పొన్నియిన్ సెల్వన్ 50 పాత్రల 2130 పేజీల నవల. దాని కథను నాలుగైదు పేజీల్లో చెప్పడం అసాధ్యం. పైగా కథంతా చెప్పేయడం న్యాయం కాదు. ‘‘పొన్నియిన్ సెల్వన్ నేపథ్యం’’ అనే వ్యాసంలో ఆ నవల చారిత్రక నేపథ్యం, కల్పన ఏ పాళ్లలో కలిపారు, కథాంశం ఎప్పటిది, ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా యిచ్చాను. ఈ వ్యాసంలో పాత్రల పరంగా కొంత కథ చెప్పే ప్రయత్నం చేస్తాను. పాత్రల పేర్లు అపరిచితమైనవి కాబట్టి, యాక్టర్ల మొహాలను బట్టి కథ అర్థం చేసుకునే వీలుండేట్లా సినిమాలో పాత్రధారులను ప్రస్తావిస్తూ చెప్తాను. పాత్రల గురించి చెప్పిన వరుస కథాగమనానికి అనుగుణంగా ఉండేట్లు చూస్తున్నాను.
నవలలో చాలా ఫ్లాష్‌బ్యాక్‌లు ఉంటాయి. కానీ నాది స్ట్రయిట్ నేరేషన్. కష్టమైన ప్రక్రియే కానీ ప్రయత్నిస్తున్నాను. ఏ మేరకు బోధపడుతుందో తెలియదు. సినిమా ఎలా తయారవుతుందో తెలియని కాడికి ఎందుకింత కష్టం అనవచ్చు. సినిమా బాగుంటే, టిక్కెట్టు సరసంగా ఉంటే థియేటర్లో చూస్తాను. లేకపోతే ఒటిటిలోనో, ఆఖరికి టీవీలోనో ఎప్పుడో ఒకప్పుడు చూస్తాను. అప్పుడు గందరగోళానికి గురి కాకుండా యిది నాకు ఉపయోగపడుతుంది. సినిమా సంగతి ఎలా ఉన్నా, 70 ఏళ్లగా లక్షలాది ప్రతులు అమ్ముడుపోయిన ఒక బృహన్నవల కథాంశం తెలుసుకోవాలని ఉంది. అందుకే యీ పరి-శ్రమ. నాలా ఆలోచించేవాళ్లు ముందుకు సాగవచ్చు. కథ గోల ఏల? సినిమాలు గ్రాఫిక్స్ చూసి ఎంజాయ్ చేస్తే చాలదా అనుకునేవాళ్లు స్కిప్ చేసేయవచ్చు.
01 సుందర చోళుడు – ప్రకాశ్‌రాజ్ వేసిన పాత్ర యిది. చోళ సామ్రాజ్యానికి గట్టి పునాది వేశాడు. తాత పాలించే రోజుల్లో ఉత్తర శ్రీలంకలో ఉన్న చోళరాజ ప్రతినిథిగా ఉన్నాడు. అప్పుడు మందాకిని అనే మూగ వనిత ప్రేమలో పడ్డాడు. ఇంతలో రాజధానిలో సంక్షోభం రావడంతో తిరిగి వచ్చేశాడు. తర్వాత మందాకిని ఏమైందో ఆ వివరాలు అతనికి తెలియలేదు. తండ్రి మరణం తర్వాత అతని కజిన్ మధురాంతకుడికి (రహమాన్ వేసిన పాత్ర) హక్కు ఉన్నా, అతను పసివాడు కావడంతో తనే రాజయ్యాడు. వానవన్ మహాదేవిని పెళ్లాడాడు. వాళ్ల సంతానం, ఆదిత్య కరికాలన్ (ఆదిత్యుడు, విక్రమ్ వేసిన పాత్ర), కుందవై (త్రిష వేసిన పాత్ర), అరుల్‌మొళి వర్మన్ (రాజరాజు, జయం రవి వేసిన పాత్ర). మహావీరుడైన పెద్దకొడుకు ఆదిత్యుడు మాతామహుడి వద్ద కంచిలో ఉంటూ ఉత్తర ప్రాంతానికి రాజప్రతినిథిగా ఉన్నాడు. కుందవై తమ పాత రాజధాని ఐన పళయారైలో ఉంటోంది. రెండో కొడుకు రాజరాజు శ్రీలంకలో రాజప్రతినిథిగా ఉన్నాడు. కథాకాలం నాటికి సుందరుడు తంజావూరులో అస్వస్థుడిగా ఉన్నాడు. తన తర్వాత మధురాంతకుణ్ని వారసుడిగా చేసే ఉద్దేశం లేదతనికి. మూడేళ్ల క్రితం వీరపాండ్యన్‌ను చంపి తెచ్చిన సందర్భంగా, పెద్దకొడుకు ఆదిత్యుణ్ని యువరాజుగా ప్రకటించి, మధురాంతకుడికి అసూయ కలిగించాడు. దాంతో కొందరు సామంతరాజులు కలిసి సుందరుణ్ని దింపేసి, మధురాంతకుణ్ని రాజుగా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు.
02 మందాకిని – ఐశ్వర్యా రై ద్విపాత్రాభినయంలో సీనియర్‌గా వేసిన పాత్ర యిది. సుందరుడు శ్రీలంకలో ఉండగా అతన్ని ఒక ఎలుగుబంటి నుంచి కాపాడింది. ప్రేయసి అయింది. సుందరుడు రాజధానికి వెళ్లిపోయాక, కొన్నాళ్లకు శ్రీలంక వచ్చిన వీరపాండ్యన్‌తో ప్రణయం సాగించింది. బహుశా అతని ద్వారానే గర్భవతి అయింది. (ఈ విషయం రచయిత స్పష్టంగా ఎక్కడా చెప్పలేదు, పాఠకుడి ఊహకి వదిలేశారు) చోళ రాజధానికి వచ్చింది. అక్కడ యీమె కవల సోదరి (ఆమె కూడా మూగదే) పని చేసేది. మందాకిని కవల పిల్లల్ని కంది. వాళ్లే మధురాంతకుడు. నందిని (ఐశ్వర్యా రై వేసిన యంగ్ పాత్ర). మధురాంతకుడు (రెహమాన్). మధురాంతకుడు సెంబియన్ మహాదేవి దగ్గర పెరగగా, నందిని పూజారి నంబి యింట్లో అతని పెంపుడు సోదరిగా పెరిగింది. మందాకిని మిస్టీరియస్ ఉమన్‌గా కనబడుతుంది. కథాకాలం నాటికి శ్రీలంకలో ఉంటూ రాజరాజును అపాయాల నుంచి రక్షిస్తూ ఉంటుంది.
03 సెంబియన్ మహాదేవి (మహాదేవి) – జయచిత్ర వేసిన పాత్ర యిది. సుందరుడి పెదనాన్న భార్య. అత్యంత సమర్థురాలు. రాచవ్యవహారాల్లో ఆమె మాట చెల్లుతుంది. పెళ్లయిన చాలా రోజుల వరకు పిల్లలు పుట్టలేదు. చివరకు ఒక బిడ్డ పుడితే అతను చనిపోయాడు. అప్పుడు అంతఃపురంలో పని చేస్తున్న మందాకిని సోదరితో చెప్పి మందాకినికి పుట్టిన మగబిడ్డను తన బిడ్డగా తీసుకుని మధురాంతకుడనే పేరు పెట్టి పెంచుకుంది. చనిపోయిన బిడ్డను పాతిపెట్టేయమని చెప్పింది. ఐదేళ్ల తర్వాత ఆమె యింటికి వెళితే అక్కడ ఐదేళ్ల పిల్లవాడు కనబడ్డాడు. అనుమానం వచ్చి అడిగితే పాతిపెట్టబోతూ ఉంటే బిడ్డ బతికాడని, తను పెంచుకుంటున్నానని చెప్పింది. అతని పేరు సెందన్ అముదన్ (అముదన్, అశ్విన్ కాకుమాను వేసిన పాత్ర). అతన్ని బాగా పెంచమని చెప్పి, ఆ రహస్యాన్ని మహామంత్రికి మాత్రం చెప్పింది.
నందిని, మధురాంతకుడు ఒకే చోట పెరిగితే పోలికల విషయంపై చర్చ వస్తుందని భయపడి, ఆమె నందినిని పూజారి యింటికి పెంపకానికి యిచ్చింది. పూజారి కుమారుడు నంబి (జయరామ్ వేసిన పాత్ర), నందినిని సోదరిగా స్వీకరించాడు. పెద్దయ్యాక నంబి గూఢచారి అయ్యాడు. అసమాన రూపవతి ఐన నందిని అంతఃపురంలోనే తిరుగుతూ అందర్నీ ఆకట్టుకుంది. యువరాణి కుందవైకి తన రూపం చూసి అసూయ అని నందిని ఆమెపై కోపం పెట్టుకుంది. నిజానికి కుందవైకి రూపం, మేధస్సు, చాకచక్యం, హోదా అన్నీ ఉండటంతో ఆమె అంటే నందినికే అసూయ. ఆదిత్యుడు, నందిని ఒకరితో మరొకరు ప్రేమలో పడ్డారు. ఇది రాచకుటుంబం హర్షించలేదు. ముఖ్యంగా మహాదేవికి అస్సలు నచ్చలేదు. నందినిని పాండ్య రాజ్యానికి పంపించి వేసింది. క్రుద్ధురాలైన నందిని చోళ రాజవంశంపై పగబట్టింది.
04 వీరపాండ్యన్ – నాజర్ వేసిన పాత్ర యిది. ఈ పాండ్యరాజు చోళులను ఎదిరించి, స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు. సుందరుడికి సమకాలీనుడు. శ్రీలంక రాజు సాయం కోరడానికి, అక్కడకు వెళ్లి మందాకినితో ప్రేమలో పడ్డాడు. ఇతని కారణంగానే ఆమెకు కవలలు పుట్టారని అనుకోవాలి. నందిని యితని కూతురే కావాలి. నవల చివర్లో ‘నువ్వూ నేనూ ఒకే తండ్రికి పుట్టినవాళ్లం, అందుకని మన ప్రేమ అక్రమం’ అని ఆదిత్యుడు నందినితో అంటే ఆమె ‘అదేమీ కాదు’ అని వాదిస్తుంది. నా తండ్రి ఫలానా అని అతని చెవిలో చెపుతుంది. అతను విని ఆశ్చర్యపడి, ఆమెను క్షమాపణ కోరతాడు. దీన్ని బట్టి వీరపాండ్యన్ ఆమె తండ్రి అనుకోవాలి.
ఆదిత్యుడు పాండ్యులపై యుద్ధం చేశాడు. వీరపాండ్యుడు ఓడిపోయి పారిపోయాడు. ఆదిత్యుడు అతన్ని తరుముతూ వెళితే ఒక గుడిసెలో క్షతగాత్రుడై పడి ఉన్నాడు. అతనిపై కత్తి ఎత్తితే, కాపాడమని నందిని ప్రాధేయపడింది. అయినా వినకుండా ఆదిత్యుడు పాండ్యుడి తల తెగనరికాడు. అది అందరికీ ప్రదర్శించి అందరి మన్ననలూ అందాడు. అదను చూసి సుందరుడు అతన్ని యువరాజుగా ప్రకటించాడు. ఆ పదవిపై ఆశ పెట్టుకున్న మధురాంతకుడికి కడుపు మండింది. సుందరుణ్ని పదవీచ్యుతుణ్ని చేయడానికి ప్రయత్నాలు ఆరంభించాడు.
పాండ్యుణ్ని సంహరించడంతో నందినికి ఆదిత్యుడిపై ప్రేమ నశించి, ద్వేషం పుట్టింది. అతన్నే కాక అతన్ని తమ్ముణ్ని, తండ్రిని సంహరించి, మధురాంతకుణ్ని గద్దె కెక్కించాలని దీక్ష పూనింది. దానికి తొలి అడుగుగా చోళ రాజ్యానికి తిరిగి వచ్చి, రాజ్య కోశాధికారిగా ఉన్న పెరియ పళవేట్టురాయన్ (పెరియవన్- శరత్ కుమార్ వేసిన పాత్ర) అనే 60 ఏళ్ల వృద్ధుణ్ని పెళ్లాడి అతన్ని తన మోహంలో ముంచెత్తి, తను చెప్పినట్లల్లా ఆడేట్లు చేసింది. యువరాజ పట్టాభిషేక సమయంలో పెరియవన్ సరసన భార్యగా కనబడిన నందినిని చూసి ఆదిత్యుడు నిర్ఘాంతపోయాడు. పెరియవన్ తమ్ముడు చిన్నవన్ కోట సంరక్షణ భారాన్ని వహిస్తూంటాడు. ఈ అన్నదమ్ములు కలిసి సామంతరాజుల్ని చేరదీసి, మధురాంతకుణ్ని రాజుగా చేయడానికి కుట్రలు పన్నుతున్నారు. ఇలా మూడేళ్లు గడిచాయి.
05 వల్లవరాయన్ వందిదేవన్ – (వందిదేవుడు, కార్తీ వేసిన పాత్ర) ఇతను కంచిలో ఉంటాడు. అక్కడే మాతామహుడి వద్ద ఉన్న ఆదిత్యుడికి స్నేహితుడు. కంచిలో తాను కట్టిన స్వర్ణసౌధాన్ని చూడడానికి రమ్మనమని పళయారైలో ఉన్న సోదరి కుందవైకి, తంజావూరులో ఉన్న తండ్రి సుందరుడికి ఆదిత్యుడు లేఖలు రాసి యితని ద్వారా పంపాడు. ఇక్కణ్నుంచి నవల ప్రారంభమవుతుంది. వందిదేవుడు మార్గమధ్యంలో తన మిత్రుడు కందమారన్‌కు చెందిన కడంబూరు కోటలో బస చేశాడు. కందమారన్ సోదరి మణిమేఖలై. వాళ్లిద్దరికి నందిని వ్యూహం తెలియక ఆమెకు సహకరిస్తూంటారు. ఆ కోటలో నందిని ప్రోద్బలంతో కొందరు సామంతరాజులు సమావేశమై మధురాంతకుణ్ని రాజుని చేద్దామని కుట్ర చేస్తున్న సంగతి వందిదేవుడు రహస్యంగా గమనించాడు. చోళ రాజ్యంలో అధికారులుగా పనిచేస్తున్న పాండ్యగూఢచారి ఐంద్రజాలికుడు రవిదాసన్ (కిశోర్ వేసిన పాత్ర), అతని ముఠా కార్యకలాపాలు గమనించాడు. చోళ గూఢచారి నంబిని (జయరామ్ వేసిన పాత్ర) కలిసి స్నేహం పెంచుకున్నాడు. గత విషయాలన్నీ తెలుసుకున్నాడు. నందినిని కలిసి, ఆమె వద్ద నుండి రాజుని కలిసేందుకు గుర్తు సంపాదించాడు.
అక్కణ్నుంచి కుందవై కోసం పళయారైకు వెళుతూండగానే ఒక జ్యోతిష్కుడి వద్ద అనుకోకుండా కుందవైని, ఆమె సఖి వానతి (శోభితా ధూళిపాళ వేసిన పాత్ర)ని కలిశాడు. కుందవైని చూడగానే యిద్దరూ ప్రేమలో పడ్డారు. కుందవై ‘ఇక్కడ పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి. శ్రీలంకలో ఉన్న మా తమ్ముడు రాజరాజుకి వెనక్కి వచ్చేయమని ఒక లేఖ రాస్తాను, తంజావూరు నుంచి అక్కడకు వెళ్లి అందచేస్తావా?’ అంటే సరేనన్నాడు. నంబితో సహా అక్కడకు వెళ్లాడు. రాజరాజుని కలిశాడు, స్నేహితుడయ్యాడు. అక్కడ మందాకినిని చూసి ఆమెలో నందిని పోలికలు చూసి ఆశ్చర్యపడ్డాడు. ఆమె అడుగడుగునా రాజరాజుని రక్షిస్తున్న సంగతి గమనించి ఆశ్చర్యపడ్డాడు.
06 పార్థిబేంద్ర పల్లవన్ – (విక్రమ్ ప్రభు వేసిన పాత్ర) ఇతను ఆదిత్యుడికి స్నేహితుడు. తంజావూరు వెళ్లి తన తండ్రిని కలవమన్న వందిదేవుడు అక్కణ్నుంచి శ్రీలంక వెళ్లాడని తెలియని ఆదిత్యుడు కంగారుపడి యితన్ని శ్రీలంకలో ఉన్న తన తమ్ముడు రాజరాజు వద్దకు డైరక్టుగా పంపాడు. అముదన్‌కు కజిన్, నావికురాలు అయిన పూంగుళాలి (ఐశ్వర్య లక్ష్మి వేసిన పాత్ర) శ్రీలంకలో అతనికి రక్షగా ఉండి, రాజరాజు, వందిదేవుళ్లతో కలిపించింది. అందరూ కలిసి తంజావూరు వెళ్లి అక్కడి పరిస్థితి చక్కదిద్దుదామని అనుకుంటూండగా పెరియవన్ మనుషులు వచ్చి రాజాజ్ఞను అనుసరించి రాజరాజుని బందీగా తీసుకెళతామని అన్నారు. అనారోగ్యపీడితుడైన రాజు యీ ఆర్డరు వేసి ఉండడని, నందిని ప్రేరేపణతో పెరియవనే యీ పని చేసి వుంటాడని వందిదేవుడు ఊహించాడు. అయినా రాజరాజు తండ్రి ఆజ్ఞను శిరసావహిస్తానంటూ ఓడ ఎక్కాడు. కానీ అది తుపానులో చిక్కుకుంది. అతను మరణించాడని పుకార్లు పుట్టాయి. చివరకు అతను రక్షింపబడి నాగపట్టిణం రేవు వద్ద ఉన్న చూడామణి బౌద్ధవిహారంలో తలదాచుకున్నాడు. అక్కడ వరదలు వచ్చినపుడు స్థానిక ప్రజలను ఆదుకున్నాడు. రాజరాజు ఎక్కిన ఓడ ప్రమాదంలో చిక్కుకుందని తెలిసి కంగారు పడిన మందాకిని వెంటనే తంజావూరు వచ్చింది.
07 ఆదిత్య కరికాలుడు – (ఆదిత్యుడు, విక్రమ్ వేసిన పాత్ర) ఇతనికి సామంతరాజులు చేస్తున్న కుట్ర గురించి తెలియదు. తండ్రి, సోదరుడు, సోదరి వచ్చి కంచిలోని తన స్వర్ణసౌధం చూస్తారని ఎదురు చూస్తుండగానే, కడంబూరు వచ్చి రాజసౌధంలో బస చేయమని నందిని కబురు పెట్టింది. నందిని అంటే అభిమానం పోని ఆదిత్యుడు వెళదామనుకున్నాడు. వందిదేవుడు వద్దని వారించాడు. మూడీ మనిషి ఐన ఆదిత్యుడికి వందిదేవుడిపై కోపం వచ్చి అతన్ని దూరం పెట్టేశాడు. కడంబూరుకి వెళ్లాడు. ఆ సమయానికి నందిని భర్త పెరియవన్ అర్జంటు పని మీద తంజావూరుకి బయలుదేరాడు. ఆదిత్యుడు నందినిని కలిసి, నా తండ్రికి, నీ తల్లికి మధ్య ఉన్న ప్రణయం కారణంగా మన కలయిక అక్రమం అవుతుంది అన్నాడు. నందిని కొట్టిపారేసింది. మన మధ్య రక్తసంబంధం ఏమీ లేదు అంది.
తంజావూరుకి వెళ్లేదారిలో పెరియవన్ అనుకోకుండా పాండ్య కుట్రదారు రవిదాసన్ అతని సహచరుల సంభాషణ విన్నాడు. వాళ్లకు నందిని ధనసహాయం కూడా చేస్తోందని అతనికి అర్థమైంది. సామంతరాజులను కుట్రకు ప్రోత్సహించడం వెనుక రాజవంశాన్ని నిర్మూలించాలనే నందిని ఉద్దేశం అతనికి అర్థమైంది. నందిని వలలో పడ్డానని గ్రహించి, వెంటనే పళయారైలో ఉన్న కుందవై దగ్గరకు వెళ్లి సమస్తం చెప్పివేశాడు. నందిని మూలాలు తెలియడంతో బాటు మందాకిని బతికి వుందని తెలియడంతో కుందవై ఆమెను, తండ్రిని కలపాలని చూసింది. ఎందుకంటే తండ్రి సుందరుడు మందాకిని మరణించిందని అనుకుంటున్నాడు, ఆమెను మరవలేకున్నాడు. ఇంతలో రాజరాజు చూడామణి విహారంలో ఉన్నాడని తెలిసి, తన సఖి వానతితో కలిసి నాగపట్టిణం వెళ్లింది.
08 వానతి (శోభితా ధూళిపాళ వేసిన పాత్ర) – ఈమె ఒక సామంతరాజు కూతురు. చిన్నపుడే తలిదండ్రులు పోవడంతో రాజు అంతఃపురానికి చేరుకుని, కుందవైకు సన్నిహితురాలైంది. రాజరాజు కూడా యీమెను అభిమానించాడు. ఈమె రాజరాజుని ప్రేమించి, దరిమిలా పెళ్లాడింది. రాజరాజు నాగపట్టిణంలో ఉన్నాడని తెలిసి, అతన్ని చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయని తెలిసి, కుందవైతో పాటు ఆ ఊరు వెళ్లింది. నందిని కుట్ర గురించి కుందవై రాజరాజుకి చెప్పింది. రాజరాజు ఒక వ్యాపారిగా మారువేషం వేసుకుని వీళ్లతో సహా తంజావూరులోకి ప్రవేశించాడు. ఆ తర్వాత తనెవరో చెప్పకుండా కుందవై, వానతిలతో కోటలోకి ప్రవేశించి తండ్రికి చెప్పాలనుకున్నాడు. చిన్నవన్ ఇతనెవరో గుర్తు పట్టలేదు కానీ వానతిని చూసి లోపలికి వెళ్లినిచ్చాడు. అందరూ రాజు వద్దకు వెళ్లి జరుగుతున్న విషయాలన్నీ చెప్పారు.
ఈలోగా మందాకిని ఒక రాత్రివేళ రాజు అంతఃపురంలోకి చొరబడితే రాజు ఆమెను చూసి దెయ్యం అనుకుని కూజా విసిరేశాడు. ఆమె మాయమై పోయింది. మరోసారి ఆమె వచ్చినపుడు గుర్తు పట్టి మాట్లాడబోయాడు కానీ యింతలో ఎవరో ఆమెను శూలంతో హత్య చేసి పారిపోయారు. త్వరలోనే రాజును, అతని యిద్దరు కొడుకులను హత్య చేయాలని కుట్రదారులు నిశ్చయించుకున్నారు.
09 పెరియ పళవేట్టురాయన్ (పెరియవన్- శరత్ కుమార్ వేసిన పాత్ర) – పెరియవన్ కడంబూరుకు యింకా చేరలేదు. ఆదిత్యుడు అతిథిగా అక్కడే ఉన్నాడు. నందిని ఒక రోజు మణిమేఖలై ద్వారా వందిదేవుణ్ని పిలిపించి, ‘రాజ్య భవిష్యత్తు గురించి మాట్లాడాలని చెప్పి ఆదిత్యుడికి కబురు పెట్టాను. అతను రాగానే చంపేసి కసి తీర్చుకుంటాను.’ అంది. వద్దు చంపవద్దు అని వందిదేవుడు బతిమాలాడు. సరేలే అంది నందిని. ఇంతలో ఆదిత్యుడు ప్రవేశించాడు. వందిదేవుడు పక్కనే ఉన్న సంగీతమందిరంలో దాక్కుని వీళ్ల మాటలు విన్నాడు. మణిమేఖలై తెరల చాటున దాక్కుంది. ఆదిత్యుడు నందినిపై తన ప్రేమను వ్యక్తం చేశాడు. ఆమె వారించినా వీరపాండ్యుణ్ని వధించినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తన తండ్రి ఎవరో నందిని అతనికి చెవిలో చెప్పింది. ‘నీ జీవితమంతా వ్యథాభరితమే, నాకీ రాజ్యం వద్దు, ఏమీ వద్దు, మనిద్దరం ఎక్కడికైనా వెళ్లిపోయి విడిగా బతుకుదాం.’ అన్నాడు ఆదిత్యుడు.
ఇలా మాట్లాడుతూండగానే ఎవరో వచ్చిన అలికిడి అయింది. గదిలో దీపం ఆరిపోయింది. ఆదిత్యుడి కేక విని వందిదేవుడు బయటకు వద్దామనుకున్నాడు. అతన్ని రవిదాసన్ మనుషులు చుట్టుముట్టారు. వాళ్లను విదిలించుకుని గదిలోకి వచ్చి చూసేసరికి, ఆదిత్యుడు చచ్చిపడి ఉన్నాడు. వందిదేవుడు బాధపడుతూ అతని తలను తన ఒడిలో పెట్టుకున్నాడు. నందిని చెప్పుడు మాటల చేత వందిదేవుడిపై ద్వేషం పెంచుకున్న కడమారన్ హత్యానేరంపై వందిదేవుణ్ని అదుపులోకి తీసుకున్నారు. నందిని అంతర్థానమైంది. రాజభటుల నుంచి తప్పించుకుని వందిదేవుడు ఆదిత్యుడి శవంతో సహా తంజావూరు చేరి సుందరుడికి అప్పగించాడు. పెరియవన్, నందిని ఏమయ్యారా అని అందరూ ఆశ్చర్యపడుతూండగా పెరియవన్ వచ్చాడు.
‘నందిని నన్ను మోసం చేసిన సంగతి తెలిసింది కాబట్టి ఆమె ఆదిత్యుణ్ని పిలిపించిందని తెలియగానే కంగారుపడుతూ వాళ్లు మాట్లాడుతున్న గదిలోకి వెళ్లాను. నందినిని చూస్తూనే ఆగ్రహంతో ఆమెపైకి కత్తి విసిరాను. అయితే గురి తప్పి అది ఆదిత్యుడికి గుచ్చుకుని, అతను మరణించాడు. తెలిసి చేసినా, తెలియక చేసినా హంతకుణ్ని నేనే.’ అంటూ కత్తితో తన పొట్టలో పొడుచుకున్నాడు. సుందరుడు అయ్యో, ఎందుకిలా చేశావు అని వాపోతే ‘ఇది కాకపోయినా నేను నందిని మోహంలో పడి ఆమె చెప్పినట్లా ఆడాను. నాకీ శిక్ష సమంజసమే’ అన్నాడు. ఇంతలో నంబి వచ్చి ‘‘నందిని నీకు థాంక్స్ చెప్పమంది.’’ అన్నాడు.
అప్పుడు పెరియవన్ నిట్టూర్చి ‘‘నిజం చెప్తాను. నేను చంపలేదు. వందియదేవన్‌పై హత్యా నేరం పడకూడదని నేను దోషిగా నిల్చాను. ఆదిత్యుడు, నందిని మాట్లాడుతూండగా నేను వెళ్లాను. దీపం ఆరిపోయింది. ఎవరో నన్ను తలపై కొట్టారు. నేను కళ్లు తెరిచేటప్పటికి నందిని నాకు శుశ్రూష చేస్తోంది. నన్ను వెతుక్కుంటూ నా వాళ్లు రావడంతో నందిని మాయమై పోయింది.’’ అన్నాడు. వెంటనే చనిపోయాడు కూడా. ఇలా ఆదిత్యుడి మరణం మిస్టరీని నవలా రచయిత కూడా విప్పలేదు. రవిదాసన్, అతని మనుషులే చంపి ఉంటారని సూచించాడు.
10 మధురాంతకుడు – రెహమాన్ వేసిన పాత్ర యిది. యువరాజు ఆదిత్యుడు మరణించడంతో మధురాంతకుడికి కుట్ర చేయవలసిన అవసరం లేకపోయింది. సుందరుడు కూడా అతన్నే యువరాజుని చేస్తాడని చెప్పాడు. అయితే అతని తల్లి మహాదేవి (జయచిత్ర) ఒప్పుకోలేదు. కారణం కనుక్కుందామని వెళ్లిన మహామంత్రితో ఆమె ‘అతని జన్మరహస్యం మీకు తెలుసు కదా, అతను శైవభక్తుడిగా మిగలాలనే నా కోరిక.’ అంది. అప్పుడే ఆ గదిలోకి వచ్చిన మధురాంతకుడు అది విన్నాడు. ఏమిటా జన్మరహస్యం అని అడగగానే ఆమె బిడ్డను మార్చేసిన సంగతి చెప్పి, నీవు చోళ రాజవంశీకుడివి కావు కాబట్టి గద్దె నెక్కకూడదు అంది. అతను కోపంతో బయటకు వెళ్లిపోయాడు.
సుందరుడి ఎదుట అందరూ సమావేశమైనపుడు మహాదేవి, అముదన్‌ను కుమారా అని పిలిచి, యితనే నా కొడుకు అని ప్రకటించింది. ఆ సంగతి తనకు చిన్నపుడే తెలిసినా, మౌనంగా ఉన్నానని అతను అనడంతో అందరూ అతని స్వార్థరాహిత్యాన్ని మెచ్చుకున్నారు. ఆదిత్యుడు మరణించాడు, మధురాంతకుడు వెళ్లిపోయాడు కాబట్టి రాజరాజుని యువరాజుని చేద్దామని అందరూ అన్నారు. రాజరాజు సరేసరే నంటూనే చివరి నిమిషంలో త్యాగబుద్ధితో తనకు బదులు అముదన్‌ను యువరాజ స్థానంలో కూర్చోబెట్టి అందరి చేత శహబాష్ అనిపించుకున్నాడు. సుందరుడి మరణానంతరం అముదనే ఉత్తమ చోళన్ పేరుతో రాజయ్యాడు. రాజరాజు యువరాజయ్యాడు. ఉత్తముడి మరణానంతరం రాజరాజు రాజయ్యాడు. వానతిని పెళ్లాడాడు. కుందవై, వందిదేవుడు పెళ్లాడారు. (ఫోటో – సుందరుడిగా ప్రకాశ్‌రాజ్, ఆదిత్యుడిగా విక్రమ్, కుందవైగా త్రిష, రాజరాజుగా జయంరవి, వందిదేవుడిగా కార్తీ, నందినిగా ఐశ్వర్య, నంబిగా జయరామ్)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2022)