమిషనర్‌ జెఎన్‌ దీక్షిత్‌ ఒప్పుకున్నాడు. ఆ డబ్బు ముట్టినట్లు మద్రాసులోని ఎల్‌టిటిఇ ఆఫీసు ధృవీకరించింది కూడా. ఇలాటి కథనాలు ప్రభుత్వానికి యిబ్బందికరమైనవే కదా. విజయ్‌ స్నేహితుల జోలికి కూడా వెళ్లేసరికి ముప్పు వచ్చిపడింది.

ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ వారి సబ్సిడియరీ అయిన వాయుదూత్‌ మేనేజింగ్‌ డైరక్టరు హర్షవర్ధన్‌ విజయ్‌కు స్నేహితుడు. 1988 అక్టోబరులో రెండు విమానప్రమాదాలు వెంటవెంటనే జరిగి 164 మంది ప్రయాణీకులు మరణించారు. వీటికి బాధ్యత వహిస్తూ హర్షవర్ధన్‌ రాజీనామా చేయాలని అభిప్రాయపడుతూ వినోద్‌ తన పేపర్లో ఎడిటోరియల్‌ రాశాడు. అది విజయ్‌కు కోపం తెప్పించింది. ''మన పేపరు రిపోర్టింగ్‌ ఆబ్జెక్టివ్‌గా (నిష్పక్షపాతంగా) వుండాలి. ఇలా వ్యక్తులకు వ్యతిరేకంగా కాదు.'' అంటూ ఉత్తరం రాసి వినోద్‌కు పంపాడు. ఇక్కడ సమస్య రిపోర్టింగుతో కాదు, ఆ మరణగణాంకాలన్నీ కరక్టే. హర్షవర్ధన్‌ రిజైన్‌ చేయాలా లేదా అన్నది అభిప్రాయం. సంపాదకుడు తన అభిప్రాయాలు చెప్పడానికి, పరిష్కారాన్ని సూచించడానికి సంపాదకీయాన్ని ఉపయోగించుకుంటాడు. అలా కాకుండా అక్కడా వార్తలు రాస్తే అది సంపాదకీయమే కాదు. ఇది వినోద్‌ నమ్మిన సత్యమైనా గట్టిగా ఎదురుసమాధానం చెప్పి ఉద్యోగం మానేయలేదు. ఇంకో ఏడాది ఎలాగోలా లాగిస్తే పేపరు తన కాళ్ల మీద తను నిలబడుతుంది. ఇప్పుడు వదిలేసి పోతే అది ఫెయిలై, ఆ అపజయాన్ని తన నెత్తిమీద రుద్దుతారని భయపడ్డాడు.

 ప్రధాని రాజీవ్‌ గాంధీకి ఆప్తుడైన సతీశ్‌ శర్మ విజయ్‌ యింకో స్నేహితుడు. రాజ్యసభ ఎంపీగా అతను తన యింటికి ఇటాలియన్‌ టైల్స్‌ చట్టవిరుద్ధంగా ఎలా దిగుమతి చేయించుకున్నాడో  కూపీ లాగి, పత్రిక ఢిల్లీ బ్యూరో చీఫ్‌ కూమీ కపూర్‌ వేసింది. సతీశ్‌ శర్మకు సహచరుడు లలిత్‌ సూరి తన వద్దకు యిన్‌కమ్‌టాక్స్‌ యిన్‌స్పెక్టర్స్‌ రాబోగా తుపాకీ తీసి గాల్లో పేల్చి వాళ్లను అడలగొట్టాడు. ఈ కథనం కూడా కూమీ వేసింది. ఈ వార్త ప్రధాని కార్యాలయంలో సంచలనం కలిగించింది. వాళ్లు విజయ్‌తో మాట్లాడారు. కూమీ ఉద్యోగం పీకేయ్‌ అని విజయ్‌ వినోద్‌కి రిక్వెస్టు లాటి కమాండ్‌ వేశాడు. వినోద్‌ పట్టించుకోలేదు.  నొచ్చుకున్న విజయ్‌ వినోద్‌ను కలవడం తగ్గించివేశాడు. కొన్నాళ్లకు సతీశ్‌ శర్మ జెకె గ్రూపు వ్యాపారప్రయోజనాలను దెబ్బ తీయసాగాడు. దాంతో సింఘానియా కుటుంబం విజయ్‌పై ఒత్తిడి తెచ్చింది. ఫలితంగా వినోద్‌కు ఫలానా ఫలానా వారిపై కథనాలు వేయడానికి వీల్లేదు అంటూ పబ్లిషరు నుండి తాఖీదు అందింది. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2015)

[email protected]

Click Here For Previous Articles