Advertisement

Advertisement


Home > Politics - Analysis

రామోజీ క‌డుపు మంట‌

రామోజీ క‌డుపు మంట‌

చంద్ర‌బాబునాయుడి రాజ‌గురువు రామోజీరావు క‌డుపు మంట అంతాఇంతా కాదు. ఎన్నికల్లో కూట‌మికి ఏమ‌వుతుందో అనే భ‌యం ఆయ‌న్ని వెంటాడుతోంది. ఈ ఎన్నిక‌ల్లో కూట‌మి గెల‌వ‌డం చంద్ర‌బాబునాయుడి కంటే త‌న‌కే ఎక్కువ అవస‌ర‌మ‌ని ప్ర‌తి సంద‌ర్భంలోనూ నిరూపించుకునేలా ఆయ‌న మీడియా రాత‌లున్నాయి. తాజాగా మ‌రోసారి ఇటు రాష్ట్రంలో వైసీపీ, కేంద్రంలోని మోదీ స‌ర్కార్‌పై అక్క‌సు వెళ్ల‌గ‌క్కారు.

సుమారు 66 ల‌క్ష‌ల మందికి సామాజిక పింఛ‌న్లు ఇళ్ల వ‌ద్ద పంపిణీ చేయ‌వ‌ద్ద‌ని అడ్డుకున్న‌దెవ‌రో అంద‌రికీ తెలుసు. కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో వ‌లంటీర్లు ఇళ్ల వ‌ద్ద‌కెళ్లి పింఛ‌న్లు పంపిణీ చేస్తే, వైసీపీకి రాజ‌కీయంగా ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని చంద్ర‌బాబునాయుడు భ‌య‌ప‌డ్డారు. దీంతో త‌న అనుచ‌రుడైన నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ ద్వారా కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి వ‌లంటీర్ల‌పై ఫిర్యాదు చేయించి, చివ‌రికి అనుకున్న‌ట్టుగా సాధించారు.

ఏప్రిల్ నెల పింఛ‌న్లు ఇళ్ల వ‌ద్ద అంద‌క‌పోవ‌డంతో, స‌చివాల‌యాల‌కు వెళ్లి నానా ఇబ్బందులు ప‌డ్డారు. వ‌డ‌దెబ్బ‌తో సుమారు 33 మంది చ‌నిపోయారు. దీంతో పెన్ష‌న‌ర్లు చంద్ర‌బాబునాయుడిపై మండిప‌డుతున్నారు. రాజ‌కీయంగా న‌ష్ట‌పోయామ‌ని గ్ర‌హించి, క‌నీసం మే 1వ తేదీ అయినా ఇళ్ల వ‌ద్దే పింఛ‌న్లు పంపిణీ చేయాలంటూ కూట‌మి నేత‌లు కొత్త రాగం అందుకున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం తాజాగా ఉత్త‌ర్వులు వెలువ‌రించింది.

బ్యాంక్ ఖాతాలున్న వారికి నేరుగా జ‌మ చేస్తామ‌ని, లేని వారికి ఇళ్ల వ‌ద్ద‌కెళ్లి న‌గ‌దు అంద‌జేస్తామ‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. దీనిపై కూడా రామోజీరావు ప‌త్రిక తెగ బాధ‌ప‌డుతోంది. ఇందులో కూడా జ‌గ‌న్‌కు రాజ‌కీయ ప్ర‌యోజ‌నం క‌లిగించే ఎత్తుగ‌డ ఆయ‌న ప‌త్రిక‌కు క‌నిపించ‌డం గ‌మ‌నార్హం. బ్యాంకు ఖాతాలు యాక్టివేష‌న్‌లో ఉన్నాయో, లేదా అని అనుమానం వ్య‌క్తం చేస్తూ క‌థ‌నం రాసింది. అలాగే బ్యాంకుల‌కు వెళ్లి తెచ్చుకోవాలంటే ఎన్నో ఇబ్బందుల‌ని ఈనాడు వాపోయింది. ఈ ప్ర‌క్రియ అంతా కూట‌మిపై వ్య‌తిరేక‌త నింపుతుంద‌ని ఈనాడు భ‌య‌ప‌డ‌డాన్ని క‌థ‌నంలో చూడొచ్చు.

సామాజిక పింఛ‌న్లు ఎలా పంపిణీ చేయాలో రామోజీరావే మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేస్తే స‌రిపోయేద‌న్న సెటైర్స్ సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. వ‌లంటీర్ల‌తో అడ్డుకోడానికి ముందు, ప‌ర్య‌వ‌సానాల గురించి ఆలోచించ‌డం మానేసి, ఇప్పుడు గ‌గ్గోలు పెడితే లాభం ఏంట‌ని నెటిజ‌న్లు నిల‌దీస్తున్నారు.

ఇవాళ మ‌రో క‌డుపు మంట వార్తను ఈనాడు రాసింది. టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డి డిప్యుటేష‌న్‌ను పొడ‌గించ‌డంపై రామోజీరావు ప‌త్రిక క‌డుపు మంట‌తో ర‌గిలిపోతోంది. కూట‌మితో పాటు మీడియా ప‌రంగా తాను నిత్యం సీఎం జ‌వ‌హ‌ర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్ర‌నాథ్‌రెడ్డిని మారిస్తేనే, ఎన్నిక‌లు పార‌ద‌ర్శ‌కంగా జ‌రుగుతాయ‌ని నెత్తీనోరూ కొట్టుకుని ఫిర్యాదులు చేస్తూ, క‌థ‌నాలు రాస్తున్నా ఎన్నిక‌ల సంఘం ప‌ట్టించుకోలేద‌ని వాపోయింది.

కానీ తిరుమ‌ల‌లో భ‌క్తుల‌కు వేస‌విలో ప్ర‌త్యేకంగా ద‌ర్శ‌నాలు, సౌక‌ర్యాల క‌ల్ప‌న‌కు ఈవో ధ‌ర్మారెడ్డి డిప్యుటేష‌న్‌ను పొడిగించాల‌ని సీఎం జ‌గ‌న్ లేఖ రాయ‌గానే, కేంద్ర ర‌క్ష‌ణశాఖ సానుకూల నిర్ణ‌యం ఎలా తీసుకుంటుంద‌ని రామోజీ ప‌త్రిక నిల‌దీస్తూ క‌థ‌నం రాయ‌డం గ‌మ‌నార్హం. ధర్మారెడ్డి ర‌క్ష‌ణ‌శాఖ‌లో ఉన్న‌తోద్యోగి. జూన్ 30న ఆయ‌న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. అయితే ఆయ‌న డిప్యుటేష‌న్ మే 14తో పూర్తి కానుంది.

ఈ నేప‌థ్యంలో డిప్యుటేష‌న్ పొడిగించాల‌ని సీఎం లేఖ రాయ‌డ‌మే ఎల్లో మీడియా దృష్టిలో త‌ప్పు అయ్యింది. ఈవోగా ధ‌ర్మారెడ్డి కొన‌సాగితే, ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌కు లాభ‌మ‌ని అక్క‌సు వెళ్ల‌గ‌క్క‌డం గ‌మ‌నార్హం. అందుకే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ధ‌ర్మారెడ్డిని తిరుమ‌ల నుంచి సాగ‌నంపాల్సిందే అని ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు పురందేశ్వ‌రి, టీడీపీ, జ‌న‌సేన నేత‌లు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ‌ల‌పై లేఖ‌లు రాశారు.

ఈ ప‌రిస్థితుల్లో కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ ధ‌ర్మారెడ్డికి సంబంధించి డిప్యుటేష‌న్ పొడిగింపు ఉత్త‌ర్వులు ఇవ్వ‌డంతో కూట‌మికి గ‌ట్టి షాక్ త‌గిలిన‌ట్టైంది. సీఎస్‌, డీజీపీల‌ను మార్చాల‌ని తాము కోరితే, ప‌ట్టించుకోలేద‌ని, కానీ సీఎం లేఖ రాస్తే మాత్రం వెంట‌నే పాజిటివ్‌గా స్పందించ‌డం ఏంటంటూ నిల‌దీస్తూ ఈనాడు క‌థ‌నం వండివార్చింది. ధ‌ర్మారెడ్డి ఈవోగా కొన‌సాగితే ఏమ‌వుతుందో రామోజీ ప‌త్రిక క‌థ‌నం నుంచి తెలుసుకుందాం.

"జ‌గ‌న్‌కు ధ‌ర్మారెడ్డి న‌మ్మిన బంటు. ఆయ‌న ఢిల్లీ స్థాయిలో త‌న‌కున్న ప‌రిచ‌యాల‌తో ప‌నులు చేసి పెడ‌తారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం వంటి సంస్థ‌ల్లోనూ ప‌లుకుబ‌డి ఉప‌యోగిస్తారు. అతి సున్నిత‌మైన వ్య‌వ‌హారాల్ని కూడా సీఎం కోసం సునాయాసంగా చ‌క్క‌బెడ‌తార‌ని పేరు వుంది"

ధ‌ర్మారెడ్డి అంటే భ‌య‌ప‌డ‌డానికి కార‌ణం ఇద‌న్న మాట‌. ఇవ‌న్నీ ఊహాజ‌నితం అయిన‌ప్ప‌టికీ, జ‌గ‌న్ అనుకూల‌మైన ఉద్యోగుల‌ను ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉండ‌నివ్వ‌కూడ‌ద‌ని కూట‌మి, ఎల్లో మీడియా పంతం. తాము కోరుకున్న‌ట్టు నిర్ణ‌యాలు జ‌ర‌గ‌క‌పోతే, వారిపై మీడియాను అడ్డుపెట్టుకుని ఇష్టంవ‌చ్చిన‌ట్టు క‌థ‌నాలు రాయ‌డం. ఇది నిత్య‌కృత్యం అయ్యింది. అయిన‌ప్ప‌టికీ కూట‌మి, ఎల్లో మీడియా ప‌ప్పులు ఉడ‌క‌డం లేదు. కొంత మంది ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల బ‌దిలీల‌తో వారు సంతృప్తి చెంద‌డం లేదు. ప్ర‌ధానంగా ప్ర‌భుత్వానికి బాస్‌లు అయిన సీఎస్‌, డీజీపీల విష‌యంలో ఎంత ప‌ట్టు ప‌ట్టినా... మార్చేందుకు ఈసీ అంగీక‌రించ‌క‌పోవ‌డం వారికి జీర్ణం కాని విష‌యం. అందుకే ఈ క‌డుపు మంట రాత‌లు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?