గోబెల్స్ సిద్ధాంతాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మినటువంటి వర్తమాన రాజకీయ నాయకుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే.. ఎవరికైనా సరే టక్కున చంద్రబాబు నాయుడు పేరు గుర్తుకొస్తుంది. ఒక అబద్ధాన్ని వ్యూహాత్మకంగా ప్రచారంలోకి తేవడం. అదే అబద్ధాన్ని పదేపదే పది సార్లు చెప్పడం. పది మందితో అదే అబద్ధాన్ని పదేసి సార్లు చెప్పించడం. ఆ అబద్ధాన్ని ప్రజలు పూర్తిగా నమ్మేవరకు చైన్ రియాక్షన్ తరహాలో తమ పార్టీవారు, తమతొత్తులైన మేధావులు అందరితోనూ అదే అబద్ధాన్ని మాట్లాడిస్తూ ఉండడం.. చంద్రబాబు నాయుడు కు మాత్రమే చేతనైన గోబెల్స్ విద్య.
ఇన్నాళ్లు పోలీసుల అండతతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెలరేగుతున్నదని, పోలీసుల అండతో అరాచకాలు చేస్తున్నారని నానా కారుకూతలు కూస్తూ వచ్చారు. ఆ పర్వం అయిపోయింది. పోలింగ్ కూడా ముగిసిపోయింది. తెలుగుదేశం దళాలన్నీ ఇప్పుడు స్ట్రాంగ్ రూముల మీద పడ్డాయి. ఓడిపోతామనే భయం లో వెర్రెత్తినట్లుగా ప్రవర్తిస్తున్న పచ్చదళాలు.. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి మీద దాడులకు పాల్పడుతున్నాయి. మిగిలిన నాయకులు అందరూ స్ట్రాంగ్ రూముల్లో భద్రత గురించి మాట్లాడుతూ కొత్త పుకార్లను వ్యాప్తిలోకి తెస్తున్నారు
నాగార్జున యూనివర్సిటీ లోని స్ట్రాంగ్ రూమ్ వద్ద పోలీసులు సీఎం భద్రత సిబ్బంది కలిసి భేటీ అయ్యారని తెలుగుదేశం పొన్నూరు అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర చెబుతున్నారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూము వద్ద పోలీసులు భేటీ కావడం చట్టవిరుద్ధమని ఆయన ఆరోపణ.
కేవలం ఇలాగే చెబితే అందులో మజా ఏముంటుంది. చంద్రబాబు నాయుడు దీనికి కొద్దిగా మసాలా జోడించారు. సీఎం సెక్యూరిటీ సిబ్బంది, స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత నిమిత్తమున్న పోలీసులతో భేటీ అయ్యారని అక్కడ వారితో పార్టీ చేసుకున్నారని వారు స్ట్రాంగ్ రూములను మాయ చేసే ప్రమాదమున్నదని రకరకాల కొత్త ఆరోపణలను జోడించారు.
కేవలం ఓటమి భయంతోనే తెలుగుదేశం నాయకులు ఇలాంటి అసంబద్ధ అబద్ధపు ఆరోపణలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఫలితాలు వెలువడి ఓటమి ఖరారు అయ్యే రోజు వరకు కూడా.. ప్రభుత్వాన్ని నిందలపాలు చేయడానికి ఇలా ఏదో ఒకటి అంటూనే ఉంటారని కూడా ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.