తెరపై కామెడీ చేసే నటులు, తెరవెనక కూడా అంతే ఫన్నీగా ఉంటారని కొంతమంది అనుకుంటారు. కానీ బ్రహ్మానందం లాంటి వాళ్లను చూస్తే అది తప్పని అర్థమౌతుంది. ఈ లిస్ట్ లో హాస్య నటి కోవై సరళ కూడా ఉన్నారు.
ఆమెలో అంతులేని ఫిలాసఫీ ఉంది. ఆమె లైఫ్ స్టయిల్ చూస్తే ముచ్చటేస్తుంది. కొన్ని అంశాలపై ఆమె అభిప్రాయాలు ఆలోచింపజేస్తాయి.
కోవై సరళ పెళ్లి చేసుకోలేదు. జీవితానికి తోడు ఎందుకని ప్రశ్నిస్తున్నారీమె. పుట్టేటప్పుడు మనం ఎవరిమో మనకే తెలియదని, చనిపోయేటప్పుడు కూడా అలానే ఉండాలని, ఈ మధ్యలో తోచినంత సహాయం చేయాలని అంటారీమె. మనసు నిర్మలంగా ఉన్నప్పుడు జీవితానికి తోడు అవసరం లేదంటారు.
సినిమా వాళ్లంతా బాగా డబ్బులు సంపాదించి ఆస్తులు కూడబెడుతుంటే, కోవై సరళ మాత్రం కోయంబత్తూరులోని తన సొంతింట్లో ఉంటారు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసి, ఎంతో పేరు తెచ్చుకున్న ఈ సీనియర్ నటికి హైదరాబాద్ లో ఇల్లు లేదు. ఇదే విషయంపై ప్రశ్నిస్తే, తనకు ‘ఒక ఇల్లు చాలు’ అనేది ఆమె సమాధానం.
కోవై సరళపై ఎంతోమంది ఎన్నో కామెంట్స్ చేశారు. కొన్ని పత్రికలు, సైట్స్ లో ఆమెపై అసత్య ప్రచారం జరిగింది. అయినప్పటికీ ఆమె ఎప్పుడూ కోపం తెచ్చుకోలేదు. తనపై రాసే పుకారు వల్ల వాళ్లకు డబ్బులొచ్చి, జీవితంలో సంతోషంగా ఉన్నారనే ఆలోచన విధానం ఆమెది. భూమ్మీద మనుషులు చేసే ప్రతి పనిని పైనుంచి భగవంతుడు చూస్తాడని అంటారీమె.
తనకు ఎంతో ఇష్టమైన తండ్రి చనిపోయినప్పుడు, కోవై సరళ ఉన్నఫలంగా షూటింగ్ కు వెళ్లారు. దీనికి సంబంధించి అప్పట్లో ఆమెపై చాలా కామెంట్స్ పడ్డాయి. సొంత బంధువులు కూడా ఆమెను నిందించారు. అయితే తనకు ఎలాంటి బాధ లేదన్నారు కోవై సరళ. ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ, మన వల్ల ఎదుటి వ్యక్తి ఇబ్బంది పడకూడదని, మన కోసం ఎవ్వరూ వెయిట్ చేయకూడదని తన తండ్రి పదేపదే చెప్పే వారని, ఆయన మాటను నెరవేర్చేందుకు తండ్రి చనిపోయినా షూటింగ్ కు వెళ్లానని అన్నారు.
ఆ రోజు షూటింగ్ లో చాలా పెద్ద కాంబినేషన్ సీన్ ఉంది. హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అంతా సిద్ధంగా ఉన్నారు. అసలే చిన్న ప్రొడక్షన్ కంపెనీ. తన వల్ల ఎవ్వరూ నష్టపోకూడదనే తండ్రి మాటల్ని గౌరవిస్తూ ఆరోజు షూటింగ్ చేశారు కోవై సరళ. ఓవైపు కామెడీ సీన్. తండ్రిపోయిన బాధను గుండెల్లో దాచుకొని, కెమెరా ముందు కామెడీ చేశారు. కట్ చెప్పగానే, సెట్స్ వెనక్కు వెళ్లి వెక్కివెక్కి ఏడ్చారు.
ఇలా ఒకే సందర్భంలో ఏడుపు-నవ్వు కలిపి వచ్చాయని.. అలాంటి దారుణ పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని ఆమె అన్నారు. తను లెక్కలేనంత ఛారిటీ చేస్తానని, దాని గురించి ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు కోవై సరళ.