Advertisement


Home > Movies - Interviews
సిస్టర్ హీరోయిన్ అయితే నా కెరీర్ పోతుందన్నారు

వరుణ్ తేజ..మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో. కానీ మరో హీరో అని సింపుల్ గా అనేయకుండా వుండేలా జాగ్రత్త పడుతున్న హీరో. తనకంటూ ఓ ఇమేజ్ కావాలి..కానీ ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకూడదు..ఇదీ సింపుల్ గా చెప్పాలంటే వరుణ్ స్ట్రాటజీ. ముకుంద సినిమాతో ఫరావలేదు..విషయం వుంది అనిపించుకున్నాడు. ఇప్పుడు కంచే సినిమాతో తానేంటో ప్రూవ్ చేసుకొవాలని తహతహలాడుతున్నాడు. ఈ సందర్భంగా 'గ్రేట్ ఆంధ్ర'తో కొద్ది సేపు ప్రత్యేకంగా ముచ్చటించాడు..ఆ వివరాలు..

*రెండో సినిమాకే మీసం మెలేసి, మూడో సినిమాకే వీర లెవెల్లో ఫైట్లు చేస్తున్నారు కొత్త హీరోలు..మరి మీరేంటీ ఇలా..మరీ అమాయకంగా కనిపిస్తూ..
అవేమీ నాకు తెలీదండీ..మంచి నటుడ్ని అనిపించుకోవాలి ముందు. ఆ తరువాతే ఏవైనా..ఏదైనా.

*మీ నాన్నగారు కూడా మంచి నటుడు అనిపించుకున్నారు..కానీ హీరో కాలేకపోయారు. మరి మీరు ఆ దిశగా ముందు ఆలోచించాలి కదా?
నిజమే. నేను నాన్నగారి కలను పూర్తి చేస్తాను. అయితే అలా అని ఆరంభం నుంచే ఇలాంటి సినిమా చేయాలి..ఇలాంటి హీరోగా వుండాలి అని అనుకోవడం లేదు.

*ముకుంద..చేసాక మళ్లీ కంచె లాంటి సాఫ్ట్ సినిమా చేయడం?
నిజానికి పూరి గారి లోఫర్ సినిమా చేయాలి..కానీ కంచె ముందయింది..లోఫర్ వెనుక అయింది.

*కంచె కథ ఎవరు ఓకె చేసారు..మీరా..డాడీనా..పెదనాన్నా?
పెదనాన్నకు లైన్ చెప్పాను. భలేగా తయారు చేసాడ్రా..అన్నారు. నాన్న మొత్తం విని ఓకె చేసారు. 

*మీ ఫ్యామిలీ నుంచి నీహారిక హీరోయిన్ గా వస్తున్నారు..
అందరూ అదే అడుగుతున్నారండీ. కానీ నిజానికి ముందు చాలా మంది నన్ను భయపెట్టారు. నీ కెరీర్ పోతుంది చూసుకో అని. తన కెరీర్ కు నా కెరీర్ కు సంబంధం ఏమిటి? ఎవరు బాగా నటిస్తే, జనం వాళ్లను ఆదరిస్తారు.లేదంటే లేదు. అయితే మాకు అభిమానులే ముఖ్యం. వారే మా సినిమాల విజయం వెనుక కీలకంగా వుంటున్నారు. వారే మంటారన్నదే ముఖ్యం. కానీ ఒకటి మాత్రం నిజం నీహారికకు నాకంటే రెట్టింపు ప్రాణం సినిమాలు అంటే. 

ఆ విషయం ముందు పెద్దనాన్నకు చెప్పాం..అందరం కూర్చుని డిస్కస్ చేసాం. ముందు ఆయన ఒప్పుకోలేదు. కానీ తరువాత ఆమె ఇష్టం గమనించి, సరే, కానివ్వండి అన్నారు.

*ఎందుకు ఇంతగా...?
అంటే మెగా ఫ్యామిలీ అని ఓ ఇమేజ్ వుంది. ఆ ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి..ఎలాంటి పాత్రలు, ఎలాంటి సినిమాలు, ఇవన్నీ డిస్కషన్ కు వస్తాయి కదా..

*మీ కుటుంబంలో ఈ మధ్య బాండింగ్స్ కొంచెం తగ్గాయనీ..?
అదేం లేదండీ..కాస్త అందరం బిజీ అయ్యాం అంతే. మీరు నమ్మండి..నాన్న నేను మాట్లాడుకుని నాలుగు రోజులు అయ్యింది ఒకే ఇంట్లో వుంటూ.

*బ్రూస్లీ పై మీ బాబాయ్ పవన్ వెళ్లి అభినందించారు..మరి మీ డాడీ కనిపించలేదు?
నాన్న కూడా వెళ్తారేమో? బహుశా పవన్ బాబాయ్ వెళ్తున్నట్లు నాన్నకు తెలిసి వుండదు. 

*చరణ్ మీతో ఎలా వుంటాడు?
మంచి రాపో వుంది. ముకుంద డబ్బింగ్ చెబుతున్నపుడు, ఆ పక్కనే తను గోవిందుడు..డబ్బింగ్ చెబుతున్నాడు. చరణ్ కు మంచి వాయిస్ వుంది. డిక్షన్ వుంది. తను నా దగ్గరకు వచ్చి, నా వాయిస్ బాగుందని మెచ్చుకున్నాడు. కొన్ని చిన్న చిన్న ఎక్సర్ సైజ్ లు కూడా చెప్పాడు. 

*ముకుందలో మరీ ఒకటే ఎక్స్ ప్రెషన్ అయిపోయిందన్న చిన్న విమర్శ..?
నిజమే..నా దృష్టికి కూడా వచ్చింది. అయితే ఆ క్యారెక్టర్ అలాంటిది. షూటింగ్ టైమ్ లోనే అడిగాను దర్శకుడిని. క్యారెక్టర్ పరంగా చేయి..ఎలా వున్నా అన్నారు. అలాగే చేసాను. 

*ముకుంద చూసాక..మీలో మీకు వీక్ నెస్ అని అనిపించినది..సరి చేసుకోవాలనుకున్నది..?
డ్యాన్స్ లు, పాటలు అండీ. పాటల్లో నా ఫీలింగ్స్ సరిగ్గా లేవనిపించింది. తరువాత సరి చేసుకున్నాను. డ్యాన్స్ లపై నాకు కాస్త ఆసక్తి తక్కువ. నేర్చుకున్నా కానీ..ఏమిటో..? కానీ ఇప్పుడు డ్యాన్స్ లు కూడా చేయాలనుకుంటున్నా. అంటే మీరీ చరణ్, బన్నీ తారక్ ల లెవెల్లో కాదు అనుకోండి..

*యంగ్ హీరోలంటే కాస్త హుషారుగా..
నేనూ హుషారేనండీ బాబూ..పూరి గారు అదే అడిగారు. నువు ఇంత ఎనర్జీగా చేస్తున్నావు..నేను అలా అనుకోలేదు అని. ముకుంద క్యారెక్టర్ చూసి, కంచె సినిమా ప్రోమోలు చూసి అలా అనుకుంటున్నారేమో అంతా. లోఫర్ సినిమాతో డిఫరెంట్ గా కనిపిస్తాను. 

*కంచె సినిమా నుంచి ఏం ఆశిస్తున్నారు.
చెప్పాను కదండీ..ముందు మంచి నటుడు అనిపించుకోవాలి..అన్ని రకాల పాత్రలు చేయాలి. దాంతో పాటే హీరో అని కూడా అనుకోవాలి. అదే గోల్.

*మీ గోల్ రీచ్ అవుతారని ఆశిద్దాం.
తప్పకుండా..థాంక్యూ

విఎస్ఎన్ మూర్తి