ముంబయిలోని అటల్ సేతుపై రష్మిక స్పందించింది. 2 గంటల ప్రయాణాన్ని 20 నిమిషాల్లో పూర్తి చేయగలిగే ఈ వంతెన నిజంగా అద్భుతమని కొనియాడింది. అక్కడితో ఆగలేదు, దేశంలో మౌలిక సదుపాయాలు, రహదారి ప్రణాళిక అద్భుతంగా ఉన్నాయి. అంటూ పోస్ట్ పెట్టింది.
రష్మిక ఏ పోస్ట్ పెట్టినా ఆమెతో ఏకీభవించేవాళ్లే ఎక్కువమంది. కానీ ఈసారి మాత్రం రష్మిక అభిప్రాయాన్ని చాలామంది వ్యతిరేకించారు. అంతేకాదు, రష్మిక స్టేట్ మెంట్స్ పై ఏకంగా ట్రోలింగ్ మొదలుపెట్టేశారు.
మరో కంగనా రనౌత్ లా మారాలనుకుంటున్నావా అంటూ ఓ నెటిజన్ నేరుగా రష్మికను ప్రశ్నించగా.. ఒక వంతెనను చూపించి భారతదేశం వేగంగా ముందుకు కదులుతోందని చెప్పడం అవివేకం అన్నారు మరొకరు.
సాధారణ భారతీయుడు తన రోజువారీ జీవితం ఎలా గడుపుతున్నాడో తెలుసుకోవాంటే అటల్ సేతుపై కాకుండా, ముంబయి లోకల్ ట్రయిన్ లో ప్రయాణించాలని రష్మికకు ఓ నెటిజన్ సూచించాడు. మరో వ్యక్తి స్పందిస్తూ.. మౌలిక సదుపాయాల గురించి తెలియాలంటే రష్మిక కారు దిగాలన్నాడు.
ఇలా రష్మిక స్టేట్ మెంట్ పై ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడిచింది. డీప్ ఫేక్ వీడియో విషయంలో రష్మిక ఎంత మద్దతు కూడగట్టుకుందో, తాజా పోస్ట్ విషయంలో అంతే వ్యతిరేకత మూటగట్టుకుంది.