కొత్త సినిమా అందునా పెద్ద సినిమా వచ్చిందంటే, కొన్ని ప్రభుత్వ శాఖలకు టికెట్ లు ఫ్రీగా ఇవ్వాల్సిందే. కనీసం ఫ్రీ గా కాకపోయినా, బల్క్ గా పెద్ద మొత్తంలో టికెట్ లు కొనుక్కోవడానికైనా ఆఫర్ చేయాల్సిందే. లేకపోతే బండి నడవదు. థియేటర్ వాళ్లకు ట్రాఫిక్ పోలీసులతో, మున్సిపాలిటీ వాళ్లతో అవసరం. నిర్మాతలకు బయ్యర్లకు ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ తో అవసరం. అందుకే పెద్ద సినిమాలకు అమ్మే టికెట్ ల కన్నా ఇలా పక్కదారిలో వెళ్లిపోయే టికెట్ లు ఎక్కువ వుంటాయి.
రెగ్యులర్ గా వచ్చే భారీ సినిమాలకే ఇలాంటి పరిస్థితి వుంటే, బాహుబలి లాంటి పెద్ద సినిమాకు, భయంకరమైన క్రేజ్ వచ్చిన సినిమాకు ఎలా వుంటుంది పరిస్థితి. ఆ మధ్య బాహుబలి ఆఫీసులపై, అలాగే మరి కొన్ని సినిమా ఆఫీసులపై ఆదాయపన్నుశాఖ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఆ తరువాత మరేమయిందో అన్నది తెలియదు. అందువల్ల ఇక ఆ శాఖతో ఎవరయినా జాగ్రత్తగా వుండాల్సిందే కదా.
అందుకే ఈసారి బాహుబలి 2 సినిమాకు సంబంధించి ఆదాయపన్నుశాఖకే అచ్చంగా 1500 టికెట్ లు వెళ్లాయని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరి ద్వారా వెళ్లాయి? ఎవరికి వెళ్లాయి? ఎలా వెళ్లాయి? అన్నది తెలియదు కానీ, మొత్తం మీద మొహమాటం టికెట్ లు సింహభాగంగా 1500 టికెట్ లు ఆ శాఖ జనాలకే అందాయని టాక్ వినిపిస్తోంది.
ఇక ఈసారి టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల నుంచి కూడా టికెట్ ల కోసం భారీగా వత్తిడి ఎదురైందట. నైజాం డిస్ట్రిబ్యూటర్ అయిన ఆసియన్ సంస్థ తొలిరోజు టికెట్ ల్లో మూడు వంతులు తెప్పించి దగ్గర పెట్టుకుని, ఇండస్ట్రీ జనాలకు, మొహమాటాలకు, ప్రభుత్వ శాఖలకు పంపిణీ చేయడమే పనిగా పెట్టుకోవాల్సి వచ్చిందట.