హారిక హసిని సంస్థలో నితిన్ సినిమా మళ్లీ వుంటుందని ఆ మధ్య వార్తలు వినవచ్చాయి. ఛలో సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన డైరక్టర్ వెంకీ కుడుముల తన మలి సినిమాను హారిక హాసిని, సోదర సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో చేయబోతున్నారు. మరోపక్క ఇంకా కథ రెడీ కాలేదు, కథ ఎవరికి నప్పితే వారు అని వెంకీ అభిప్రాయపడుతున్నట్లు కూడా వార్తలు వినిపించాయి.
అయితే వెంకీ కుడుముల ఇప్పుడు తను తయారుచేసిన కథను హీరో నిఖిల్ తో పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిఖిల్ కు లైన్ చెప్పిన వెంకీ, త్వరలో కథ కూడా నెరేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. నిఖిల్ కూడా సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో సినిమా చేయడానికి రెడీనే. అంటే టోటల్ వ్యవహారం చూసుకుంటే, వెంకీ కుడుముల ప్రాజెక్టు ఇప్పుడు నితిన్ తో కాకుండా నిఖిల్ తో సెట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
బహుశా సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈ సినిమాను కాస్త తక్కువబడ్జెట్ లో ఫినిష్ చేసే ఆలోచనలో వున్నట్లు కనిపిస్తోంది. నిఖిల్ హీరోగా అయితే సినిమా ఆరేడు కోట్లలో ఫినిష్ చేసేయవచ్చు. పది కోట్లకు పైగా మార్కెట్ వుంటుంది. అదే నితిన్ తో అయితే మళ్లీ బడ్జెట్ లెక్కలు తేడా వస్తాయి. బహుశా అందుకే వెంకీ కుడుముల-నిఖిల్ ప్రాజెక్టు ఫిక్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.