ప్రకృతి వైపరీత్యాలకు కారణాలేమిటి?

వైజాగ్‌ ప్రజలు హుదూద్‌ విధ్వంసం పాలబడడానికి కారణం విజయమ్మను ఓడించడమే అని వైకాపా అభిమానులు ఫేస్‌బుక్‌లో పెట్టడంపై పోలీసులు కేసు బుక్‌ చేశారు. 'అర్థంపర్థం లేకుండా ముడిపెట్టారు చూడండి, జగన్‌ మనుషులు యిలాగే వుంటారు'…

వైజాగ్‌ ప్రజలు హుదూద్‌ విధ్వంసం పాలబడడానికి కారణం విజయమ్మను ఓడించడమే అని వైకాపా అభిమానులు ఫేస్‌బుక్‌లో పెట్టడంపై పోలీసులు కేసు బుక్‌ చేశారు. 'అర్థంపర్థం లేకుండా ముడిపెట్టారు చూడండి, జగన్‌ మనుషులు యిలాగే వుంటారు' అంటూ టిడిపి నాయకులు తిట్టిపోశారు. ఇప్పుడు పార్టీ తరఫున ''ప్రే ఫర్‌ విశాఖ'' పేరుతో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ దేవుడు రక్షించేవాడే తప్ప కక్ష కట్టేవాడు కాదని ప్రచారం చేయబోతున్నారట. పేరుప్రఖ్యాతులు లేని వైకాపా అభిమానులు ప్రస్తుతం చేసిన వ్యాఖ్యల్లాటివే గతంలో రాజ్‌ నారాయణ్‌ అనే కేంద్ర ఆరోగ్యమంత్రి చేశారు. ఎమర్జన్సీ తదనంతరం జరిగిన 1977 పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ ఉత్తరాదిన తుడిచిపెట్టుకుని పోగా, దక్షిణాదిన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ గెలిపించాయి. ఆ వెనువెంటనే దివిసీమలో ఉప్పెన వచ్చింది. రాజ్‌ నారాయణ్‌ గారు చాలా తమాషాగా, ఫన్నీగా వుండేవాడు. సోషలిస్టు పార్టీ నాయకుడు. లోహియా శిష్యుడు. కులమతాలకు అతీతుణ్నంటూ కులం పేరు కూడా వదిలేశాడు. ఇందిరా గాంధీపై పోటీ చేసి ఎన్నికలలో ఓడిపోయినా, కోర్టులో గెలిచాడు. ఆ ఓటమి కారణంగానే ఇందిరా గాంధీ ఎమర్జన్సీ విధించింది. ఎమర్జన్సీ తర్వాత జరిగిన ఎన్నికలలో అతను ఇందిరపై ఎన్నికలలో కూడా గెలిచాడు, కేంద్రమంత్రి అయ్యాడు. అతను ''1977 ఎన్నికలలో కాంగ్రెసుకు ఓటేసినందుకు ఆంధ్ర ప్రజలకు పడిన శిక్ష – యీ ఉప్పెన'' అన్నాడు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడవలసిన సోషలిస్టు యిలా మాట్లాడడమేమిటని అందరూ నివ్వెరపోయారు. చర్చలు జరిగాయి. 

Click Here For Great Andhra E-Paper

అప్పుడు మరో విషయం బయటకు వచ్చింది. గాంధీగారు స్వాతంత్య్రోద్యమంతో బాటు సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా కూడా ఉద్యమించారు. వాటిలో అస్పృశ్యతా నివారణ, హరిజన ఆలయప్రవేశం చాలా ముఖ్యమైనవి. ఆయన మాట విని కొన్ని ప్రాంతాల్లో కొంతైనా మార్పు వచ్చింది. కానీ ఎంత ప్రచారం చేసినా బిహార్‌లో మాత్రం అంటరానితనం మాన్పలేకపోతున్నాడు. ఇంతలో అక్కడ భూకంపం వచ్చింది. ''బిహార్‌లో అంటరానితనం అవలంబిస్తున్నారు కాబట్టే భూకంపం వచ్చింది.'' అని మహాత్మా గాంధీ అన్నారు. రాజ్‌ నారాయణ్‌ అయితే బఫూన్‌ వేషాలేసేవాడు అనుకోవచ్చు. మహాత్ముడు ఉన్నత విద్యావంతుడు, బారిస్టర్‌ చేసినవాడు ఆయన యిలా మాట్లాడడమా? అని విమర్శలు వచ్చాయి. నిరక్షరాస్యులైన వారికి నైస్‌గా చెపితే లాభం లేదు, అలా ఘాటుగా దానికీ, దీనికీ ముడి పెట్టి మాట్లాడితేనే వింటారు, అందుకే మహాత్ముడు అలా అన్నాడు అని కొందరు సమర్థించారు. 

''బాలకార్మికుల సమస్య'' గురించి నేనొక సెమినార్‌కు హాజరయ్యాను. చిలుకూరు బాలాజీ ఆలయం నిర్వాహకులు సౌందరరాజన్‌ గారు మాట్లాడుతూ ''గుడి సమీపంలో చిన్నపిల్లల చేత వ్యాపారాలు చేయకుండా చూస్తున్నాను. అంతేకాదు, భక్తులు చిన్న పిల్లల చేత పనులు చేయించకుండా చూస్తున్నాను.'' అని చెప్పారు. ఉదాహరణగా ఒక విషయం చెప్పారు. ధనికులైన భక్తురాళ్లు కారు దిగి గుళ్లోకి వస్తూ పూజాద్రవ్యాలున్న తట్టనో, పూలసజ్జనో పనిపిల్ల చేత మోయించుకుంటూ వస్తారట. ఈయన అది చూసి 'అదేమిటమ్మా, మీరు మోయకుండా ఆ పిల్ల చేత మోయిస్తే పుణ్యమంతా ఆమెకు పోదూ!' అంటారట. అంతే, ధనికురాలు అమ్మో అనుకుని, చటుక్కున పనిపిల్లనుంచి తట్ట లాక్కుని 'నువ్వెళ్లి కార్లో కూర్చో'' అంటుందిట. పక్కవాళ్లు పూజాద్రవ్యాలు మోస్తే పుణ్యం వాళ్లకు పోతుందని ఏ శాస్త్రం చెపుతుంది? కానీ ఈయన పట్టెనామాలతో ప్రత్యక్షమై అలా చెపుతూ వుంటే నమ్మక ఛస్తారా? ఆయన బాలకార్మిక వ్యవస్థను రూపుమాపడానికి పుణ్యం పేరు చెప్పి యజమానురాలిని అడలగొట్టారు. అదో మార్గం. 

Click Here For Great Andhra E-Paper

టిడిపి వారి కార్యక్రమం ఎలా వుంటుందో నాకు తెలియదు కానీ పనిలో పనిగా మూఢనమ్మకాలన్నిటిపైనా ధ్వజమెత్తితే బాగుంటుంది. ఫలానావారు రాజ్యంలోకి వస్తే కరువుకాటకాలు వస్తాయని, రాజధానికి ఫలానావైపు కొండలుంటే రాష్ట్రం వర్ధిల్లుతుందని, నది మలుపు తిరిగేచోట రాజధాని కడితే విదేశీయులచే నిర్మించబడుతుందని, బిల్డింగుకి ఒక వైపు గేటు మూసేసి మరోవైపు తెరిస్తే అధికారం వస్తుందని, గేటుకి ఫలానా రంగు వేస్తే దాని ఎదురుగానే హత్యాయత్నాలు జరుగుతాయనీ.. యిలాటి నమ్మకాలు వదులుకోవాలని ప్రచారం చేస్తే మంచిది. దేవుడు రక్షించేవాడే తప్ప కక్ష కట్టేవాడు కాడని చెప్పడం చాలా మంచిది. తెలుగులో దైవభక్తి అంటారు కానీ ఇంగ్లీషులో దాన్ని గాడ్‌-ఫియరింగ్‌ అంటారు. దేవుడు తండ్రి, తల్లి, సఖుడు అంటూ అతన్ని చూసి భయపడడమేమిటి? ఏదో చేశాడు కాబట్టి, మరేదో చేయబోయాడు కాబట్టి విమానప్రమాదంలో ఫలానావారు పోయారని కొందరు ప్రచారం చేస్తూ వుంటారు. విమానప్రమాదాలలో ఎందరో మహానుభావులు పోయారు. మొన్న మలేసియా విమానంలో పోయినవారందరూ కూడా పరాయివారి ఆస్తులు కాజేయాలని చూశారనగలమా? మోకాలికీ, బోడిగుండుకీ ముడిపెట్టి మధ్యలో దేవుణ్ని లాక్కురావడం తప్పని ప్రజలకు అవగాహన కల్పించడం ప్రభుత్వకర్తవ్యం.

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 

[email protected]