పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ, కలర్ ఫుల్ సినిమాలు అందించే డైరక్టర్లు చిన్న సినిమా చేస్తారు అంటే కాస్త ఆసక్తిగానే వుంటుంది. రాజమౌళి మర్యాదరామన్న, సుకుమార్ అందించిన కుమారి 21ఎఫ్ ఇలాంటివే. కానీ ఇలాంటి దానికి చాలా ఏళ్ల క్రితమే శ్రీకారం చుట్టారు దర్శకుడు కే రాఘవేంద్రరావు.
ఆయన పెద్ద పెద్ద హీరోలతో ఫుల్ బిజీగా సినిమాలు తీసున్న రోజుల్లోనే చిన్న చిన్న విలన్ వేషాలు వేస్తున్న శ్రీకాంత్ ను తీసుకువచ్చి పెళ్లిసందడి సినిమా చేసారు. పైగా దానికి బడా ప్రొడ్యూసర్లు అల్లు అరవింద్, అశ్వనీదత్ లాంటి వాళ్లు భాగం పంచుకున్నారు.
ఇన్నాళ్ల తరువాత మళ్లీ రాఘవేంద్రరావు అలాంటి ప్రాజెక్టు ఒకటి ట్రయ్ చేసే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. మంచి చిన్న సబ్జెక్ట్ దొరికితే తమ స్వంత బ్యానర్ పై కలర్ ఫుల్ చిన్న సినిమాగా అందించాలని ఆయన ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. చాలా కాలంగా భక్తి సినిమాల మార్గం పట్టారు రాఘవేంద్రరావు.
ఈ జనరేషన్ ప్రేక్షకుల కోసం పెద్ద హీరోలతో కమర్షియల్ సినిమా చేసే సాహసం ఆయన చేయడం అంత సరి కాదు. అందుకే ఓ డిఫరెంట్ సబ్జక్ట్ కోసం చూస్తున్నారట. దొరకగానే చిన్న సినిమా ఆయన డైరక్షన్ లోనే స్టార్ట్ చేసేస్తారు.
రాఘవేంద్రరావు హోమ్ బ్యానర్ లాంటి ఆర్కా మూవీస్ కూడా మంచి మీడియం సినిమాలు నిర్మించే ఆలోచనలో వుంది. ఎటొచ్చీ హీరోలు, సబ్జెక్ట్ లు కొరతగా వున్నాయి. రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ ఓ హర్రర్ జోనర్ మూవీని శర్వానంద్ తో ప్లాన్ చేసారు. కానీ ఇటీవలే ఆ ప్రాజెక్టు డ్రాప్ అయింది.