మామూలే.. తమ సినిమా ప్రమోషన్ కోసం ఏ రోటి కాడికి వచ్చినప్పుడు ఆ పాట పాడటం.. సినిమా వాళ్లకు బాగా అలవాటే! ఇప్పటి వరకూ ఆ తమిళోళ్ల నుంచి ఇలాంటి మాటలు విన్నాం, ఇప్పుడు హిందీ వాళ్లు వచ్చి కూడా అవే మాటలు చెబుతున్నారు!
తమ డబ్బింగ్ సినిమాలను తెలుగునాట ప్రమోట్ చేసుకోవడానికి.. తమిళ హీరోలు చెప్పే మాట, ‘ త్వరలోనే ఒక డైరెక్ట్ తెలుగు సినిమాలో నటిస్తాం..’ అనేది! ఆ అరవోళ్లు డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించకపోతే వచ్చే నష్టం టాలీవుడ్ కు కానీ, తెలుగు ప్రజానీకానికి గానీ ఏమీ లేదు. కానీ.. అలా మాట్లాడితే తెలుగు వాళ్లకు దగ్గరైపోవచ్చనేది వాళ్ల ఎత్తుగడ.
ఆ మాటలు పరమ రొటీన్ అయిపోగా, ఇప్పుడు ఆమిర్ ఖాన్ వచ్చి కూడా అదే పాటే పాడాడు. తన తాజా సినిమా ‘దంగల్’ తెలుగు లోకి డబ్ అయిన నేపథ్యంలో ఈయన మాట్లాడుతూ.. తెలుగు సినిమా చేయడానికి తను చాలా ఆసక్తితో ఉన్నాను అని చెప్పుకున్నాడు.
అది కూడా.. చిరంజీవితో కానీ, పవన్ కల్యాణ్ తో కానీ.. మల్టీస్టారర్ లో నటిస్తానని చెప్పుకొచ్చాడు. చిరంజీవి అంటే.. చాలా ఇష్టం అని అన్నాడు. చిరంజీవితో కుదరకపోతే.. పవన్ కల్యాణ్ తో మల్టీస్టారర్ చేస్తానని ఆమిర్ అన్నాడు. మొత్తానికి.. ఆమిర్ కూడా లౌక్యం తెలిసిన హీరోనే!
చిరంజీవి, పవన్ కల్యాణ్.. డైరెక్టు తెలుగు సినిమా అంటూ, తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు ఎంచక్కా. ఆమిర్ మాటలు.. మెగా ఫ్యాన్స్ కళ్లల్లో ఆనంద భాష్పాలను జనింపజేయవచ్చునేమో! ఈ మాత్రం సెంటిమెంట్ చాలేమో ఈ హీరో తాజా సినిమా తెలుగునాట అంతో ఇంతో రాబట్టుకోవడానికి.