ఇలాంటి నిర్ణయాలే కొంప ముంచుతాయేమో..!

కరోనా టైమ్ లో థియేటర్లు మూతపడ్డాయి. ఓటీటీ విజృంభించింది. కరోనా తర్వాత తమిళనాట ఏర్పడిన ఓ సంక్షోభం కారణంగా సింగిల్ స్క్రీన్స్ మూతపడ్డాయి. ఫలితంగా చెన్నైతో పాటు చాలా ప్రాంతాల్లో మల్టీప్లెక్సుల ప్రాభవం పెరిగింది.…

కరోనా టైమ్ లో థియేటర్లు మూతపడ్డాయి. ఓటీటీ విజృంభించింది. కరోనా తర్వాత తమిళనాట ఏర్పడిన ఓ సంక్షోభం కారణంగా సింగిల్ స్క్రీన్స్ మూతపడ్డాయి. ఫలితంగా చెన్నైతో పాటు చాలా ప్రాంతాల్లో మల్టీప్లెక్సుల ప్రాభవం పెరిగింది. ఇక్కడ కూడా ఓటీటీ రంగం ఇంకాస్త బలపడింది. ఇక కేరళలో ఈమధ్య థియేటర్ యాజమాన్యాలకు, నిర్మాతలకు ఓసారి గొడవ జరిగింది. అంతకంటే ముందు థియేటర్ యాజమాన్యాలకు, సర్వీస్ ప్రొవైడర్లకు కూడా గొడవ జరిగింది. దీని వల్ల కేరళలో కొన్ని స్క్రీన్స్ ఎఫెక్ట్ అయ్యాయి.

ఇప్పుడివన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. ఇష్యూ ఏదైనా దాని పర్యవసానం సినిమాపై పడుతుంది. సగటు ప్రేక్షకుడు థియేటర్లకు దూరమైపోతున్నాడు. నైజాంలో తీసుకున్న తాజా నిర్ణయం కూడా ఈ కోవలోకే వస్తుంది.

ఎన్నికల సీజన్ కావడం, ఎండలు మండిపోవడం, మరోవైపు పెద్ద సినిమాలు లేకపోవడం తదితర కారణాల వల్ల నైజాంలో సింగిల్ స్క్రీన్స్ ను కొన్ని రోజుల పాటు (దాదాపు 2 వారాలు) బంద్ చేయాలని నిర్ణయించారు. ఆర్థిక నష్టాల నుంచి తప్పించుకునేందుకు థియేటర్ యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఈ చర్య వల్ల ప్రేక్షకుడు, సింగిల్ స్క్రీన్స్ కు మరింత దూరమయ్యే ప్రమాదం ఉంది.

సీత కష్టాలు.. పీత కష్టాలు…

ఏదో సామెత చెప్పినట్టు ఎవరి కష్టాలు వాళ్లకున్నాయి. సామాన్య ప్రేక్షకుడు దూరమైపోతాడని, కోరి నష్టాలు తెచ్చుకోలేమంటున్నారు థియేటర్ యజమానులు. ఏదైనా ఓ సినిమా రిలీజైతే, అన్ని థియేటర్లకు అది అందుబాటులో ఉండదు కాబట్టి దాదాపు 30శాతం థియేటర్లు ఖాళీగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ పాటికి థియేటర్లలోకి రావాల్సిన కల్కి, లవ్ మి, ఇండియన్-2 లాంటి సినిమాలు పలు కారణాల వల్ల పోస్ట్ పోన్ అవ్వడంతో థియేటర్లు ఖాళీ అయ్యాయని, దీంతో తప్పనిసరి పరిస్థితుల మధ్య మూసేయాల్సి వచ్చిందని అంటున్నారు.

వీళ్ల నిర్ణయంతో ఉన్నఫలంగా నష్టపోయేది చిన్న నిర్మాతలే. పెద్ద సినిమాల్లేకపోవడంతో, ప్రతి వారం 3-4 చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆక్యుపెన్సీ సంగతి పక్కనపెడితే.. ఓవరాల్ గా చూసుకుంటే ఇండస్ట్రీని అంతోఇంతో ముందుకు తీసుకెళ్తున్న సినిమాలివే. ఇప్పుడు థియేటర్లు క్లోజ్ అయితే, చిన్న సినిమాలు కూడా విడుదల కావు. నైజాంలో సింగిల్ స్క్రీన్స్ లేవని చిన్న సినిమాలు వాయిదా పడితే, ఆ ప్రభావం ఏపీలో థియేటర్లపై కూడా పడుంది. అవి కూడా మూతపడే ప్రమాదం ఉంది. ఇదంతా స్లంప్ కు దారితీసే ప్రమాదం ఉంది.

పెద్ద హీరోలు ముందుకు రావాలి…

మినిమం గ్యాప్ లో పెద్ద సినిమాలు థియేటర్లలోకి వస్తే తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు ఎగ్జిబిటర్లు. జనాలు థియేటర్లకు వచ్చే సినిమాలు రావాలని, అలా జరగాలంటే పెద్ద హీరోలు ఏడాదికి కనీసం 2 సినిమాలు రిలీజ్ చేయాలని అంటున్నారు. కానీ టాలీవుడ్ లో పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. 

పెద్ద హీరోలెవ్వరూ స్పీడ్ గా సినిమాలు చేయడం లేదు. ఏడాదికి 2 కాదు, కనీసం ఒక్క సినిమా కూడా రిలీజ్ చేసే పరిస్థితిలో లేరు కొంతమంది హీరోలు. ప్రభాస్ లాంటి హీరోలు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నప్పటికీ, అతడు చేస్తున్నంత వేగంగా సినిమాలు మార్కెట్లోకి రావడం లేదు. సింగిల్ స్క్రీన్స్ బతకాలన్నా, టాలీవుడ్ కు కళ రావాలన్నా అర్జెంట్ గా పెద్ద హీరోలు జోరు పెంచాలి.

టికెట్ రేట్లపై పునరాలోచన అత్యవసరం..

ఇదే సమయంలో టికెట్ రేట్లపై కూడా పునరాలోచించాల్సిన టైమ్ వచ్చింది. ఎంత పెద్ద సినిమా వచ్చినా, సినిమా చూడాలనే ఆశ మనసులో ఉన్నప్పటికీ మధ్యతరగతి ప్రేక్షకుడు కుటుంబంతో కలిసి థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు. టికెట్ రేట్లు, స్నాక్స్ రేట్లతో కలిసి తడిసిమోపెడవుతోంది. ఫుట్ ఫాల్ పెరగాలన్నా, థియేట్రికల్ వ్యవస్థ గాడిన పడాలన్నా, టికెట్ రేట్లపై పునరాలోచించాలి. పెద్ద-చిన్న అనే తేడా లేకుండా ఒకప్పట్లా అన్ని సినిమాలకు ఫ్లాట్ రేట్లు అమలుచేయాలి. అప్పుడే ప్రేక్షకుడు సినిమా హాల్ లో అడుగుపెట్టగలడు. కొంతమంది పెద్ద నిర్మాతల అత్యాశ వల్ల టికెట్ రేట్లు సామాన్య ప్రేక్షకుడికి అందుబాటులో లేకుండా పోయాయి.

నిర్మాతలు చేయందించాల్సిందే…

మరోవైపు నిర్మాతలు కూడా థియేటర్ల యాజమాన్యాలకు చేయందించాల్సిన తరుణం ఇది. ఎగ్జిబిటర్ వ్యవస్థ అంటేనే ఛీటింగ్ అనే ఆలోచనతో ఉన్నారు కొంతమంది నిర్మాతలు. దీంతో ఎవరికివారు సొంత మనుషుల్ని, సొంత వ్యవస్థల్ని ఏర్పాటుచేసుకున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఒకప్పట్లా ఓపెన్ సిస్టమ్ ఉండాలి. పనిలోపనిగా సింగిల్ స్క్రీన్స్ అద్దెలు పెంచాలి.

ఇలా అందరూ కలిసి కూర్చొని సమిష్ఠిగా నిర్ణయాలు తీసుకుంటే మినిమం గ్యాప్ లో మంచి సినిమాలు రిలీజ్ అవుతాయి. అర్థాంతరంగా థియేటర్లు మూసేయాల్సిన పరిస్థితి రాదు. ఇండస్ట్రీ కళకళలాడుతుంది. మళ్లీ ఆ రోజులు రావాలని కోరుకుందాం..