నంది అవార్డులు, వాటి వెనుక వైనాలు, ఆ సంగతులు అలా వుంచితే, అవార్డుల ప్రదానోత్సవం తలుచుకుంటేనే అబ్బో.. అద్భుతం కదా అనిపిస్తుంది. చిరంజీవి, బాలయ్య, మహేష్ బాబు, ఎన్టీఆర్, ఒకే వేదిక మీద అంటే.. మరేంటింక సూపర్. త్రివిక్రమ్, రాజమౌళి, కొరటాల, బోయపాటి కూడా అక్కడే అంటే ఇక సూపరో సూపరు.
అన్నింటికి మించి, మామయ్య, బాబాయ్ లతో జూనియర్ ఒకే ఫ్రేమ్ లోకి వస్తాడు అన్నది తలుచుకుంటేనే నందమూరి అభిమానులకు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి ఇప్పటికే. అన్నట్లు అదే టైమ్ లో అక్కడ మన యువ రాజకీయ కిశోరం లోకేష్ బాబు కూడా వుంటారుగా.
చిరకాలంగా తెలుగుదేశం పార్టీతో ఎన్టీఆర్ లేరు. అదే విధంగా లోకేష్ తో ఎన్టీఆర్ సంబంధాలు ఏనాడో దెబ్బతిన్నాయని వినిపిస్తుంటుంది. బాలయ్య-ఎన్టీఆర్ మధ్య సంబందాలు దాదాపు లేనట్లే అనుకోవాలి. కానీ చంద్రబాబు అలా కాదు. ఆయన కార్యసాధకుడు.
అవసరం అయితే ఎన్టీఆర్ ను తన చంకన ఎత్తుకోవానికి ఆయనకు ఏ అభ్యంతరం వుండదు. ఇప్పుడు ఎన్టీఆర్ చరిష్మా గుర్తించినట్లే వుంది. అందుకే మళ్లీ దగ్గరకు తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని వినికిడి.
ఇలాంటి టైమ్ లో ఒకే వేదిక మీదకు చంద్రబాబు, బాలయ్య, ఎన్టీఆర్, లోకేష్ వస్తే, కొడుకు అవార్డు అందుకోవడం చూడ్డానికి హరికృష్ణ వచ్చి జాయిన్ అయితే, ఆ సీనే, సీను కదా?