కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాండీ యిటీవలి కాలంలో చాలా కష్టాలు ఎదుర్కుంటున్నారు. ఆయన కాబినెట్‌లోని మంత్రులు సెక్స్ స్కాండల్స్‌లో యిరుక్కున్నారు. కొందరు మంత్రులే కాదు, ఆయన ఆఫీసు కూడా అవినీతి వివాదంలో చిక్కుకుంది. కోర్టు చివాట్లు వేసింది. కాంగ్రెసు చీఫ్ వ్హిప్ పిసి జార్జి వ్యాఖ్యలు యిరకాటంలోకి నెట్టాయి. ఇదే అదనుగా భావించి సిపిఎం నాయకత్వంలోని ప్రతిపక్షాలు చాండీ రాజీనామా చేయాలంటూ ఆందోళన చేపట్టాయి. ఆయన మీటింగులకు వచ్చి అల్లరి చేయసాగాయి. అతని యింటిని కూడా చుట్టుముడతాయని బెదిరించాయి. పరిస్థితి చేజారిపోతోందని గ్రహించిన చాండీ ధైర్యం చేసి జనంలోకి వెళ్లి పరిస్థితి ఎదుర్కోవాలని నిశ్చయించుకున్నాడు. అక్టోబరు 1 న తిరువనంతపురంలో రచ్చబండ వంటి కార్యక్రమం నిర్వహించాడు. ప్రజలు వచ్చి తమ గోడు వినిపించుకున్నారు. అభ్యర్థనలు యిచ్చారు. చాండీ అప్పటికప్పుడు ధనసహాయాలు ప్రకటించాడు. అది విజయవంతం కావడంతో ఇంకో వారం పోయాక కోచిలో యింకో రచ్చబండ నిర్వహించాడు. అక్కడ 14 వేల పై చిలుకు పిటిషన్లు తీసుకుని రూ.2 కోట్లు ఆర్థిక సహాయం ప్రకటించాడు. వీటితో ముఖ్యమంత్రి పాప్యులారిటీ పెరగసాగింది.
ఇది ప్రతిపక్షాలకు చింత కలిగించింది. అక్టోబరు 27 న ముఖ్యమంత్రి కమ్యూనిస్టులకు కంచుకోట ఐన కన్నూరులోని పోలీసు అథ్లెటిక్ మీటింగుకి వెళుతూండగా సిపిఎం కార్యకర్తలు అతని కారును అడ్డుకుని నల్లజండాల ప్రదర్శన నిర్వహించారు. అంతటితో ఆగలేదు, కారుపై రాళ్లు విసిరారు. ముఖ్యమంత్రి నుదుటిమీద, ఛాతీ మీద గాయాలయ్యాయి. దీన్ని రాజకీయంగా తనకు అనుకూలంగా మలచుకోవడానికి నిశ్చయించుకున్న చాండీ ఆ దెబ్బలకు చికిత్స తీసుకోలేదు. ఆ ఫంక్షన్‌కు అలాగే రక్తం ఓడుతూనే వెళ్లాడు. కన్నూరు జిల్లా కాంగ్రెసు కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూ ‘‘కమ్యూనిస్టులు బలంగా వున్న యీ జిల్లాలో మీరు ప్రాణాలకు తెగించి కాంగ్రెసు కోసం పోరాడుతున్నారని నేను స్వానుభవంతో తెలుసుకున్నాను.’’ అంటే చప్పట్లు పడ్డాయి. రక్తం కారుతున్న ముఖ్యమంత్రి టీవీల్లో కనబడడంతో సానుభూతి పెరిగింది. ముఖ్యమంత్రిపై దాడిని ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహిద్దామని కాంగ్రెసు ప్రతిపాదిస్తే ‘వద్దు, ప్రజలకు యిబ్బంది కలుగుతుంది’ అన్నాడు చాండీ. దాంతో సానుభూతి యింకా పెరిగింది. కాంగ్రెసువారంతా విభేదాలు మరచి చాండీకి మద్దతు ప్రకటించారు.
ఇదంతా చూసి సిపిఎం కంగారు పడింది. దాడికి, మాకూ ఎలాటి సంబంధం లేదు, దాన్ని ఖండిస్తున్నాం అని ప్రకటించింది. అది నిజమైతే సంతోషమే అన్నాడు చాండీ. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో 46 మంది కమ్యూనిస్టు కార్యకర్తలున్నారు. మొదటి యిద్దరు నిందితులు ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలే! అతి చేస్తే గతి చెడుతుందన్న సామెత వూరికే రాలేదు.