వ్యవసాయ కరెంట్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించే పని మొదలుపెట్టింది వైకాపా ప్రభుత్వం. సహజంగానే దాన్ని గట్టిగా వ్యతిరేకించి, ప్రచారం సాగించింది తెలుగుదేశం. నిజానికి స్మార్ట్ మీటర్లు అనేది కేంద్రం ఐడియా. దాన్ని కాదనలేని, అమలు చేయకుండా వుండలేని దుస్థితి రాష్ట్రానిది. అందుకే ఆ విమర్శలు అన్నీ అప్పట్లో అలా భరించింది.
ఇప్పుడు జనాలు వైకాపాను రిజెక్ట్ చేసారు. తేదేపా కూటమి అధికారంలోకి వచ్చింది. విద్యుత్ రంగం మీద శ్వేత పత్రం ఇచ్చారు. ఏ పాయింట్ ఎలా వున్నా, రెండు విషయాలు నోట్ చేసుకోవాల్సినవి వున్నాయి.
ఒకటి 2019 నాటికి అటు ఇటుగా 60 వేల కోట్ల అప్పు వుంది ఆంధ్ర విద్యుత్ రంగానికి. 2024 నాటికి అది 120 వేల కోట్లుగా మారింది. అంటే డబుల్ అయిందన్న మాట. అంటే తేదేపా ప్రభుత్వం వున్నా, వైకాపా ప్రభుత్వం వున్నా అప్పు కామన్ అనే కదా.
మరో పాయింట్ ఏమిటంటే స్మార్ట్ మీటర్ల మీద ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు సిఎమ్ చంద్రబాబు. ఆలోచన ఎందుకు? స్మార్ట్ మీటర్లు సరైనవి కాదని అదే కదా 2019 నుంచి 2024 మధ్యలో జగన్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోసింది.
జగన్ ప్రభుత్వం తీసుకున్న చెత్త పన్ను, ఇసుక విధానం టక్కున మార్చేసినట్లు, స్మార్ట్ మీటర్ల సంగతి కూడా తేల్చేయవచ్చు కదా. దాన్ని గురించి మాత్రం ఆలోచిస్తామని దాట వేయడం ఎందుకు అంటే..
ఆంధ్రలో వున్నది కూటమి ప్రభుత్వం. పైగా కేంద్రంతో సఖ్యత గా వుండాలి. పనులు జరిపించుకోవాలి. అలాంటపుడు కేంద్రం చెప్పినట్లు వినాల్సిందే. స్మార్ట్ మీటర్లు కేంద్రం ఆలోచన. అందుకే వాటి విషయంలో తరువాత నిర్ణయం తీసుకోవడం అన్నది. అంతకు మించి మరేం కాదు.