పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇప్పుడు రావణకాష్టం లాగా రగులుతున్నది. ఆ ప్రాంతం పట్ల పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరుతో స్థానికులు రగిలిపోతున్నారు. తాము స్వతంత్ర దేశంగా ఆవిర్భవించేందుకు భారత్ సహాయం చేయాలని, ఆ మేరకు తమ వ్యవహారాలలో జోక్యం చేసుకోవాలని పిఓకే స్థానికులు కోరుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో భారత హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కీలకంగా కనిపిస్తున్నాయి. పిఓకే అనేది భారత్ లో ఎప్పటికీ ఒక భాగమేనని.. దానిని ఎప్పటికైనా మేం తీసుకుంటామని షా వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఆజాదీ నినాదాలతో, నిరసనలతో ప్రతిధ్వనిస్తోంది. గతంలో కాశ్మీరులో కూడా ఆజాదీ నినాదాలు వినిపించేవని, ఆ ప్రాంతాన్ని ఇప్పుడు పూర్తిగా భారత్లో అంతర్భాగం చేశామని.. అదేవిధంగా పాత్ ఆక్రమిత కాశ్మీరును కూడా భారత్య లో భాగంగా మారుస్తామని అమిత్ షా అంటున్నారు.
అయితే విశ్లేషకులు చెబుతున్న దాన్నిబట్టి.. పిఓకే విషయంలో జోక్యం చేసుకోవడం- భారత్ చాలా నష్టదాయకంగా మారుతుంది అని తెలుస్తోంది. భారత్ ఎదుట రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి అక్కడ జరుగుతున్న పోరాటాలకు మద్దతు ఇచ్చి, పాకిస్తాన్ నుంచి పిఓకే ప్రత్యేక దేశంగా ఏర్పడడానికి సహకరించడం. అలా చేసినట్లయితే అంతర్జాతీయంగా భారత్ పాత్ర పై విమర్శలు వెల్లువెత్తుతాయి. భారత్ అంతర్గత వేర్పాటు వాద ఉద్యమాలలో ఇతర దేశాలు జోక్యం చేసుకుంటే సహించగలరా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అంతర్జాతీయ వేదిక మీద తమ చర్యను సమర్ధించుకోవడం భారత్ కు కష్టం అవుతుంది.
పిఓకే మీద దాడి చేసి ఆ భాగాన్ని భారత్ లో అంతర్భాగంగా కలిపేసుకోవడం మన దేశం ఎదుట ఉన్న రెండో ఆప్షన్. కేంద్ర హోం మంత్రి షా ఇప్పుడు దాని గురించే మాట్లాడుతున్నారు. ఆ పని చేస్తాం అంటున్నారు. అదే జరిగితే కనుక భారత్ కొరివితో తలగోక్కున్నట్లే అవుతుంది. మన దేశానికి అది ఆత్మహత్య సదృశం అవుతుంది.
ఎందుకంటే పిఓకే ప్రాంత ప్రజలు కోరుకుంటున్నది స్వతంత్రంగా జీవించాలని.. అంతేతప్ప భారత్ లో కలిసిపోవాలని కాదు. ఆ భాగాన్ని మనదేశంలో కలిపేసుకుంటే అక్కడి వారి ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు అవుతుంది. ఆటోమేటిగ్గా వారందరినీ మన దేశ ప్రభుత్వం పట్ల ధికార స్వరం వినిపించే తీవ్రవాదులుగా తయారు చేసినట్లు అవుతుంది.
370 అధికరణాన్ని రద్దు చేసిన తర్వాత కాశ్మీర్ తీవ్రవాదాన్ని పూర్తిస్థాయిలో సర్దుబాటు చేయలేక సతమతం అవుతున్న ప్రభుత్వం మనది. తరచుగా జవాన్లు బలి అవుతూనే ఉన్నారు. అలాంటి నేపథ్యంలో ఎలాంటి ఉపయోగం లేని కారణం కోసం కొత్తగా ఒక ఉగ్రవాదం ముప్పును పిఓకే రూపంలో కొని తెచ్చుకోవడం మన దేశంలో కలుపుకోవడం అవసరమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
పక్కలో బల్లెం లాగా పిఓకే మారడం సంగతి తర్వాత.. మనమే పక్కలోకి ఉగ్రవాదాన్ని తెచ్చి పెట్టుకున్నట్టుగా పరిస్థితి తయారవుతుందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.