మొదటి సినిమా తీవ్రంగా నిరాశ పరచడంతో అక్కినేని అఖిల్ ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయాడు. తన రెండవ సినిమా విషయంలో మొదట్లో తెగ తొందర పడిన అక్కినేని ప్రిన్స్ ఆ తర్వాత స్లో అయిపోయాడు. సినిమా చేసే విషయంలో తొందరపాటు ధోరణి ఎంత ప్రమాదకరమనేది అఖిల్ మొదటి సినిమాతోనే తెలుసుకున్నాడు. తన కెరీర్‌ని మలచుకునే బాధ్యతలు ముందుగా అఖిల్‌కే ఇచ్చేసిన నాగార్జున సైతం అది సబబు కాదని తెలిసాక తనే రంగంలోకి దిగాడు.
అఖిల్ రెండవ సినిమా కోసం చాలా మంది దర్శకుల వద్ద కథలు విన్నారు. అన్నపూర్ణ కాంపౌండ్‌లోనే పలువురు రైటర్లు కథ మీద కసరత్తు చేసారు. హను రాఘవపూడితో సినిమా కమిట్ అయి కూడా చివర్లో డ్రాప్ అయి 'మనం' దర్శకుడి మీద బాధ్యతలు మోపారు. విక్రమ్ కుమార్ ఆషామాషీ దర్శకుడు కాదు. తన కథలు, ఆలోచనలు చాలా భిన్నంగా వుంటాయి.
అతనితో సినిమా అనేసరికి క్లాస్‌గానో, ఎక్స్‌పెరిమెంటల్‌గానో వుంటుందని భావించారు. కానీ హలో టీజర్ చూస్తే ఇది పక్కా యాక్షన్ సినిమా అని తేలింది. హాలీవుడ్ స్థాయిలో ఛేజింగులు గట్రా చూసి ఫాన్స్ గంతులేస్తున్నారు.
ఇంతకాలం హలో మీద వున్న హైప్ చాలా సాధారణ స్థాయిలో వుంది కానీ ఇప్పుడు ఒకేసారి అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నాగార్జునతో సహా అందరూ హలోతో అఖిల్ స్టార్ అయిపోయినట్టే ధీమా వ్యక్తం చేస్తున్నారంటేనే సినిమా బ్రహ్మాండంగా వచ్చిందనే సంగతి అర్థమవుతోంది.