తూర్పు శ్రీలంకలో యిటీవల హిందూ-ముస్లిముల మధ్య ఘర్షణ వాతావరణం పెరుగుతోంది. త్రిన్‌కొమలి లోని 'శ్రీ షణ్ముగ హిందూ లేడీస్ కాలేజి' అనే హైస్కూలులో నలుగురు ముస్లిము టీచర్లు ఉన్నట్టుండి చీరలు కట్టడం మానేసి అరేబియన్ స్త్రీలలా 'అబయా' (పై నుంచి కింద దాకా శరీరాన్ని కప్పి ఉంచే ఉడుపు) వేసుకు రాసాగారు. ఒక హిందూ స్కూలులో యిలాటి డ్రస్సు వేసుకురావడమేమిటంటూ స్కూలు పిల్లల తలిదండ్రులు, కొందరు టీచర్లు కలిసి ఆందోళనకు దిగారు.
స్కూలు ముందు ప్లకార్డులు పట్టుకుని నిరసనలు తెలిపారు. 'హిందూ స్కూళ్లు హిందువుల కోసమే. ఇక్కడ మతతత్వం చెల్లదు' అంటూ. 'ఈ స్కూలు 1923లో ఒక హిందూ స్త్రీ విరాళంతో నెలకొల్పినా, ప్రస్తుతం అది ప్రభుత్వ నిధులతో నడుస్తోంది. అందువలన హిందూ స్కూలు అనడానికి లేదు. 2000 మంది విద్యార్థుల్లో 120 మంది ముస్లిములే. అన్ని మతాల టీచర్లను నియమిస్తున్నారు. పైగా టీచర్లకు డ్రెస్‌కోడ్ లేదు. మాకు సౌకర్యంగా ఉన్న బట్టలు మేం వేసుకుంటున్నాం' అంటారు ఆ టీచర్లు.
ఆందోళనకారులు పనిలో పనిగా 'మీరు మంచి తమిళం మాట్లాడకలేకపోయినా ఫర్వాలేదు కానీ అపభ్రంశపు తమిళం మాట్లాడకండి' అంటూ నినాదాలు యిచ్చారు. శ్రీలంక తమిళుల యాసనే తమిళనాడు తమిళులు వెక్కిరిస్తారు. శ్రీలంక ముస్లిములు కూడా తమిళులే అయినా వారికి ప్రత్యేకమైన యాస ఉంది. దాన్ని వీళ్లు ఎత్తిచూపుతున్నారు. శ్రీలంక జనాభాలో ముస్లిము తమిళులు 10% ఉంటారు. హిందూ తమిళులు 13% ఉంటారు. బౌద్ధులు 70%, క్రైస్తవులు 7% ఉంటారు. ఇరు మతాల తమిళులు ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటారు.
'ఈలమ్' పేరుతో శ్రీలంక నుంచి విడిపోవాలని తమిళ హిందువులు (కొద్దిమంది తమిళ క్రైస్తవులు) హింసాత్మకమైన పోరాటం చేసినపుడు ముస్లిములు కలిసి రాలేదు. తమిళతనం కారణంగా మొదట్లో సానుభూతి చూపి, తిరుగుబాటుదారులను పోలీసుల నుంచి రక్షించినా 1990లో మసీదులో ప్రార్థన చేస్తున్న 100 మంది ముస్లిములను ఎల్‌టిటిఇ తుపాకులతో కాల్చి మట్టుపెట్టిన దగ్గర్నుంచి వాళ్లు సహకరించడం మానేశారు. ఈలం అంటూ ఏర్పడితే దానిలో అధికారం తమిళ హిందువులదే అవుతుందని, వాళ్లు తమను రెండో తరగతి పౌరుల కంటె హీనంగా చూస్తారని ముస్లిములు భయపడ్డారు.
దానికి తగ్గట్టుగానే వేర్పాటువాదులందరూ ముస్లిములను ప్రభుత్వానికి మద్దతుదారులుగా చూస్తూ తమ అధీనంలో ఉన్న తూర్పు ప్రాంతాల్లో వారిపై దాడి చేసి భయభ్రాంతులకు గురి చేశారు. ఉత్తర ప్రాంతాలలోని ముస్లిములను రాత్రికి రాత్రి ఖాళీ చేయించారు. పర్యవసానంగా ముస్లిములు శ్రీలంకలోని అధికారపక్షంతో చేతులు కలిపి, ప్రభుత్వంలో పదవులు సంపాదించుకుని, వారి మద్దతుతో వ్యాపారాల్లో దిగి ఆర్థికంగా బాగుపడ్డారు. కల్లోల ప్రాంతాల్లోనే ఉండిపోయిన హిందువులు ఎల్‌టిటిఇ కారణంగా, సైన్యం కారణంగా చాలా నష్టపోయి ఆర్థికంగా దెబ్బ తిన్నారు. 2009లో యుద్ధం ముగిసినా వాళ్లు కోలుకోవడానికి టైము పడుతోంది.
చాలా యిళ్లల్లో మగవారు ఎల్‌టిటిఇ చేతిలోనో, సైన్యం చేతిలోనో చనిపోయారు. అంతంత మాత్రంగా చదువుకున్న ఆడవాళ్లే యిళ్లు నడుపుతున్నారు. కాస్త డబ్బున్నవాళ్లు గొడవలు ప్రారంభం కాగానే విదేశాలకు వెళ్లి స్థిరపడిపోయారు. అందువలన అక్కడున్న వాళ్ల పరిస్థితి నాసిగా ఉంది. తత్ఫలితంగా యిరు వర్గాల మధ్య అసూయాద్వేషాలు కూడా కలిగాయి. అయినా ప్రత్యక్షంగా కలహాలకు దిగలేదు. కానీ యిటీవల మనదేశంలో హిందూత్వ శక్తులకు ఊపు రావడంతో శ్రీలంకలో కూడా హిందూ శక్తులు తమ ప్రతాపం చూపదలచాయి. 2016 అక్టోబరులో ''శివ సేనై'' పేర ఒక సంస్థ వెలిసింది.
ముస్లిం, క్రైస్తవ సంస్థల మతాంతీకరణను అడ్డుకోవడానికి ఆవిర్భవించాని చెప్పుకుంటోంది. దానికి ప్రతిగా ముస్లిములు అనేక కొత్త మసీదులు కట్టి ముస్లిముల్లో మతభావనలను రెచ్చగొట్టసాగారు. భారీగా ముస్లిము విద్యాసంస్థలు కూడా నెలకొల్పసాగారు. ఈ ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు జరిగి జాఫ్నా మేయరుగా ఇమ్మాన్యుయేల్ ఆర్నాల్డ్ ఎంపిక అయినప్పుడు సేవా సేనై 'తమిళ ప్రాంతాల్లో క్రైస్తవ ప్రాబల్యాన్ని సహించం' అని అడ్డు చెప్పింది. తమిళ మీడియాలో కొన్ని వర్గాలు వారికి వత్తాసు పలికాయి. ఇలా కొద్దిపాటి గొడవలు జరుగుతూండగా యింతలో ఏప్రిల్‌లో యీ స్కూలు గొడవ వచ్చింది.
డ్రస్సు మార్చిన నలుగురు ముస్లిం టీచర్లు ఆందోళన కారణంగా తమను 'ముస్లిం' స్కూళ్లకు బదిలీ చేయమని ప్రభుత్వాన్ని కోరారు. ఇది శివసేనైలో ఉత్సాహాన్ని నింపింది. రంజాన్ మాసం వస్తూండగా గోవధ, గోమాంసం అమ్మకం నిషేధించాలంటూ జాఫ్నాలో నిరసన తెలిపారు. 'ఇది హిందువుల, బౌద్ధుల దేశం. మేం గోవులను పూజిస్తాం. మా సెంటిమెంట్లు గౌరవించాలి.' అని ప్రకటించి ముస్లిములూ హిందూ సంప్రదాయాలను అవలంబించాని పట్టుబడుతున్నారు. కొలంబోలో ముస్లిములు ఎక్కువగా నివసించే శివారులో గోరక్షణ సమితి వెలిసింది.
నందిని అధిరోహించిన శివుడు బొమ్మతో పెద్ద హోర్డింగు పెట్టి 'గోమాంసం తిననివారిని దేవుడు రక్షిస్తాడు' అని రాసి పెట్టారు. సింహళ వంటకాలు – ముఖ్యంగా మాంసాహారం – ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులను ఆకర్షిస్తాయి. ఇప్పుడీ నిషేధం వలన టూరిజం దెబ్బ తినవచ్చు. రంజాన్ మాసంలోనే యీ వివాదం లేవనెత్తడంలో దురూహ కనబడింది కొన్ని తమిళ సామాజిక సంస్థలకు. 'మనల్ని చీల్చడానికి పొరుగుదేశం రచించిన వ్యూహం యిది' అంటున్నాయి అవి. ఎందుకంటే శివసేనై ప్రారంభం కాగానే శివసేన నాయకుడు సంజయ్ రౌత్ మద్దతు ప్రకటించాడు.
ఈ వివాదం కారణంగా తామెవరికీ లొంగేది లేదని, తమ ఐడెంటిటీని కాపాడుకోవడానికి వెరవమని చాటుకోవడానికి యిరు వర్గాలూ ప్రయత్నిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ముస్లిము వనితలు అబయా ఎక్కువగా వేసుకుంటున్నారు. అరేబియా ప్రాంతం నుంచి తిరిగి వచ్చిన బంధువులు బహుమతిగా యిచ్చినవి కొన్ని. లోకల్ మార్కెట్లలో అమ్ముతున్నవి కొన్ని. కొంతమంది నల్లవి వేసుకుంటారు. మరికొందరు రంగురంగులవి వేసుకుంటారు.
'ఇదంతా మన తమిళ సంస్కృతి కాదు' అని అభ్యంతరం తెలుపుతున్న హిందువుల వాదన తిప్పికొడుతూ 'కొందరు హిందూ మహిళలు సాల్వార్‌కమీజ్ వేసుకుంటున్నారు. అది తమిళ సంస్కృతా?' అని అడుగుతున్నారు ముస్లిములు. ఆందోళన చేస్తున్న వారిలో కొందరు ఆడవారు సాల్వార్ కమీజ్ వేసుకోవడం గమనించవచ్చు. తమ ఉనికి చాటుకునే ప్రయత్నంలో భాగంగానే ఆ టీచర్లు డ్రస్సు మార్చారు. వార్తల్లోకి ఎక్కారు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2018)
[email protected]