4న రాజమండ్రిలో ‘మెగా’ జనసమీకరణ?

4న రాజమండ్రిలో ఏం జరగబోతోంది? సినిమాలకు సంబంధించినంత వరకు ఇంటిలిజెంట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగబోతోంది. కానీ అది కాదు, తెరవెనుక ఇంకేదో వ్యూహాలు రచిస్తున్నారు. ఇంకేదో ప్లాన్ చేస్తున్నారు. ఇదీ విశ్వసీనీయ వర్గాల…

4న రాజమండ్రిలో ఏం జరగబోతోంది? సినిమాలకు సంబంధించినంత వరకు ఇంటిలిజెంట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగబోతోంది. కానీ అది కాదు, తెరవెనుక ఇంకేదో వ్యూహాలు రచిస్తున్నారు. ఇంకేదో ప్లాన్ చేస్తున్నారు. ఇదీ విశ్వసీనీయ వర్గాల బోగట్టా. 

రాజమండ్రి సమీపంలోని చాగల్లు అనేది దర్శకుడు వివి వినాయక్ స్వంత ఊరు. ఆ అభిమానంతో రాజమండ్రిలో ఇంటిలిజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసారు. ఇదీ అందరూ అనుకున్నది. కానీ ఈ ఈవెంట్ వెనుక కాపు కుల సమీకరణ ప్రయత్నం ఏదో జరుగుతోందని కోస్తా జిల్లాల నుంచి వార్తలు అందుతున్నాయి.

విశాఖ, గాజువాక నుంచి రాజమండ్రి మధ్యలో వున్న చాలా ఊళ్లలో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ పేరిట ఫ్లెక్సీలు వెలిసాయి. ఆ ఫ్లెక్సీల్లో 'ఛలో రాజమండ్రి' అనే స్లోగన్ ప్రముఖంగా కనిపిస్తోంది. మెగా ఫ్యాన్స్ లీడర్ స్వామినాయుడు ఆదేశాలతో రాజమండ్రిలో ఆ రోజు మెగాభిమానుల చర్చావేదిక జరగబోతోందని ఆ ఫ్లెక్సీల్లో పెర్కొన్నారు. ఫ్లెక్సీలపై మెగా హీరోల అందరి చిత్రాలు వున్నాయి.

కేవలం ఫ్లెక్సీల ఆధారంగా ఏదో జరుగుతోందని అనుకోవడం కాదు. అసలు రాజమండ్రిలో ఈ ఫంక్షన్ చేయడం వెనుక దర్శకుడు వివి వినాయక్ రాజకీయ ఆకాంక్షలు దాగి వున్నట్లు వినికిడి. వివి వినాయక్ రాజకీయాల్లోకి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఆయన టీడీపీలో చేరతారని, కాదు వైకాపా అని గతంలో వార్తలు వినిపించాయి.

వైకాపాలోకి రమ్మని, వస్తే రాజమండ్రి ఎంపీ టికెట్ ఇస్తామని ఎప్పుడో ఆఫర్ ఇచ్చారు. తెలుగుదేశంలోకి రమ్మని, వస్తే, మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇస్తామని ఎప్పడో కౌంటర్ ఆఫర్ వచ్చింది. అయితే వినాయక్ మదిలో కనీసం మరో రెండు మూడు సినిమాలు చేయాలని వున్నట్లు బోగట్టా. ఆ మేరకు ఆయన తీసుకున్న అడ్వాన్స్ లు, కమిట్ మెంట్లు వున్నాయి. అందువల్ల ఈసారి వదిలేసి, 2024లో వెళ్దామన్న ఆలోచన వున్నట్లు వినాయక్ సన్నిహిత వర్గాల బోగట్టా.

కానీ మరి అలాంటపుడు ఈ రాజమండ్రి సభ హడావుడి ఏమిటి? కేవలం ఇంటిలిజెంట్ కు బజ్ తీసుకురావడం కోసమేనా? కేవలం బజ్ కోసమే అయితే ఈ మెగా చర్చావేదిక ఫ్లెక్సీలు ఏమిటి? పైగా రాజమండ్రి సభకు మెగాస్టార్ చిరంజీవిని తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అది ఇవ్వాళ ఫైనల్ అవుతుంది.

రాజమండ్రి సభకు చిరంజీవి, నాగబాబు, సాయి ధరమ్ తేజ, వినాయక్ లాంటి కాపు సెలబ్రిటీలు హాజరు కావడం, మెగాభిమానులు ఇలా చర్చా వేదిక అంటూ ఫ్లెక్సీలు కట్టడం, వివి వినాయక్ కు రాజమండ్రి ఎంపీ సీటు మీద ఆసక్తి వుండడం, ఇవన్నీ కలిసి ఇంటిలిజెంట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ పై ఆసక్తి పెంచుతున్నాయి.

రాజమండ్రి ఎంపీ సీటు కమ్మ సామాజిక వర్గం చేతిలో వుంది. అందువల్ల తెలుగుదేశం పార్టీ ఆ టికెట్ ను వినాయక్ పార్టీలో చేరినా ఇవ్వదు. అందుకే మచిలీఫట్నం ఆఫర్ చేసారు. అలాంటపుడు వినాయక్ కు జనసేన లేదా వైకాపానే ఆప్షన్ గా వుంటాయి. అందువల్ల భవిష్యత్ వ్యూహం ఎలా వున్నా, ముందుగా కాస్త బల ప్రదర్శనగా ఇంటిలిజెంట్ సభను మార్చే ప్రణాళిక ఏదో జరుగుతోందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.