తారల గర్భం దాల్చడం ఒకెత్తయితే, దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం మరో ఎత్తు. ఎన్నో పార్టీలు, మరెన్నో ఫంక్షన్లు జరుగుతాయి. వీటికి అదనంగా ప్రెగ్నెన్సీ ఫొటోషూట్ ఒకటి. అన్నింటిలో ఖరీదైన వ్యవహారం ఇదే. తాజాగా దీపిక పదుకోన్ కూడా ఆ దశ లోకి ఎంటరైంది.
కల్కి ప్రమోషన్ తో సినిమాలకు విరామం ప్రకటించిన ఈ బ్యూటీ, ప్రస్తుతం ఇంటికే పరిమితమైంది. తప్పనిసరి అయితే తప్ప బయటకు రావడం లేదు. ఇంట్లో ఆమె ప్రెగ్నెన్సీ ఫొటోషూట్ షురూ చేసింది.
తాజాగా ఊదా రంగు చీర కట్టింది దీపిక పదుకోన్. అందులో ఆమె గర్భం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇదేమంట సాధారణ విషయం కాదు. ఆ చీర ఖరీదు అక్షరాలా లక్షా 92 వేల రూపాయలు. దీన్ని తయారు చేయడానికి 3400 గంటల సమయం పట్టిందంట.
ఇక చీరలో ప్రత్యేకతలు కూడా చాలానే ఉన్నాయి. దీనికి ‘హుకుం కా రాణీ’ అనే పేరు పెట్టారు. 16వ శతాబ్దానికి చెందిన హైదరాబాద్ లోని చౌమహల్లా ప్యాలెస్, కరాచీలోని ప్రసిద్ధ చౌకండీ సమాధుల నుంచి స్ఫూర్తి పొంది దీన్ని డిజైన్ చేశారు.
ఇక్కడితో అయిపోలేదు. ఈ చీరకు తగ్గ యాక్ససిరీస్ కోసం 3 లక్షల రూపాయలు ఖర్చు చేసింది దీపిక. ఇక మేకప్ కు మరో 30వేల రూపాయలు ఖర్చయ్యాయి. ఇలా ఖరీదైన లుక్ తో ఆమె ఫొటోలకు పోజులిచ్చింది. అంతేకాదు.. ఇదే చీరతో ఆమె తాజాగా అనంత్ అంబానీ సంగీత్ ఫంక్షన్ కు కూడా హాజరైంది. బిడ్డకు జన్మనిచ్చేలోపు మరో 4-5 ప్రెగ్నెన్సీ ఫొటోషూట్స్ ప్లాన్ చేసింది ఈ హీరోయిన్.