అవును. పంజాబ్లో వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సర్వతోముఖ అభివృద్ధికి, ముఖ్యంగా వ్యవసాయరంగంలో ఆధునిక రీతులు అవలంబించి, కష్టజీవనానికి ప్రతీకగా నిలిచిన పంజాబ్ రైతు రుణగ్రస్తుడై తీర్చలేక ఆత్మహత్య చేసుకోవడం నమ్మశక్యం కాని విషయంగానే తోస్తుంది. 2000 సం॥ నుండి 2010 వరకు 6,926 మంది రైతులు మరణించారని పంజాబ్ ప్రభుత్వపు గణాంకాలే తెలిపాయి. కానీ వీటిని నమ్మని లూధియానా లోని పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్శిటీ, పాటియాలా లోని పంజాబ్ యూనివర్శిటీ, అమృత్సర్లోని గురునానక్ దేవ్ యూనివర్శిటీ సంయుక్తంగా సర్వేలు నిర్వహించి ఆ అంకె 40 నుండి 45 వేల మధ్య వుండవచ్చని అంటున్నాయి. మూడు జిల్లాలలో 2000-200 మధ్య జరిగిన మరణాల గురించి మొదటి సర్వే, 6 జిల్లాలలో 2000-2010 మధ్య జరిగిన మరణాల గురించి రెండో సర్వే, 19 జిల్లాలలో 2010-2014 ఏప్రిల్ మధ్య జరిగిన మరణాల గురించి మూడో సర్వే నిర్వహించారు. మూడో సర్వే ఫలితాలు ఇంకా రావాలి. నిధుల కొరత వలన వీళ్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించలేకపోయారు. తాలూకా ఆఫీసుల నుండి, విలేజి మునసబుల నుండి సమాచారం సేకరించి ఒక అంచనాకు వచ్చారు. ప్రభుత్వపు లెక్కలకూ, వీటికీ ఇంత వ్యత్యాసం ఎందుకు వస్తోందంటే – నష్టపరిహారం కోసం తమ వద్దకు వచ్చిన రైతు కుటుంబాలనే ప్రభుత్వం లెక్కలోకి తీసుకుంటోంది. రైతు ఆత్మహత్య చేసుకుంటే కుటుంబానికి రూ. 2 లక్షలిస్తున్నారు. రైతు భార్యకు రూ.200 నెలవారీ పెన్షన్ ఇస్తున్నారు. (ఈ స్కీము కూడా 2001లో ప్రకటించి 2010 నుంచి అమలు చేస్తున్నారు) అలా ఇవ్వాలంటే డెత్ సర్టిఫికెట్లో ఆత్మహత్య అని క్లియర్గా ఉండాలి. కానీ ఆత్మహత్య చేసుకుని చనిపోయిన సందర్భాల్లో కూడా కుటుంబసభ్యులు పోలీసుల వద్దకు వెళ్లి అలా చెప్పటం లేదు. ఆత్మహత్యకు కారణం మీరా? అంటూ తమను వేధిస్తారన్న భయం చేత! సహజమరణంగా నమోదు చేయిస్తున్నారు. అవి చూపించి పరిస్థితి మరీ ఘోరంగా లేదని వాదిస్తోంది ప్రభుత్వం.
ఇంతకీ అత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నట్లు? చనిపోతున్నవారిలో 79% మంది చిన్న రైతులు. రైతు రుణాలు దాదాపు రూ.10,000 కోట్లు. వాటిలో 5% హెచ్చువడ్డీకి (30%) వడ్డీవ్యాపారస్తుల వద్ద తెచ్చినవే. 5 ఎకరాలున్న రైతుకి రూ.5-7 లక్షల అప్పుంటోంది. గత ఐదేళ్లలో ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల ధరలు పెరిగి ఇన్పుట్స్ ధరలు రెండున్నర రెట్లు పెరిగాయి. కానీ పండిన పంట ధర రెండు రెట్లు మాత్రమే పెరిగింది. పంజాబ్లో భూజలాలు తగ్గిపోతున్నాయి. నదులు, కాలువలు వున్నా వాళ్లు వాటి గురించి పెద్దగా పట్టించుకోలేదు. 500 అ॥ లోతులో జల పడేది కాబట్టి బోరు వేసుకుని లాగేసేవారు. ఇప్పుడు వాటర్ టేబుల్ తగ్గిపోయి ఇంకా లోతుగా వెళ్లవలసి వస్తోంది. విద్యుత్ సరఫరా సరిగ్గా లేక బోరు నడపలేక పోతున్నారు. పంజాబ్ రైతులు రెండు పంటలు పండించడానికై ఎరువులు విపరీతంగా వాడి భూమి నాణ్యతను దెబ్బ తీశారు. ఎన్వెర్మెంట్ స్టాటిస్టిక్స్, 2013 ప్రకారం అక్కడి వ్యవసాయభూమిలో 39% భూమి నాణ్యత తగ్గిపోయి, వ్యవసాయానికి పనికి రాకుండా పోయింది. 50% భూమిలో నైట్రోజన్ తక్కువగా వుంది, 25% భూమిలో ఫాస్ఫరస్ తక్కువగా వుంది. జింక్, మెగ్నీషియం కూడా తగ్గిపోతున్నాయి. కొన్ని గ్రామాల్లో నీటిలో కెమికల్స్ ఎక్కువై పోయాయి. మంచి నీరు కావాలంటే 600 అడుగుల కంటె లోతుకి వెళ్లాలి.
ఈ కారణాల వలన రైతులు తెచ్చిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. భూముల ధర పడిపోయింది. రెండేళ్ల క్రితం ఎకరా రూ.20 లక్షలకు పలికిన భూమి ఈ రోజు సగానికి అమ్ముతామన్నా కొనేవారు లేరు. ఇక విసిగిపోయిన రైతులు, కుటుంబాలను నగరాలకు పంపేసి గ్రామం గ్రామాన్నే అమ్మకానికి పెడుతున్నారు. ఫజల్కా జిల్లాలో 11 గ్రామాల వారు ‘పారిశ్రామికవేత్తలారా, రండి, మా ఊళ్లను కొనేసుకోండి. ఇక్కడ వ్యవసాయభూములలో పరిశ్రమలు పెట్టుకోండి. ధర అంటారా? మా గ్రామవాసుల అప్పులన్నీ తీర్చేయండి, చాలు’’ అని బోర్డులు పెట్టారు. ఇవన్నీ పంజాబ్ హైకోర్టు దృష్టికి వచ్చాయి. రైతు ఆత్మహత్యల గురించి ప్రభుత్వం తరపున ఒక కమిషన్ వేసి నివారణ చర్యలు చేపట్టమని ఆదేశాలు ఇచ్చింది. వ్యవసాయమే మన ఆర్థికవ్యవస్థకు వెన్నెముక అని మర్చిపోయి సింగపూర్ మోడల్ అని పరుగులు పెడుతున్న మన రాష్ట్రాల నాయకులు ఇది గుర్తించాలి. సింగపూరు పైకి వచ్చిందంటే కారణం – విదేశీ పెట్టుబడులు, సేవారంగం ద్వారా, టూరిజం ద్వారా సంపాదిస్తున్న ఆదాయం. అక్కడ వ్యవసాయం లేదు. మనవి ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడిన రాష్ట్రాలు. వాళ్ల అభివృద్ధి మోడల్ మనెకలా పనికి వస్తుంది?
-ఎమ్బీయస్ ప్రసాద్