నందమూరి మోక్షజ్ఙ సినిమా ఎంట్రీ పనులు జోరుగా సాగుతున్నాయి. హీరో అన్ని విధాలా రెడీ కావడం అన్నది ఓ పక్క జరుగుతోంది. మరో వైపు ఓ మంచి దర్శకుడు తయారు చేసిన మంచి స్క్రిప్ట్ బాలయ్య చేత ఓకె అనిపించుకుంది. ఇక మిగిలింది, ఎప్పుడు.. ఎవరు.. ఎలా చేయాలి అన్నదే.
ఈ విషయంలో డిస్కషన్లు మొదలయ్యాయి. ప్రస్తుతం బాలయ్య అన్ని విధాలుగా బిజీగా వున్నారు. పైగా ఆయన ఏ విషయంలో, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, మాట్లాడాలన్నా అన్నింటికి మంచి చెడ్డ అన్నీ చూసుకోవడం అలవాటు. అందువల్ల అవన్నీ కుదరాల్సి వుంది.
అయితే మంచి దర్శకుడు, మంచి స్క్రిప్ట్ కుదిరింది. త్వరలో వివరాలు బయటకు వస్తాయి. మోక్షను ఈ ఏడాది ఎలాగైనా తెర మీదకు తీసుకురావాలన్నది అటు బాలయ్య సంకల్పం, ఇటు బాలయ్య కూతుళ్ల పట్టుదల. మోక్షు గతంలో ఎలా వున్నా ఇప్పుడు తను కూడా ఆసక్తిగా వున్నారు. అందుకే మేకోవర్ అయ్యారు. మంచి లుక్ లోకి వచ్చారు.
నందమూరి ఫ్యామిలీ నుంచి మూడో జనరేషన్ గా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వున్నారు. ఇప్పుడు మోక్షు యాడ్ అవుతారు. మెగా ఫ్యామిలీ తరువాత ఎక్కువ మంది హీరోలు వున్న కుటుంబం నందమూరే అవుతుంది అప్పుడు.