ఎమ్బీయస్‌: వెనిజువెలాపై సానుభూతా?

ఐక్యరాజ్యసమితికి చెందిన మానవహక్కుల కౌన్సిల్‌లో సీటు కోసం వెనిజువెలా చేసిన ప్రయత్నం ఫలించింది. 2006లో రూపుదిద్దుకున్న యీ హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌లో 47 మంది సభ్యులుంటారు. వారి పదవీకాలం మూడేళ్లు. 193 దేశాలు ఓటు…

ఐక్యరాజ్యసమితికి చెందిన మానవహక్కుల కౌన్సిల్‌లో సీటు కోసం వెనిజువెలా చేసిన ప్రయత్నం ఫలించింది. 2006లో రూపుదిద్దుకున్న యీ హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌లో 47 మంది సభ్యులుంటారు. వారి పదవీకాలం మూడేళ్లు. 193 దేశాలు ఓటు చేస్తాయి. ప్రతీ ఎన్నికలో 14 మంది సభ్యులు చొప్పున మారుతూంటారు.

అక్టోబరు 17 న జరిగిన ఎన్నికలో వెనిజువెలా పోటీ చేస్తానన్నపుడు 50 గ్రూపులు, అనేక దేశాలు అభ్యంతరం తెలిపాయి. ఆ దేశంలో మానవహక్కుల హననం విపరీతంగా జరుగుతోందని, దానికి సభ్యత్వం యిస్తే బాధితులను అపహసించినట్లు అవుతుందని వాదించాయి. తీరా ఎన్నికల తర్వాత చూస్తే దానికి 105 ఓట్లు పడ్డాయి. బ్రెజిల్‌కు 153, కోస్టా రికాకు 96 వచ్చాయి. ఫలితాలు వచ్చాక యింతకంటె ఘోరం మరేమీ లేదంటూ అమెరికాతో సహా అనేక దేశాలు యిది గగ్గోలు పెట్టాయి. ఐక్యరాజ్యసమితి స్వయంగా వెనిజువెలాలో జరుగుతున్న అత్యాచారాల గురించి విచారణ చేపట్టింది.

నిజానికి వెనిజువెలాలో మానవహక్కుల సమస్యే కాదు, మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. అక్కడ ఆర్థిక పరిస్థితి కుప్పకూలి చాన్నాళ్లయింది. ద్రవ్యోల్బణం 13,00,000% పెరిగింది. విద్యుత్‌ కొరత, నీటి కొరత, తిండి కొరత – వీటితో విసిగి, 2014 నుంచి 40 లక్షల మంది (ఇది ఐక్యరాజ్యసమితి లెక్క. ప్రభుత్వం అబ్బే, అంతమంది కాదు అంటోంది) దేశం విడిచి  పొరుగున ఉన్న కొలంబియాకు అక్కణ్నుంచి పెరు, ఈక్వడార్‌, చిలీ, బ్రెజిల్‌ దేశాలకు వలస పోయారు. మిగిలి ఉన్నవారు క్షుద్బాధతో హింసకు పాల్పడుతున్నారు. అనేక విమాన సంస్థలు ఆ దేశానికి విమానాలు నడపడం మానేశాయి.

అధ్యక్షుడు నికొలస్‌ మదురో సైన్యం సహాయంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. మిలటరీని మంచి చేసుకోవడానికి వారికి ఆహారధాన్యాల పంపిణీ, పెట్రోలు వ్యాపారాలు, కట్టబెట్టాడు. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ప్రతిపక్షాలు సొమ్ము చేసుకున్నాయి. దాంతో మదురో ప్రజాస్వామ్యాన్ని కాలరాసి, పదవిలో కొనసాగుతున్నాడు. దీనికంతా మూలకారణం దేశంలో ఆర్థిక పరిస్థితి కుప్పకూలడం. దానికి బీజం మదురోకు ముందు దేశానికి అధ్యక్షుడిగా ఉన్న హ్యూగో చావెజ్‌ కాలంలో పడింది.

వెనెజువెలా ఆర్థికవ్యవస్థంతా ఆయిలుపై ఆధారపడి ఉంది. అక్కడున్నన్ని చమురు నిక్షేపాలు ప్రపంచంలో వేరెక్కడా లేవు. దేశపు ఆదాయంలో 97% పెట్రోలు ఎగుమతుల ద్వారానే వస్తుంది. చమురు ధర ఎక్కువగా ఉన్నంతకాలం ఆదాయం బాగా వచ్చేది. 1999లో అధికారానికి వచ్చిన చావెజ్‌ సోషలిస్టు విధానాలంటూ తన 3 కోట్ల ప్రజలకు అనేక సౌకర్యాలు, సంక్షేమ పథకాలు కల్పించాడు. వస్తువులన్నీ చౌకధరకే అందేట్లా చేశాడు. ఉచితంగా యిళ్లు యిచ్చాడు. పెట్రోలు రెండు సెంట్లకే యిచ్చాడు. 

అతను పోయాక అతని స్థానంలో 2013 ఏప్రిల్‌లో వచ్చిన మదురో తన గురువు చావెజ్‌ విధానాలే కొనసాగించాడు. అప్పటికే ఆయిల్‌ ధరలు పడిపోయినా సంక్షేమ పథకాలు ఆపకపోవడం వలన అపారనష్టం జరిగింది. వాటి కొనసాగింపు పులిస్వారీలా తయారైంది. 2013, 14లలో ఆయిలు బారెల్‌ 100 డాలర్లుండేది. 2016 జనవరి నాటికి బారెల్‌ 28 డాలర్లు కావడంతో 'ఎకనమిక్‌ ఎమర్జన్సీ' ప్రకటించాడు. గతంలో ఎగుమతుల ద్వారా పోగేసిన బంగారం, క్యాష్‌ నిలువలు తరిగిపోసాగాయి. అయినా మదురో ప్రభుత్వం మేలుకోలేదు. సోషలిస్టు విధానాలు అవలంబిస్తున్న దేశమంటూ ఆహారధాన్యాలు, తదితర పదార్థాలు తాము చెప్పిన ధరకే అమ్మేట్లా వ్యాపారస్తులపై నిబంధనలు విధించింది. దాంతో పొరుగున వున్న కొలంబియాకు వీటిని స్మగుల్‌ చేసి అక్కడ హెచ్చు ధరలకు అమ్మసాగారు. ఉత్పత్తి చేసిన వస్తువులకు గిట్టుబాటు ధర రావటం లేదని రైతులు, పారిశ్రామికవేత్తలు తయారుచేయడం మానేశారు. వారి కొనుగోలు శక్తి కూడా తగ్గిపోయింది. ప్రజలకు వస్తువులు లభ్యం కావడం మానేశాయి. వెనెజువెలాలో లభించే ఆయిలు ముడి తైలం. దాన్ని శుద్ధిపరిస్తే తప్ప ధర పలకదు. శుద్ధిపరచే యంత్రాలపై గతంలో పెద్దగా పెట్టుబడి పెట్టకపోవడం వలన, 1999-2013 మధ్య పెట్రోలు ఉత్పత్తిలో 25% తగ్గిపోవడం వలన వాళ్లకు ఆయిలు ఆదాయం తగ్గింది. అయినా ఉచిత పథకాలు ఆపడం పాలకుల తరం కాకపోయింది. ప్రభుత్వం కరెన్సీ ఎక్కువగా ముద్రించసాగింది. దానితో డబ్బు విలువ తగ్గి, వస్తువ విలువ పెరిగి ద్రవ్యోల్బణం వచ్చింది. ప్రస్తుతం ప్రతి 19 రోజులకు వస్తువు ధర రెట్టింపు అవుతోందట. 

వీటి కారణంగా మదురో పరపతి తగ్గిపోతూ వచ్చింది. 2016 జనవరిలో జరిగిన ఎన్నికలలో అతని పార్టీకి నేషనల్‌ అసెంబ్లీ లో 54 సీట్లు వస్తే ప్రతిపక్షమైన డెమోక్రాటిక్‌ పార్టీ 109 వచ్చి కాంగ్రెసులో 65% సీట్లు సంపాదించుకుంది. దాంతో నేషనల్‌ అసెంబ్లీ  అధికారాలను కాలరాయడానికి మదురో 2017లో నేషనల్‌ కాన్‌స్టిట్యూయెంట్‌ ఎసెంబ్లీ అని మరోటి ఏర్పాటు చేసి, దాన్ని తన అనుయాయులతో నింపేశాడు. దాని ఆధ్వర్యంలోనే ముందస్తుగా 2018 మే లో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాడు. అనేక ప్రతిపక్షాలు వాటిని బహిష్కరించాయి. కొందరు అభ్యర్థులను ప్రభుత్వం అనర్హులుగా ప్రకటించింది. మరి కొందరు జైలుపాలయ్యారు, లేదా దేశం విడిచి పారిపోయారు. ఎన్నికలు సక్రమంగా జరగలేదని ఆరోపించాయి. మదురో మాత్రం తాను నెగ్గినట్లు ప్రకటింప చేసుకుని మొదటి పదవీకాలం (2013-2019)లో మిగిలిన నెలలు కూడా పూర్తి చేశాక 2019 జనవరి నుంచి రెండో టెర్మ్‌ అధ్యక్షుణ్నని చెప్పుకుంటున్నాడు.

ప్రతిపక్ష నాయకుడు, నేషనల్‌ అసెంబ్లీలో ఆధిపత్యం ఉన్న జువాన్‌ గువాడో ఎన్నికతో ప్రమేయం లేకుండా అప్పణ్నుంచే తనే యాక్టింగ్‌ ప్రెసిడెంటునని చెప్పేసుకుంటున్నాడు. మదురోపై కసితో ఉన్న అమెరికా అతన్ని ప్రెసిడెంటుగా గుర్తించేసింది. దానితో బాటు మరో 50 దేశాలు కూడా! గువాడో ఏప్రిల్‌ 30న కొందరు మిలటరీ వాళ్లను చుట్టూ పెట్టుకుని మదురోకు వ్యతిరేకంగా తిరగబడమని సైన్యానికి పిలుపు నిచ్చాడు. అయితే వాళ్లు తిరగబడలేదు. అమెరికా గువాడోను సమర్థిస్తూండగా, రష్యా, చైనా మదురోకు మద్దతుగా నిలబడ్డాయి.

ఈ చిక్కుముడిని విప్పడానికి గతంలో వాటికన్‌ ద్వారా ప్రయత్నించినా లాభం లేకపోయింది. మే నెలలో ప్రభుత్వం, ప్రతిపక్షం మరో దేశమైన నార్వేలో, బార్బడాస్‌లో చర్చలు జరపసాగాయి. అవి నడుస్తూండగానే మదురోను అణచడానికి అమెరికా ఆగస్టు 5న వెనిజువెలాపై తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధించింది. దాంతో కినిసిన మదురో ప్రతిపక్షంతో రాజీ చర్చలు ఆపివేశాడు. అమెరికా రెండేళ్లగా వెనిజువెలాపై ఆంక్షలు విధిస్తూ వచ్చింది. దానితో వ్యాపారం చేయవద్దని తక్కిన దేశాలపై ఒత్తిడి తెస్తూ ఉంది. ఆగస్టులో అవి తారస్థాయికి చేరి 'టోటల్‌ ఎకనమిక్‌ ఎంబార్గో' ప్రకటించింది. వెనిజువెలా ప్రభుత్వానికి అమెరికాలో గల యావదాస్తులను ఫ్రీజ్‌ (స్తంభింప) చేసింది. సిఐఏ చేతిలో కీలుబొమ్మ ఐన గువాడో పరపతి పెంచడానికే అమెరికా యిలా చేసిందని వెనిజువెలా ఆరోపణ. మదురో ప్రభుత్వంతో లావాదేవీలు చేసే దేశాలన్నిటికీ అమెరికా తాజాగా హెచ్చరిక జారీ చేసింది.

వెనిజువెలా దక్షిణ (లాటిన్‌) అమెరికాలో ఒక దేశం. దక్షిణ అమెరికా మొత్తాన్ని తన పెరడుగా భావిస్తూ, అక్కడి ప్రభుత్వాలు తమ కనుసన్నల్లో నడవాలని, నడవని పక్షంలో జోక్యం చేసుకునే హక్కు తమకుందని అమెరికా ఉద్దేశం. ఆ భావాన్ని 19వ శతాబ్దంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు మన్రో బాహాటంగా వ్యక్తపరిచాడు. దానికి అనుగుణంగానే యునైటెడ్‌ స్టేట్స్‌ దక్షిణ అమెరికాలోని అనేక దేశాలలో సిఐఏ ద్వారా కుట్రలు జరిపించింది, దేశాధినేతలను హత్య చేయించింది. ఆంక్షలు విధించి ఉక్కిరిబిక్కిరి చేసింది. క్యూబాపై ఆంక్షలు, ఫిడెల్‌ కాస్త్రోపై హత్యాయత్నాలు అందరికీ తెలిసినవే.

1988లో పనామాలోని మాన్యుయెల్‌ నొరియేగా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అమెరికా యిలాగే ఆర్థిక ఆంక్షలు విధించి, అవి సఫలీకృతం కాకపోవడంతో సైనికదాడి చేసింది. సభ్యప్రపంచం యీ విధానాన్ని అసహ్యించుకుంటూ రావడంతో అమెరికా మన్రో సిద్ధాంతాన్ని వదులుకుంటున్నామని 2013 నవంబరులో ప్రకటించింది. కానీ ట్రంప్‌కి మాత్రం ఆ సిద్ధాంతం మీదే మక్కువ. గత సెప్టెంబరులో యునైటెడ్‌ నేషన్స్‌ జనరల్‌ అసెంబ్లీలో ప్రసంగిస్తూ 'మా అమెరికా ఖండంలో యితర దేశాల  జోక్యం ఉండకూడదనే మన్రో కాలం నుంచి మా దేశపు విధానం' అన్నాడు. 

వెనిజువెలాకు రష్యా, చైనా మద్దతిస్తున్నాయనే ట్రంప్‌ బాధ. రష్యా ఆ దేశంలో తన సైనికదళాల నుంచి అమెరికా దాడి చేయకుండా చూస్తోంది. ఇప్పుడు వెనిజువెలాపై సైనికదాడి చేసే అవకాశం లేకపోలేదని ట్రంప్‌, అమెరికా ఎన్‌ఎస్‌ఏ (నేషనల్‌ సెక్యూరిటీ ఎడ్వయిజర్‌) జాన్‌ బోల్డన్‌ ప్రకటించారు. కానీ యిప్పటిదాకా అమెరికా తన మిత్రులైన కొలంబియా, బ్రెజిల్‌లను ఆ విషయంగా ఒప్పించలేకపోయింది. జూన్‌లో చిలీ సహాయంతో అమెరికా కుట్ర చేసింది కానీ వెనిజువెలా ప్రభుత్వం దాన్ని విఫలం చేసింది.

వెనిజువెలాలో ఉన్న ఘర్షణను నివారించడానికంటూ అమెరికా నేషనల్‌ సెక్యూరిటీ ఎడ్వయిజర్‌ జాన్‌ బోల్టన్‌ పెరూ దేశంలో 100 దేశాలతో సమావేశం ఏర్పాటు చేశాడు. రష్యా, చైనా, టర్కీ వగైరా దేశాలు హాజరు కామని చెప్పాయి. 50 దేశాలు సమావేశమయ్యాయి. వారితో పాటు యూరోపియన్‌ యూనియన్‌, ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌ ప్రతినిథులు కూడా హాజరయ్యారు. వెనిజువెలా, ఇరాన్‌పై విషం కక్కుతూ వచ్చిన బోల్టన్‌ ఉత్తర కొరియా విషయంలో ట్రంప్‌తో తీవ్రంగా విభేదించడంతో ట్రంప్‌ అతన్ని సెప్టెంబరులో పదవి నుంచి తొలగించేశాడు. 

ఆ సమావేశం జరుగుతూండగానే అమెరికా యింత తీవ్రమైన చర్య తీసుకోవడాన్ని వెనిజువెలా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న యూరోపియన్‌ యూనియన్‌ కూడా తప్పుపట్టింది. వెనిజువెలాతో బాటు క్యూబా, నికారాగువాలలో కూడా ప్రభుత్వాలు మారవలసినదే అని బోల్టన్‌ బహిరంగ ప్రకటన చేశాడు. ఎప్పుడైతే అమెరికా తీవ్రచర్యలు చేపట్టిందో ఆగస్టులోనే వెనిజువెలా, రష్యా మిలటరీ-టెక్నికల్‌ సహకారానికి ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఒక దేశం నుంచి మరో దేశానికి నౌకలు ప్రయాణించవచ్చని రాసుకున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వైమానిక దళాల గురించి యిలాటి ఒప్పందం చేసుకున్నాయి. రష్యా ప్రభుత్వసంస్థ అయిన రాసెన్‌ఫ్ట్‌ అనే ఆయిల్‌ కంపెనీ వెనిజువెలాలో రెండు చమురు క్షేత్రాలను అభివృద్ధి చేస్తోంది. చైనా వెనిజువెలా ఉత్పత్తి చేసే చమురులో ఎక్కువ భాగం కొనడమే కాక, ఆ దేశంలోని హైడ్రోకార్బన్‌ పరిశ్రమల్లో పెట్టుబడులు పెడుతోంది.

అమెరికా వెనిజువెలాను అణచివేయడానికి చేస్తున్న ప్రయత్నాలకు ప్రతిస్పందనగా యివి జరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో ట్రంప్‌ ప్రభుత్వం వెనిజువెలా ప్రభుత్వానికి చెందిన ఆయిల్‌ కంపెనీ పిడివిఎస్‌ఏ యొక్క అమెరికన్‌ సబ్సిడియరీ సిఐటిజిఓను తన చేతిలోకి తీసుకుంది. దీనికి అమెరికాలో ఒక పెద్ద ఆయిల్‌ రిఫైనరీతో అనేక పెట్రోలు పంపులున్నాయి. 2018లో 23 బిలియన్‌ డాలర్లు ఆర్జించింది. డబ్బుల్లేక అల్లాడుతున్న వెనిజువెలా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్న యీ కంపెనీని అమెరికా ప్రభుత్వం తీసుకుని ప్రతిపక్ష నాయకుడు గువాడో అనుయాయులను డైరక్టర్లగా నియమించింది. దీనిపై వెనిజువెలా ప్రభుత్వం అమెరికన్‌ కోర్టులో కేసు వేసింది. యాజమాన్యం మారాక కంపెనీ సరిగ్గా నడవడం మానేసింది. ఆ కంపెనీ అప్పులను కూడా అమెరికా తీర్చివేయాలని గువాడో కోరుతున్నాడు. సరే అనడానికి ట్రంప్‌ జంకుతున్నాడు. ఫిబ్రవరి నెలలో గువాడో అనుయాయులు వాషింగ్టన్‌లో ఉన్న వెనిజువెలా ప్రభుత్వపు రాయబార కార్యాలయంపై దాడి చేసి, దాన్ని వశం చేసుకున్నపుడు అమెరికా ప్రభుత్వం వారికి దన్నుగా నిలబడింది. గువాడో అనుచరుణ్ని అమెరికాలో ఆ దేశపు రాయబారిగా గుర్తించింది. ఇది అంతర్జాతీయ ఒప్పందాలకు విరుద్ధం.

ఎందుకిలా చేస్తున్నావని అమెరికాను అడిగితే 'అక్కడ ఎన్నికలు సరిగ్గా జరగలేదు, ప్రజాస్వామ్యం లేదు' అని సమాధానం యిస్తుంది. ఎన్నికలు సవ్యంగా జరగని దేశాలెన్నో ఉన్నాయి, అనేక ఆఫ్రికన్‌ దేశాలతో సహా పాకిస్తాన్‌లో ఎన్నడూ ప్రజాస్వామ్యం ఉండదు. ఎన్నికలను రిగ్‌ చేస్తారు. అయినా అమెరికాకు చీమ కుట్టదు. అక్కడి సైనిక పాలకులకు, సైన్యం చేతిలో కీలుబొమ్మలుగా ఉన్న పాలకులకు కొమ్ము కాస్తూ ఉంటుంది. కానీ ఆ దేశాల్లో చమురు ఉందనుకోండి, లేకపోతే భౌగోళికంగానో, మిలటరీపరంగానో కీలకమైన స్థానంలో ఉందనుకోండి, అంతే విపరీతంగా బాధపడిపోతుంది. అక్కడ మారణాయుధాలు ఉన్నాయనో, అక్కడ మైనారిటీల హక్కులు కాపాడాలనో. కమ్యూనిజం బారి నుంచి వాళ్లను రక్షించాలనో.. ఏదో సాకు చెప్పి అమెరికా దూరిపోతుంది. ఇరాక్‌, లిబియా.. యిలా అనేక దేశాలలోని  ప్రభుత్వాలను కూలదోసి, రాజకీయ, సామాజిక అస్థిరతను నెలకొల్పుతోంది. ఆ మంటల్లో చలికాచుకుంటుంది. 

సిరియాలో యిన్నాళ్లకు తప్పుకుంది. పూర్తిగా కాదు.. చమురు క్షేత్రాలను కాపాడడాని కంటూ కొంత సైన్యాన్ని ఉంచుతున్నారు. వెనిజువెలాలో చమురు క్షేత్రాలు ఉండి వుండకపోతే దాని కర్మానికి దాన్ని వదిలేసి ఉండేదే! చమురు ఉంది కాబట్టి అక్కడ తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని నెలకొల్పి, ఆ చమురును చౌకగా జుర్రేయాలని దాని తాపత్రయం. ఆ ఉద్దేశాన్ని కప్పిపుచ్చడానికి ఏవేవో కబుర్లు చెపుతోంది. వెనిజువెలాలో ఎన్నికలు సరిగ్గా జరగకపోతే దాని సంగతి అక్కడి ప్రజలు చూసుకుంటారు. ఆ మాట కొస్తే అమెరికా ఎన్నికలలో రష్యా ప్రభావితం చేసిందని, ట్రంప్‌ ఎన్నికే సక్రమం కాదనీ రుజువులు లభిస్తున్నాయి. ఆ సంగతి చూసుకోవలసినది అమెరికా ప్రజలే, చిలీ ప్రభుత్వం కాదు. అయినా ఆ సాకు చూపి చిలీ అమెరికాపై దండెత్తితే ఎంత అందంగా ఉంటుందో, యిదీ అంతే అందంగా ఉంటుంది. కాస్త ఓపిక పడితే వెనిజువెలా ప్రజలే మదురో దుర్భరపాలన భరించలేక తిరగబడతారు. కానీ అమెరికాకు ఆ ఓర్పు లేదు. ఆ దేశం పట్ల అమెరికా అనుసరిస్తున్న విధానంపై ఆగ్రహంతోనే అనేక దేశాలు వెనిజువెలాను యీ హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ ఎన్నికలో గెలిపించి ఉంటారని సులభంగా ఊహించవచ్చు. అందుచేత దీన్ని వెనిజువెలా పట్ల సానుభూతి అనడం కన్నా, అమెరికా పట్ల వ్యతిరేకత అనడం సబబు. 

నేను ఇతర రాష్ట్రాల గురించి, యితర దేశాల గురించి అనవసరంగా రాస్తానని, సుదీర్ఘంగా రాసి తలనొప్పి తెప్పిస్తానని కొందరి ఫిర్యాదు. తెలుగు మీడియాలో వీటి గురించి తరచుగా వార్తలు వస్తూ ఉంటే నేను చిన్న వ్యాసాలు రాసినా సరిపోతుంది. ఆ పరిస్థితి లేక, సమస్య పూర్వాపరాలు కూడా విశదీకరించడంతో వ్యాసం నిడివి పెరుగుతుంది. చిన్నదో, పెద్దదో అసలు ఆ సబ్జక్టు గురించి రాయడం దేనికి, మనకేం సంబంధం? అని కొందరు వ్యాఖ్యానిస్తారు. సమాజంలో ఏ సమస్యా వ్యక్తికి మాత్రమే పరిమితం కాదని చెప్పడానికి ముళ్లపూడి వెంకటరమణ గారు ''సాక్షి'' (1967)లో హీరోయిన్‌ చేత ''చెరువులో ఓ చిన్న బెడ్డ వేస్తే అల చెరువు చివరికంటా పోతుంది. మనమంతా చెరువులో నీరంటాళ్లం… ఒక మనిషిని కొడితే ఊరంతా తగులుతుంది.'' అనే అర్థంలో చెప్పించారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలన్నీ మనల్ని ఏదో ఒక విధంగా ప్రభావితం చేస్తాయి.

చెయ్యవు అని వాదిస్తూ బాబు, జగన్‌ అని జపిస్తూ కూర్చునేవారిని చూసి జాలి పడాలంతే. నూతిలోని కప్పలు కూడా కరువొచ్చినా, వానలొచ్చినా నూతిలో నీరు తరిగి లేదా పెరిగి ప్రభావితమౌతాయి.  పేరు పలకడం రాని వెనిజువెలా ప్రభావం కూడా మనపై ఉందని మనం గ్రహించాలి. ఎందుకంటే వెనిజువెలా నుంచి చమురు దిగుమతి చేసుకునే పెద్ద క్లయింట్లలో మన దేశం (28% ఎగుమతులు మనకే) ఒకటి. అమెరికా బెదిరింపులకు దడిసి, మనం ఏడాదిగా వాళ్ల నుంచి చమురు దిగుమతి చేసుకోవడం మానేశాం. రిలయన్స్‌ ఆంక్షలకు ముందే పిడివిఎస్‌ఏతో దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంది కాబట్టి ఆ దిగుమతి   ఆగలేదు. ఈ ఆంక్షల తర్వాత గబగబా దిగుమతులు చేసేసుకుంటోంది. ఈ ఏడాది మే నుంచి అమెరికా ఇరాన్‌ నుంచి కూడా మన దిగుమతి ఆపించేసింది. పెట్రోలు దిగుమతులు తగ్గితే, దాని ధర పెరిగి ఆర్థిక వ్యవస్థ ఎలా అస్తవ్యస్తమవుతుందో అర్థం చేసుకోవచ్చు. 

ఇదొక్కటే కాదు, పెట్రోలు ఎగుమతులపై వస్తున్న ఆదాయం ఎల్లకాలం ఒకేలా ఉంటుందనుకుంటూ లెక్కకు మిక్కిలి సంక్షేమ పథకాలు పెట్టి సంక్షోభంలో పడిన వెనిజువెలా గతి ఏమైందో మన తెలుగు రాష్ట్రాధిపతులు కూడా గుర్తించాలి. ఆ విషయమే యనమల రామకృష్ణుడు ఎత్తి చూపారు. జగన్‌ విధానాల వలన రాష్ట్రం వెనిజువెలాలా మారుతుందన్నారు. ఆయన ఆర్థికమంత్రిగా ఉన్నపుడూ యిలాగే చేశారు. అప్పుడు వెనిజువెలా గురించి అధ్యయనం చేయలేదేమో మరి! ఆయన స్టేటుమెంటు అర్థం కావడానికైనా యీ వ్యాసం చదవాలి. ఇలాటివి బోరనుకుంటే యీ కాలమ్‌వైపు తొంగి చూడడం కూడా అనవసరం.

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2019)
[email protected]