Advertisement

Advertisement


Home > Movies - Interviews

థియేటర్ కు ఓటమి వుండదు - మైత్రీ రవి

థియేటర్ కు ఓటమి వుండదు - మైత్రీ రవి

మైత్రీ మూవీస్..ఈ పేరు సినిమా జనాలకు, సినిమా అభిమానులకు ఇప్పుడు సుపరిచితం. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హవుస్ ల్లో ఒకటి. సినిమా రంగంలోకి సర్రున దూసుకువచ్చి , సినిమాల మీద సినిమాలు ప్లాన్ చేస్తున్న సంస్థ. కరోనా నేపథ్యంలో ఓటిటి నా? థియేటర్ నా? టాలీవుడ్ గమ్యం ఎటు? అనే డిస్కషన్లు సాగుతున్న తరుణంలో మైత్రీ మూవీస్ అధినేతల్లో ఒకరైన రవిశంకర్ తో ముఖాముఖి.

-నమస్కారం రవిశంకర్ గారూ, కరోనా నేపథ్యంలో సినిమా రంగం గురించి కాస్సేపు మాట్లాడుకుందామా?

ఎందుకండీ..ఎందరో పెద్ద పెద్దవాళ్లు వున్నారు. ముందు వాళ్లందరినీ కానివ్వండి.

-2020-21 లో నాలుగైదు భారీ ప్రాజెక్టులు. ఇంకా ఎన్నో ప్లానింగ్ లు. అన్నింటికి మించి కరోనా వల్ల ఆగిపోయిన సినిమాల్లో మీదీ ఒకటి. అందుకే మీతో మాట్లాడాలని.

ఎన్ని ప్లాన్ చేసాం అన్నది కాదు. ఎన్ని తీసాం..ఎన్ని హిట్ లు ఇచ్చాం అన్నది చూసుకోవాలి. ప్లానింగ్ దేముంది..అందరూ ప్లాన్ చేస్తూనే వుంటాం.

-ఒక్క రెండు వారాలు కరోనా ఎఫెక్ట్ లేకుండా వుంటే ఉప్పెన సినిమా థియేటర్లలోకి వచ్చి వుండేది. బాగా డిస్సపాయింట్ అయ్యారా?

అంతేకదండీ. సబ్జెక్ట్ ను బాగా నమ్మి తీసిన సినిమా. అందువల్ల ఆలస్యమైనా మంచి సినిమా అవుతుందనే ఆశతో వున్నాం.

-ఈ సినిమావల్ల ఎంత పెట్టుబఢి అలా వుండిపోయింది? ఓ ముఫై కోట్ల వరకు వుంటుందా?

అంత లేదండీ..పాతిక కోట్లు ఖర్చు అనుకుంటే, లాస్ట్ మినిట్ పేమెంట్లు పక్కన పెడితే ఓ 15 కోట్ల మేరకు ఇబ్బంది అనుకోవాలి. 

-వడ్డీలు, అదనపు భారం ఏమేరకు వుండొచ్చు.

నెల ఆలస్యం అయితే ముఫై లక్షలు వేసుకోండి. అయిదునెలలు ఆలస్యం అనుకుంటున్నాం. కోటిన్నర భారం పడినట్లేగా?

-ఓటిటి లో సినిమాలు విడుదల చేసే ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. మీరు అలాంటిదేం చేయలేదా?

లేదండీ. అంత రేటు రాదు అనుకుంటాను. ఎందుకంటే ఓ సినిమాకు పాతిక, ముఫై కోట్లు ఇవ్వడం అంటే మాటలు కాదు.

-అలాంటపుడు టాలీవుడ్ లో భారీ సినిమాలు అన్నీ వందకోట్ల పైమాటే. అవేవీ ఎప్పటకీ ఓటిటిలో నేరుగా విడుదల అయ్యే అవకాశం వుండదు. మరింక థియేటర్ కు భయం ఎందుకు?

ఏమండీ..థియేటర్ ఎప్పటికీ థియేటరే. ఆ అనుభవం వేరే. ఓటిటి సంస్థల ఏడాది బఢ్జెట్ ఎంత వుంటుంది? మహా అయితే వెయ్యి కోట్లు. అది కూడా ఇండియా వైజ్ గా. ఎన్ని సినిమాలు నేరుగా కొనగలరు? అయితే ఇక్కడ ఎగ్జిబిటర్ల భయం ఏమిటంటే, నాకు తెలిసి, కొన్ని సినిమాలు అయినా ఓటిటికి వెళ్లిపోతే, థియేటర్ కు సినిమాల సంఖ్య తగ్గిపోయి, వారి కంట్రోలు తగ్గిపోయే ప్రమాదం వుంది. సినిమాలకు అడ్వాన్స్ లు అవీ కాస్త ఎక్కువ ఇవ్వాల్సి రావచ్చు. ఈ పరిస్థితిని ఊహించి టెన్షన్ పడుతూ వుండొచ్చు. అంతే తప్ప, థియేటర్ ఎక్కడికీ పోదు.

-మీ లెక్క ప్రకారం థియేటర్లు ముందు తెరవాలా? షూటింగ్ లు ముందుగా ప్రారంభించాలా?

షూటింగ్ లే. ఎందుకంటే, షూటింగ్ ల మీద ఆధారపడి వేలాది మంది టెక్నీషియన్లు వున్నారు. ఎంత సిసిసి లాంటివి పెట్టి సాయం చేసినా, వాళ్లకు పని వుంటే వుండే ఆత్మగౌరవం వేరు కదా? పెద్ద పెద్ద పరిశ్రమలకు 30 పర్సంట్ లెక్కన అనుమతి ఇస్తున్నారు. అలాగే సినిమా షూటింగ్ లకు ఇవ్వాలి. కావాలంటే ఒక్కో క్రాఫ్ట్ యూనియన్ సభ్యులకు వంతుల వారీ పని కలిపించవచ్చు. 

-థియేటర్లు ఓపెన్ చేస్తే, జనం ఎప్పటి మాదిరిగావస్తారు అంటారా?

అది లాటరీ అండీ. రెండు నెలలుగా ఇంట్లో వుండి బోర్ కొట్టి భారీగా తరలిరావచ్చు. లేదూ ఇంకా భయంతో వెనుకంజ వేయచ్చు. రెండింటికీ అవకాశం వుంది. ఏదైనా ఈఏడాది చివరిలోగా వాక్సీన్ వచ్చేస్తుంది. 

-థియేటర్లు ఓపెన్ చేస్తే ఉప్పెన  ఎన్నాళ్లలో విడుదల చేస్తారు?

ఆ విషయంలో తొందర పడడం లేదు. అన్నీ చూసుకుని, జనం వ్యవహార శైలి చూసి, ఆగస్టులోనా, సెప్టెంబర్ లోనా? ఇలా వుంచి ఆలోచన. గిల్డ్ లో కూడా మిగిలిన సినిమాల డేట్ లు కూడా చూసుకోవాల్సి వుంటుంది. వర్క్ అయితే జస్ట్ అయిదు రోజుల పోస్ట్ ప్రొడక్షన్ మాత్రమే మిగిలి వుంది.

-పవన్ కళ్యాణ్, బన్నీ, మహేష్ బాబు, మూడు పెద్ద సినిమాలు. ఆపైన మెగాస్టార్ తో సినిమా అని వినిపిస్తోంది. ఇంకా ప్రభాస్ డేట్ లు మీకు వుండనే వున్నాయి. 2021 అంతా మీదేనా?

ఎప్పటి నుంచో ప్లాన్ చేసినవి ఇప్పుడు ఒకేసారి వచ్చాయి. బన్నీ సినిమా గత ఏడాది అక్టోబర్ నుంచి అనుకున్నాం. కేరళలో చిన్న షెడ్యూలు కూడా చేసాం. మహేష్ తో సినిమా కూడా గత ఏడాది అనుకున్నదే. ఇక పవన్ కళ్యాణ్ సినిమా కూడా అంతే. క్రిష్ తో సినిమా అయిపోగానే మా సినిమా స్టార్ట్ అవుతుంది. 

-మెగాస్టార్ తో సినిమా ఓకె అయినట్లేనా?

ఆయన ఓకె అన్నారు. కానీ కథ చెప్పించాలి. ఆయన ఓకె చేయాలి. ఆ తరువాత మిగిలిన విషయాలు.

-ఎప్పటి నుంచో వినిపిస్తున్న ప్రభాస్ -మైత్రీ సినిమా ఎప్పుడు వుండొచ్చు.

ప్రస్తుతం ఆయన నాగ్ అశ్విన్ సినిమా అనౌన్స్ చేసారు. అది అయిన తరువాత వుండొచ్చు. ఆయన దృష్టికి ఏదైనా కథ రావాలి. లేదా మేమే ఏదయినా కథ చెప్పించాలి. ఇలా చాలా వుంది.

-టాలీవుడ్ లో మైత్రీ సంస్థ నెంబర్ ఏమిటి? వన్ టు ఫైవ్ లో?

ఈ నెంబర్లు అంతా తాత్కాలికం అండీ. ఎన్నిసినిమాలు అన్నది కాదు. ఎంతపేరు తెచ్చుకున్నాం అన్నది. టాలీవుడ్ అంటే ఎప్పటికీ సురేష్ మూవీస్, గీతాఆర్ట్స్, వైజయంతీ ఇలా చాలా వున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాస్ గుర్తుందా? ఎన్ని పెద్ద సినిమాలు. ఎన్ని హిట్లు. ఒక్కసారిగా ఆగిపోయారు. అందువల్ల కాలానికి నిలిచిన సంస్థగా పేరు తెచ్చుకోవాలి. అంతే తప్ప నెంబర్లు అన్నీ తాత్కాలికమే.

-ఓకె అండీ. నాలుగు మాటలు మాట్లాడినందుకు థాంక్యూ

దాందేముందండీ..మీతో మాట్లాడడానికి మేము ఎప్పుడూ రెడీనే

-థాంక్యూ వన్స్ ఎగైన్

థాంక్యూ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?