ఆ ఇద్దరికి రాజమౌళి సినిమా చేస్తారా?

బాహుబలి దర్శకుడు రాజమౌళి తరువాతి సినిమా ఏమిటి అన్న పాయింట్ కాస్త ఆసక్తికరమే. తరువాతి సినిమా ఏమిటి అనే దాని కన్నా, తరువాతి సినిమా నిర్మాత ఎవరు అన్నది ఇంకా ఆసక్తి కరమే. ఎందుకంటే…

బాహుబలి దర్శకుడు రాజమౌళి తరువాతి సినిమా ఏమిటి అన్న పాయింట్ కాస్త ఆసక్తికరమే. తరువాతి సినిమా ఏమిటి అనే దాని కన్నా, తరువాతి సినిమా నిర్మాత ఎవరు అన్నది ఇంకా ఆసక్తి కరమే. ఎందుకంటే రాజమౌళితో సినిమా తీస్తే అన్ని విధాలా సెటిల్ అయిపోవడమే కదా? దర్శకుడు రాఘవేంద్రరావు తన స్వంత బ్యానర్ పై బోలెడు సినిమాలు చేసారు. డబ్బులు చేసుకున్నది లేదు. అలాంటిది మేనల్లుడు, సోదరుడి అల్లుడితో కలిసి వేరే బ్యానర్ పెట్టారు. అక్కడా ముందు పెద్దగా డబ్బులు చేసుకోలేదు. కానీ అదే బాహుబలి విషయానికి వస్తే, అందరూ తలా వంద కోట్లు లాభం కళ్ల చూసారన్నది ఇండస్ట్రీ టాక్.

మరి అలాంటపుడు తరువాత సినిమా నిర్మాత అయ్యే అదృష్టం ఎవరిది అన్నది ఇంట్రెస్ట్ నే కదా? రాజమౌళి దగ్గర పూర్వాశ్రమంలో ఎప్పుడో తీసుకున్న రెండు అడ్వాన్స్ లు వున్నాయి. ఒకటి డివివి దానయ్య, రెండు కేఎల్ నారాయణ ఇచ్చినవి. మరి వాళ్లకు సినిమాలు చేస్తారా? లేదా ఏదో విధంగా సెటిల్ మెంట్ చేసుకుంటారా? అన్నది తెలియాల్సి వుంది. మీడియం రేంజ్ సినిమా ఒకటి ఆ ఇద్దరికి కలిపి చేసేసి, చేతులు దులుపుకుంటారని ఓ గ్యాసిప్ వుంది.మరోపక్క ఈగ 2 బౌండ్ స్క్రిప్ట్ రెడీగా వుందని, దాన్ని తన సన్నిహితుడు, ఈగ ప్రొడ్యూసర్ సాయి కొర్రపాటికే చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే ఓ హాలీవుఢ్ కంపెనీ అన్ని లాంగ్వేజ్ ల్లో కలిపి ఓ భారీ ప్రాజెక్టును తమ కోసం చేసే కాంట్రాక్టును రాజమౌళితో త్వరలో కుదుర్చుకోబోతోందని టాక్ వినిపిస్తోంది. ఈ ఒప్పందం కొద్ది రోజుల్లో కుదిరే అవకాశం వుందటున్నారు. అదే జరిగితే ఇక తెలుగు నిర్మాతలకు రాజమౌళి అందుబాటులో వుండరన్నమాటే.