2.0 సినిమాకు సంబంధించి టీజర్ ఎప్పుడో రెడీ అయింది. కానీ లీక్ అవ్వడంతో మళ్లీ రిపేర్లు చేసి ఫ్రెష్ గా కట్ చేశారు. గ్రాఫిక్స్ కూడా లేట్ అవ్వడంతో టీజర్ రిలీజ్ అనుకున్న టైమ్ కు సాధ్యంకాలేదు. ఎట్టకేలకు 2.0 టీజర్ రిలీజ్ డేట్ లాక్ అయింది. అక్షయ్ కుమార్ సినిమాతో ఈ సినిమా టీజర్ ను మార్కెట్లోకి తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు.
2.0 సినిమాలో అక్షయ్ కుమార్ విలన్ గా నటించాడు. ఇప్పుడిదే హీరో గోల్డ్ అనే మరో మూవీ రెడీ చేశాడు. ఆగస్ట్ 15న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాతో 2.0 టీజర్ ను రిలీజ్ చేయాలని తాజాగా నిర్ణయించారు. ఈ మేరకు సంప్రదింపులు మొదలయ్యాయి.
2.0 సినిమాను నవంబర్ లో విడుదల చేయబోతున్నట్టు స్వయంగా దర్శకుడు శంకర్ ప్రకటించాడు. ఈ సినిమా ప్రచారాన్ని ఆగస్ట్ 15 నుంచి పునఃప్రారంభించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా అక్షయ్ కుమార్ సినిమాతో టీజర్ ను రిలీజ్ చేయాలనేది ప్లాన్.
మరోవైపు తెలుగులో ఈ సినిమా రిలీజ్ పై ఇంకా స్పష్టతరాలేదు. సినిమా తెలుగు హక్కులకు సంబంధించి ఏషియన్ ఫిలిమ్స్ కు చెందిన సునీల్ నారంగ్… ఇప్పటికే అడ్వాన్స్ ఇచ్చారు. కానీ ఆ అడ్వాన్స్ ను వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉన్నారట నారంగ్. అదే కనుక జరిగితే తెలుగు రైట్స్ మరోసారి ఓపెన్ అవుతాయి.
తెలుగులో ఈ సినిమాను 90కోట్ల రూపాయలకు అటుఇటుగా అమ్మాలని నిర్ణయించింది లైకా ప్రొడక్షన్స్ సంస్థ. నారంగ్ తప్పుకుంటే ఠాగూర్ మధు, దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమా రైట్స్ తీసుకునే అవకాశం ఉంది.