పివి నరసింహారావుగారి శతజయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వమే కాక ఆంధ్ర ప్రభుత్వం కూడా నిర్వహించాలని నా కోరిక. ఆయన తెలంగాణలో పుట్టి వుండవచ్చు. కానీ తెలుగువాడు. ప్రధానిగా ఉన్నపుడు నంద్యాల నుంచి పార్లమెంటుకు దాదాపు 6 లక్షల మెజారిటీతో ఎన్నికయ్యారు. తెలుగు భాషకు ఎంతో సేవ చేశారు. సమీప భవిష్యత్తులో తెలుగువాడికి ప్రధాని పదవి వస్తుందన్న ఆశ లేదు. ఆంధ్ర ప్రభుత్వం కనీసం ఏదో ఒక కట్టడానికైనా ఆయన పేరు పెట్టాలి.
ఈ శతజయంతి వేడుకలు ఏడాది పాటు సాగుతాయి కాబట్టి ఆయన గురించి, ఆయన రాజకీయాల గురించి కొన్ని వ్యాసాలు రాద్దామని సంకల్పం వుంది. ముందుగా మనందరికీ వింతగా తోచే విషయంపై రాస్తున్నాను. దేశప్రధానిగా రాణించిన పివి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎందుకు పేరు తెచ్చుకోలేక పోయారు? ప్రధానిగా ఎంతో రాజకీయ చతురత ప్రదర్శించిన ఆయన ముఖ్యమంత్రిగా ఎక్కడ తప్పటడుగులు వేశారు అనేది మనకు అర్థం కాదు. దీనికి సమాధానం లాటిది పివిఆర్‌కె ప్రసాద్ గారి ‘‘అసలేం జరిగిందంటే…’’లో నాకు కొంత తోచిందనుకుంటున్నాను.
ప్రసాద్ గారు ఐఏఎస్. నల్గొండ జిల్లాలో చిన్నరైతుల అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు ఆఫీసరుగా పనిచేసి తన ప్రతిభ చూపడంతో 1972లో ముఖ్యమంత్రిగా వున్న పివి గారు ఆయన్ని తన వద్ద సెక్రటరీగా పిలిపించుకున్నారు. ఆయన రాగానే పివి ‘నా టైమ్ మేనేజ్‌మెంటు కూడా నువ్వే చేయాలయ్యా. పొద్దున్న 7 గంటల నుంచి రాత్రి 11 దాకా పనిచేస్తున్నాను. అయినా నాతో సహా ఎవరికీ తృప్తిగా లేదు. ఫైళ్లు సరిగా రావటం లేదు, వచ్చినా అవి వెంటనే బయటకు పోవటం లేదు. ఇక్కడున్న సిబ్బంది మధ్య సమన్వయం లేదు. అన్నీ సక్రమంగా జరిగేట్టు చూడు.’ అన్నారు.
ప్రసాద్ పరిస్థితిని పరిశీలించారు. పివిది సాత్త్విక స్వభావం. కటువుగా మాట్లాడలేరు. గట్టిగా ఏదీ చెప్పరు. సూచనలిచ్చి సిబ్బంది అర్థం చేసుకోవాలని ఆశిస్తారు. వాళ్లు చేయకపోతే మందలించరు. వచ్చినవాళ్లు పని అయిపోగానే బయటకు వెళ్లిపోకుండా పోచికోలు కబుర్లు చెప్తూ కూర్చున్నా యిక వెళ్లండి అని చెప్పరు. దాంతో మంత్రులంతా యిష్టారాజ్యంగా వచ్చి గంటల తరబడి కూర్చుంటున్నారు. ఎవరైనా ముఖ్యమైన పని మీద వచ్చి విడిగా మాట్లాడాలనుకున్నా వీళ్లు వెళ్లరు. పివి వెళ్లమనరు. దాంతో వాళ్లూ కూర్చుని పిచ్చాపాటీ మొదలెడతారు. ముఖ్యమంత్రితో ఆంతరంగికంగా గంటల తరబడి మాట్లాడేటంత చనువుంది అని బయట చెప్పుకోవాలని వాళ్ల ఉద్దేశం.
సిఎం గారు మంత్రులకే తప్ప మాకు అవకాశం యివ్వటం లేదని శాసనసభ్యుల ఫిర్యాదు. ఇక పనుల మీద వచ్చిన సామాన్యజనం బయట పడిగాపులు కాస్తూ వుండేవారు. అర్జీ యివ్వలేకపోవటం చేత మళ్లీ మళ్లీ వచ్చి లాన్లలో కూర్చునేవారు. అదే జనం. మధ్యాహ్నం 11 గంటలకు సెక్రటేరియట్‌లో జరిగే మీటింగుల సమయంలో తప్ప తక్కిన సమయమంతా యిలాగే వృథాగా పోయేది. చీఫ్ సెక్రటరీకి సైతం సిఎంతో మాట్లాడడానికి వారానికి ఓ సారి కూడా అవకాశం చిక్కేది కాదు.
మామూలు అధికారులు కూడా బయట పడిగాపులు కాచేవారు. లోపలకి వెళ్లే అవకాశం వస్తే బయటకు వచ్చేవారు కారు. ఎందుకంటే విడిగా చెప్పాలనుకున్నది చెప్పే అవకాశం వుండేది కాదు. మరీ ముఖ్యమైన రహస్యం అయితే పివి గారే ప్రసాద్‌గారి గదికి వచ్చి వాళ్లతో మాట్లాడేవారు తప్ప తన గదిలో వున్నవాళ్లని అవతలికి పంపించేవారు కారు. తన సమయంలో చాలా భాగం యిలాటి ‘వృథా దర్బారు’లో పోవడం పివికి నచ్చేది కాదు కానీ ఎవరికీ గట్టిగా చెప్పేవారు కారు.
ఆయనకున్న ఒక ‘జిగ్రీ దోస్త్’ లక్ష్మీకాంతమ్మ. తరచూ ఎవరెవరో గుంపుల్ని తీసుకొచ్చేది పనులు చేసి పెట్టమంటూ. ఆయనకి ఇష్టముండేది కాదు. కానీ ఏమీ అనలేని ‘స్నేహ’ బంధం. (ఇదంతా ప్రసాద్ గారు రాసినదే) ఇక కాకాని వెంకటరత్నం వచ్చి ఆంధ్ర వేర్పాటు గురించి, డా. గోపాలకృష్ణ వచ్చి తెలంగాణ ఉద్యమం చల్లారలేదంటూ దాని గురించి.. గంటల తరబడి మాట్లాడేవారు. భూసంస్కరణల కారణంగా తలెత్తిన తీవ్ర అసంతృప్తిని చల్లార్చడానికి వాళ్లతోనూ మాట్లాడవలసి వచ్చేది. సిఎం ఆఫీసులో వర్క్ డివిజన్ చూడవలసిన ముగ్గురు అధికారులు సమర్థులే కానీ ఒకరంటే మరొకరికి పడని ఇగో సమస్య.
ఇదంతా చూశాక ప్రసాద్ టైమ్‌టేబుల్ గీశారు. ఉదయం 7 నుంచి 8 వరకు సిఎం ఆఫీసు అధికారులతో చర్చలు, 8 నుంచి 9 వరకు లాన్‌లోకి వచ్చి, వరసలో నుల్చొన్న అర్జీదారులతో మాట్లాడడం, 9 నుంచి 10 వరకు మంత్రులు, 10 నుంచి 10.30 వరకు ఎమ్మల్యేలు, 11 నుంచి 1 గంటవరకు సెక్రటేరియట్‌లో ఇంటర్వ్యూలు, 1 నుంచి 3 వరకు భోజనం, నిద్ర, 3 నుంచి 3.30 వరకు చీఫ్ సెక్రటరీతో చర్చలు, 3.30 నుంచి 4 వరకు మంత్రులతో అధికారిక విషయాలపై సమావేశం. తర్వాత బంగళాకు వచ్చి 4.30 నుంచి 5.30 వరకు రాజకీయ పార్టీ నాయకులకు కేటాయింపు, 5.30 నుంచి 7.30 వరకు ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్లడం. 7.30 నుంచి 9.00 వరకు ముఖ్యమైన వారితో డిన్నర్. 9 తర్వాత తన రూములోకి వెళ్లి ఫైళ్లు చూడడం.
‘‘ఇదంతా సవ్యంగా జరగాలంటే మీ దగ్గరకు వచ్చినవాళ్లు తమ పని కాగానే లేచి బయటకు వెళ్లాలి. అలా వెళ్లకపోతే నేను లోపలకి వచ్చి నిర్మొగమాటంగా వెళ్లిపోమని చెప్తాను. మీరేమీ అనకూడదు.’’ అన్నారు ప్రసాద్. పివి ఒప్పుకున్నారు. అంతే పనులు చకచకా జరిగిపోసాగాయి. పది రోజులయ్యేసరికి సిఎం నివాసంలో హడావుడి లేదు. జనం వస్తున్నారు, పని చేయించుకుని వెళ్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరికీ సిఎం దొరుకుతున్నారు, ఫైళ్లు కదులుతున్నాయి. అంతా హ్యాపీ, పివి కూడా హేపీ. ‘అంతా ప్రొఫెషనల్‌గా వుందోయ్’ అని ఆయన ప్రసాద్‌ను మెచ్చుకుంటే ఆయనా హేపీ.
అలాటిది పదిరోజులు పోయాక పివి ఆయన్ను పిలిచి ‘ఏవయ్యా ప్రసాదూ, నీ సమర్థతతో నా ముఖ్యమంత్రి పదవి పోగొట్టాలనుకుంటున్నావా?’ అని నిష్ఠూరంగా మాట్లాడడంతో యీయన తెల్లబోయాడు. అదేమిటండీ అంటే పివి గుక్క తిప్పుకోకుండా చెప్పారు –
‘ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం అంటుకుంది. నన్ను మార్చేయాలని ఇందిరా గాంధీ నిర్ణయం తీసేసుకుందనీ, అందుకనే నా దగ్గరకు ఎవరూ రావడం మానేశారనీ, కాబట్టే యిదివరకు కళకళలాడే సిఎం నివాసం యిప్పుడు బోసిపోతోందని నా ప్రత్యర్థులు ప్రచారం మొదలుపెట్టి దిల్లీ దాకా కబుర్లు మోస్తున్నారు. జనం లేకపోతే ఏం రాజకీయనాయకుడయ్యా? వేచి చూసే జనం లేరంటే వాడు నాయకుడే కాదన్నమాట అనే అభిప్రాయం వున్న యీ రోజుల్లో నీ సమర్థత పనికి రాదయ్యా. నాకు ప్రజల్లో పలుకుబడి హరించుకుపోయిందన్న మాట ఇందిరా గాంధీ తలకెక్కితే ఆవిడ పదవిలోంచి తీసేసినా తీసేయవచ్చు. అందుచేత రేపటి నుంచి మనం పాత సిస్టమ్‌కి వెళ్లిపోదామయ్యా! అన్నీ బాగుంటే సామర్థ్యం సంగతి ఆ తరువాత ఆలోచిద్దాం.’
అదీ సంగతి! అందుకే పివి రాజీనామా చేసినప్పుడు పెండింగు ఫైళ్లు గుట్టలుగుట్టలుగా పడి వున్నాయని చెప్పుకున్నారు. ఆయన ప్రధాని అయ్యాక కూడా ఏ నిర్ణయమూ తీసుకోకుండా తాత్సారం చేసేవారు. అదేమిటని అడిగితే నిర్ణయం తీసుకోకపోవడం కూడా ఓ నిర్ణయమే అనేవాడాయన. కానీ ఆయన పైన వేరే ఎవరూ లేకపోవడం చేత అది చెల్లింది. పైన పెద్దమ్మ ఒకరున్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా చెల్లలేదు. ఆవిడ దృష్టిలో తన యిమేజి ఎక్కడ చెడిపోతుందో అని చూసుకోవడంలోనే పుణ్యకాలం గడిచిపోయింది. ఇదీ ముఖ్యమంత్రిగా ఆయన వైఫల్యానికి కారణమనుకోవాలి.
పివి అవస్థ ఆ నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రుల పరిమితులను తెలియపరుస్తుంది. నెహ్రూ ప్రధానిగా వుండే రోజుల్లో రాష్ట్రాలలో బలమైన నాయకులు ముఖ్యమంత్రులుగా వుండేవారు. దిల్లీలో కొందరు జోక్యం చేసుకోవాలని చూసినా, స్థానికంగా ఎవరు బలవంతులైతే వాళ్లకే అధికారం దక్కేది. నెహ్రూ తర్వాత యీ ముఖ్యమంత్రులు, రాష్ట్రనాయకులు కలిసి ప్రధానులను ఆడించడానికి చూశారు. ఇందిరా గాంధీ తొలిరోజుల్లో ఆ బాధలు అనుభవించి, ప్రజలతో నేరుగా సంబంధం పెట్టుకోవడానికి సంస్కరణాత్మక సంక్షేమ పథకాలు (ఉచితాలు కాదు) చేపట్టింది. దాంతో ఆమె యిమేజి పెరిగి, చక్రవర్తినిగా మారింది. 1971 తర్వాత ఆమె ప్రఖ్యాతి ఆకాశాన్నంటడంతో యిక రాష్ట్రనాయకుల స్థాయి తగ్గించడానికి పూనుకుంది.
అప్పటిదాకా రాష్ట్రాలలో కొన్ని కులాలు పాలనాకులాలుగా వుండేవి. ఇందిర ఆ కులాలను తప్పించి, రాజకీయంగా బలహీనులైన బ్రాహ్మణకులస్తులను ముఖ్యమంత్రులుగా చేయసాగింది. సిఎంగా పివి పదవీకాలంలో యితర రాష్ట్రాలలో వున్న బ్రాహ్మణ ముఖ్యమంత్రులెందరో చూడండి. బ్రాకెట్లలో పదవీకాలం రాస్తున్నాను. యుపి కమలాపతి త్రిపాఠీ (1971-73), ఎంపీ శ్యామ్ చరణ్ శుక్లా (1969-72), బిహార్ కేదార్ పాండే (1972-73), రాజస్థాన్ హరిదేవ్ జోషీ (1973-77), గుజరాత్ ఘనశ్యామ్ ఓఝా (1972-73), ఒడిశా నందినీ శతపథి (1972-73). ఆంధ్రప్రదేశ్‌లో అప్పటిదాకా ఎక్కువకాలం రాజ్యం చేసిన రెడ్లను తప్పించి బ్రాహ్మణుడైన పివి (పదవీకాలం సెప్టెంబరు 1971- జనవరి 1973) ని చేయడం జరిగింది. ఆయనకు అధికశాతం ఎమ్మేల్యేలలో బలం వుందా లేదాని చూడలేదు.
ఈ కారణాల చేత పివి, ఇందిర కటాక్షవీక్షణాలకై పాకులాడవలసి వచ్చింది. తనకంటూ గ్రూపు లేకపోవడం చేత, ఆవిడ దగ్గర తన యిమేజి పోతే పదవి పోతుందని భయపడవలసి వచ్చింది. ఇందిర బాటలో నడుస్తున్నాననుకుని తనకు అలవికాని భూసంస్కరణలు, అర్బన్ లాండ్ సీలింగ్ చేపట్టారు. పైగా ముల్కీ నిబంధనల గురించి హైకోర్టు తీర్పు వచ్చినపుడు తను తెలంగాణ పక్షపాతినని బాహాటంగా చాటుకుంటూ తెలివితక్కువ ప్రకటన చేసి, ఆంధ్రలో కోపాగ్ని రగిలించారు. అసలే భూసంస్కరణలను ఎలా ఎదిరించాలాని చూస్తున్న ఆంధ్ర భూస్వాములకు యిది అందివచ్చింది. జై ఆంధ్ర ఉద్యమం మొదలై పివిని పదవి నుంచి దింపేవరకూ కొనసాగింది.
దేశంలో యీనాటి అవస్థలన్నిటికీ కారణం, ఇందిర స్థానిక నాయకులెవర్నీ ఎదగకుండా చేయడమే. ఏది జరిగినా తన పేరు మీదే జరిగేట్లు చూసింది. దాంతో దేశం మొత్తంలో మరో నాయకుడి పేరు వినబడకుండా పోయింది. అలా చేయడానికి, అన్ని వేళలా ముఖ్యమంత్రిని బలహీనపరిచేది. బలహీనుడనుకుని ఎవరినైనా కూర్చోబెడితే, తర్వాత అతను బలపడుతూండడం చూసి, ప్రత్యర్థిని ఎగదోసేది. దిల్లీలో వాళ్లకు పలుకుబడి వున్నట్లు కలరింగు యిచ్చేది. దాంతో ముఖ్యమంత్రికి ఎప్పుడూ గుబులే.
రాష్ట్రవిభజన సమయంలో సోనియా అమలు పరిచిన వ్యూహం చూసినవారికి యిది బాగా అర్థమౌతుంది. దిల్లీ నాయకులు విభజనవాదుల వాదనకు తలూపేవారు, సమైక్యవాదుల వాదనకూ తలూపేవారు. ముఖ్యమంత్రిని కొనసాగించాలనేవాళ్లకూ తలూపేవారు, తక్షణం తీసేయాలనేవాళ్లకూ తలూపేవారు. ఎవరికీ ‘దీనిపై చర్చించం, వచ్చి మా టైము వేస్టు చేయకండి’ అనేవారు కారు. తెలంగాణ ఏర్పాటు గురించిన తొలి ప్రకటన ముఖ్యమంత్రి రోశయ్యకు చూపకుండా దిల్లీయే విడుదల చేసిందంటే దాని అర్థం ఏమిటి? ఇతనిపై మాకు ఏ మాత్రం గౌరవం లేదు, మేం అతన్ని ఖాతరు చేయం అని చాటి చెప్పినట్లే కదా! అలాటప్పుడు అతని మాట ఏ ఎమ్మెల్యే అయినా, ఏ అధికారి ఐనా వింటాడా?
ఇందిర ముఖ్యమంత్రులను తరచుగా మారుస్తూ వాళ్లను తోలుబొమ్మల్లా, కీలుబొమ్మల్లా చూసింది. అందుకే క్రమేపీ కాంగ్రెసు బలహీనపడింది. ప్రజలకు కూడా విసుగెత్తింది. ప్రత్యామ్నాయాల కోసం వెతికారు. అయితే అవి నిలదొక్కుకోలేక పోవడంతో మళ్లీ సోనియా సారథ్యంలోని కాంగ్రెసుకు ఛాన్సిచ్చారు. సోనియా హయాంలో ముఖ్యమంత్రులను తరచుగా మార్చలేదు కానీ, పైన చెప్పినట్లు వాళ్లను బలహీనంగానే వుంచింది. అందుకే మోదీ లాటి బలమైన ప్రత్యర్థి ఎదురైనప్పుడు రాష్ట్రాలలో కూడా కాంగ్రెసు ఓడిపోయింది.
అనేక రాష్ట్రాలలో కాంగ్రెసు ముఖ్యమంత్రుల పాలన గురించి ప్రతికక్షులు ఫిర్యాదు చేయడానికి వచ్చినపుడు సోనియా, రాహుల్ వాళ్లకు దర్శనం యిచ్చేవారు కారు. ఇప్పటికీ యివ్వటం లేదు. దాంతో వాళ్లు విసిగిపోయి, పార్టీలోంచి బయటకు వెళ్లి బిజెపిలో చేరిపోయారు, పోతున్నారు. ఆ విధంగా బిజెపి అడ్డదారుల్లో బలపడి పోయింది. తాజాగా సింధియా ఉదంతం ఆ ధోరణి యింకా కొనసాగుతోందని నిరూపిస్తోంది. కాంగ్రెసుతో పోలిస్తే యీ విషయంలో బిజెపి చాలా నయం. వాళ్లలోనూ హై కమాండ్ ప్రమేయం వుంటుంది కానీ, ముఖ్యమంత్రులను తరచుగా మార్చడం, అరికాళ్ల కింద మంటలు పెట్టడం ఉండదు. బిజెపిపాలిత రాష్ట్రాలలో రాష్ట్రనాయకుల మధ్య కలహాలు జరిగి, బలమైన వాళ్లు అధికారంలో ఉన్నవాళ్లని దింపేసిన సందర్భాలు ఉన్నాయి కానీ హై కమాండ్ దిల్లీ నుంచి కవర్‌లో పేరు పంపే సంస్కృతి లేదు.
కొన్నాళ్లు పోయాక పివి గురించి మరో వ్యాసం రాస్తాను.
ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2020)
[email protected]