మనమంతా లాంటి ‘మంచి’ డిజాస్టర్ ను ఇచ్చారు దర్శకుడు యేలేటి చంద్రశేఖర్. దానితోపాటే మంచి సినిమా అని ప్రశంసలు దక్కాయి. నిర్మాతకు 15కోట్ల నష్టం మిగిలింది. అంతకు ముందు గోపిచంద్ తో సాహసం సినిమా చేసినపుడు కూడా ఆ నిర్మాతకూ నష్టాలే మిగిలాయి. మరికాస్త వెనక్కు వెళ్తే ప్రయాణం సినిమా కూడా కాస్ట్ ఫెయిల్యూరే.
ఇలాంటి ట్రాక్ రికార్డుతో అప్పటి నుంచి మళ్లీ సినిమా చేతిలోకి రాలేదు. అయితే యేలేటికి వున్న సర్కిల్ పుణ్యమా అని మళ్లీ సినిమా పక్కా అని గుసగుసలు మాత్రం వినిపించాయి. ఆ టైమ్ లో ఏకంగా ఏన్టీఆర్ పేరే వినిపించింది. రాజమౌళి సిఫార్సుతో ఎన్టీఆర్ ఓ కథ విన్నాడని, బాగుందని చెప్పాడని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ లైనప్ లో యేలేటి లేరు.
ఆ తరువాత మైత్రీ వాళ్లు యేలేటితో సినిమా చేయాలనుకున్నారు. సాయిధరమ్ తో చేయమని అడిగారని, కానీ తాను అఖిల్ తో చేస్తానని యేలేటి అడుగుతున్నారని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఏమయింది సాయిధరమ్ కోసం కిషోర్ తిరుమల లైన్లోకి వచ్చారు. అఖిల్ యేమో వెంకీ అట్లూరిని ఛూజ్ చేసుకుంటున్నాడు. అంటే ఇప్పుడు యేలేటికి అటు తేజు లేడు ఇటు అఖిల్ లేడన్నమాట.
ఇంక మరి చేయడానికి హీరోలు ఎవరున్నారు? చక్కగా మళ్లీ గతంలో మాదిరిగా చిన్న సినిమా చేయడం బెటర్ యేమో? అలా అయితే నిర్మాతలు కోట్లకు కోట్లకు బలి కారు. పైగా యేలేటికి పనికి వచ్చినవి, కలిసి వచ్చినవి ఐతే, అనుకోకుండా ఒకరోజు లాంటి చిన్న సినిమాలే కదా?