“నేను రాజకీయాలకు దూరం. దయచేసి నా కెరీర్ ను రాజకీయాలతో ముడిపెట్టకండి. నాకు పాలిటిక్స్ అంటే అస్సలు ఇష్టం లేదు.” హీరో అజిత్ ఎప్పుడూ చెప్పే మాటలివి. కానీ ఈసారి మాత్రం అజిత్ మాటల్ని కోలీవుడ్ మీడియా అస్సలు పట్టించుకోవడం లేదు. అతడు ఎవరికి మద్దతిస్తాడంటూ వరుసగా కథనాలు అందిస్తోంది.
తమిళ రాజకీయాల్లో ఇటు కమల్ హాసన్ ఉన్నారు. అటు రజనీకాంత్ ఉన్నారు. ఇద్దరివీ రెండు పార్టీలు. ప్రస్తుతానికైతే ఇద్దరూ కలిసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో అజిత్ ఎవరికి మద్దతిస్తాడనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. రజనీకాంత్ కు మద్దతిస్తే కమల్ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. కమల్ కు మద్దతిస్తే తళైవ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. అది అజిత్ కెరీర్ కే ప్రమాదం. పోనీ ఇద్దరికీ దూరంగా ఉందామంటే ఆ పరిస్థితి లేదిప్పుడు.
ఇప్పటికే లారెన్స్, విశాల్, సంతానం, మీనా లాంటి తారలు ఓపెన్ గా రజనీకి మద్దతిచ్చారు. నమిత, ఒవియా, అమలాపాల్ లాంటి తారలైతే రజనీ తరఫున ప్రచారం చేస్తామని కూడా ప్రకటించారు. రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత తమిళ చిత్రసీమలో నంబర్-3గా కొనసాగుతున్న అజిత్ ఈసారి మాత్రం దీనిపై స్పందించక తప్పదు. అటు మరో స్టార్ హీరో విజయ్ త్వరలోనే తన నిర్ణయం ప్రకటిస్తానని చెప్పడం విశేషం.