వినోదాల ఆలీ వివాదాల ఆలీగా మారారా? తెరమీద నవ్వులు పండించే ఆలీ…తెరవెనుక నవ్వులపాలవుతున్నారా? 'నబూతో నభవిష్యత్' సిద్ధాంతాన్నే ఆలీ నమ్ముకున్నారా? ఇన్నేళ్లుగా ఆలీ ధోరణిపై కనిపించని, వినిపించని నిరసనలు ఇటీవలకాలంలోనే ఎందుకు పెచ్చరిల్లుతున్నాయి? ఓ సెలబ్రెటీని విమర్శిస్తే నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతులొస్తాయంటూ తనపై వచ్చిన విమర్శలకి ఆలీ స్పందిస్తున్నారు. ఆ స్పందన సరైనదేనా? ఆలీ కీర్తిప్రతిష్టల్లో భాగం పంచుకునేందుకే ఈ 'అసహన గళాలు' సవరించుకుంటున్నాయా? ఇటీవల ఆలీ చుట్టూ కమ్ముకున్న వివాదాల్లో ఇన్ని ప్రశ్నలు.
ఆలీ దృష్టికోణంలోంచి ఆలోచిస్తే…పబ్లిక్‌ప్లేసుల్లో, ఆడియోఫంక్షన్లలో వ్యాఖ్యల్ని ఎవరూ ఏ అభ్యంతరం చెప్పకుండా 'టేకిట్ గ్రాంటెడ్'గా మౌనం దాలిస్తే 'అంతా ఓకే!'. సదరు ప్రసంగాన్ని ఎవరైనా అబ్జెక్ట్ చేస్తే… ఇన్నేళ్లూ ఆలీ సంపాదించుకున్న పేరు ప్రతిష్టలూ తమపై కూడా కాస్తోకూస్తో ప్రభావం చూపి సమాజంలో ఓ 'ఐడింటిటీ'తో ఉనికిని చాటుతాయనేే భావనతోనే ప్రవర్తించడమన్నమాట. ఇంతకీ…కమెడియన్ ఆలీని వివాదాలు ఎందుకు చుట్టుముడుతున్నాయి? అందులో ఆలీ ప్రమేయం అస్సలు లేదా? ఆడియో ఫంక్షన్లలో అమాయకంగా ఆయన మాట్లాడిన మాటల్ని ఆసరా చేసుకుని 'ఐడింటిటీ' కోసం, పబ్లిసిటీ కోసమే ఇలా ఒకరిద్దరు గొంతు సవరించుకుంటున్నారా? కావాలనే ఆయనపై బురద చల్లుతున్నారా?
కమెడియన్‌గా సమాజంలో పేరు..కళాకారుడిగా ఏదేశమేగినా అవధులు దాటి అక్కున చేర్చుకునే ఆదరాభిమానాలు…ఇవన్నీ ఇండస్ట్రీలో ఉన్నందుకుగాను ప్రేక్షకులు ఇచ్చినవే. ఇప్పుడూ ఆ ప్రేక్షకుల్లోని వాళ్లే కొందరు ఆలీ ప్రస్తుత వైఖరిని ఖండిస్తున్నారు. సరికాదంటూ సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సలహాలు, సూచనలు, అభ్యంతరాలు, విమర్శలు పట్టించుకుని ధోరణి మార్చుకోవడం పోయి మాట్లాడినదంతా సబబు, సముచితం…'ధిక్కారం సైతునా?' అనే స్థాయిలో సెలబ్రెటీ వ్యవహరించడం ఎంతవరకు న్యాయం? అలా చెప్పేవాళ్లంతా పబ్లిసిటీ కోసమో, ఐడింటిటీ కోసమో అంటే ఎలా? ఒకవేళ ఆ కోణం అంతర్లీనంగా దాగున్నప్పటికీ…ఆ చెప్పేదాంట్లో నిజముందో లేదో ఒక్కసారి పరిశీలించుకోవాలి కదా!
నిన్న సమంత…నేడు అనుష్క.
విజయవాడలో జరిగిన ఓ ఆడియో ఫంక్షన్‌లో సమంత బొడ్డు 'బెంజిసర్కిల్లా' ఉందన్న ఆలీ… 'సైజ్‌జీరో' ఆడియో ఫంక్షన్‌లో అనుష్క తొడల గురించి వ్యాఖ్యానించారు. అంతేకాదు…అసలువాళ్లకి లేని దుగ్ధ, బాధ ఈ 'కొసరు'వాళ్లకెందుకంటూ అభ్యంతరాలు చెప్తున్నవాళ్లపై ఎదురుదాడికి దిగుతున్నారు. అంటే…తానెవర్నయితే టార్గెట్ చేసి ఆ తరహా వ్యాఖ్యలు చేసానో..వాళ్లే ఈ విషయంలో రాద్ధాంతం చేయడం లేదని ఆలీ సమర్ధన. అలాంటి వాదనతో…ఆలీ వ్యాఖ్యల అర్ధం మారిపోతుందా? అనేది వెంటాడే మరో ప్రశ్న. ఒకే ఇండస్ట్రీలో కొన్నేళ్లుగా మనుగడ సాగిస్తున్న క్రమంలో కొన్ని మొహమాటాలు, గట్టిగా నిలదీయలేని పరిస్థితుల నేపధ్యంలో అసలువాళ్లు మౌనాన్ని ఆశ్రయించి ఉండొచ్చు. లేదా, లేనిపోని వివాదాల్లో తలదూర్చడమెందుకనే ఉద్ధేశం కూడా కావొచ్చు. అంతమాత్రాన…ఆలీ వ్యాఖ్యలు సమంజసమైపోతాయా? సందర్భాన్ని బట్టే ఆ వ్యాఖ్యలు చేసానంటూ మరో వాదన. సందర్భం అవకాశమిచ్చిందంటూ… ప్రత్యక్షంగా, టీవీ ముందు కూచుని 'లైవ్‌టెలికాస్ట్'ని పరోక్షంగా ఆయా ఫంక్షన్లను వీక్షిస్తున్న లక్షలాది మంది ప్రేక్షకులసాక్షిగా ఆ తరహా వ్యాఖ్యలు ఏ రీతిలో సమర్ధనీయం?
మనస్సులో ఏ దురుద్ధేశం లేదని…కేవలం నవ్వించడం కోసమే ఆ వ్యాఖ్యలు చేసానంటూ ఆలీ సమర్ధింపు. నిజమే! ఆయన అన్నట్లుగానే ఆయన మనస్సులో ఏ దురుద్ధేశం లేకపోవచ్చు…కానీ, ఆ తరహా వ్యాఖ్యలు ఆ సమయంలో వినేవాళ్ల దృష్టిని ఎటువైపు మళ్లిస్తాయో? అంత పెద్ద కమెడియన్‌కి ప్రత్యేకించి చెప్పనవసరం లేదేమో? ప్రేక్షకుల్ని ఆకర్షించాలనే ఒకానొక ఎత్తుగడతో చవకబారు వ్యాఖ్యలు చేయడం సముచితమా? అన్న సిద్ధాంతాన్ని ఒంటపట్టించుకున్న కొంతమంది సినీజీవుల కారణంగా…తెరమీద నవ్వుల్లో 'ద్వందార్ధాలు' పోయి, 'ఏకార్ధాలే' ఏలుబడిలోకి వచ్చేసాయి. 'అశ్లీలతే' హాస్యమనిపించేరీతిలో కొన్ని చిత్రరాజాలు కూడా వచ్చిపోతున్నాయి. అదంతా…కేవలం థియేటర్లలోనే అని సరిపుచ్చుకుంటున్నా…'బూతు' కూడా జోకేననిపించేరీతిలో పబ్లిక్‌ప్లేసుల్లో, ఆడియోఫంక్షన్లలో కూడా కమెడియన్లు చలామణి చేస్తున్నారా? ఏదో..జూనియర్లు తెలిసో తెలీకో వేదిక ఎక్కి అలాంటిమాటల్తో ఆడియన్స్ అటెన్షన్‌ని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారనుకుంటే కాస్తో కూస్తో మినహాయింపు ఉంటుంది. కానీ, ఆలీలాంటి సీనియర్ మోస్ట్ కమెడియన్ కూడా అదే పంథాను ఎన్నుకుని నవ్వులపాలవుతుంటే ఎలా? అసలు…ఈ కమెడియన్‌కి ఏమైంది? అనే ప్రశ్న సోకాల్డ్ ఆడియో ఫంక్షన్లను చూస్తున్న చాలామంది ప్రేక్షకులకి వస్తోంది. అయితే, కమ్యూనికేట్ చేసే మార్గం తోచక, తెలీక, మిన్నకుండిపోతున్నారు.
ఆడియో ఫంక్షన్లలో అస్సలు మాట్లాడను
వెల్లువెత్తుతున్న విమర్శల నేపధ్యంలో ఇకపై ఆడియో ఫంక్షన్లలో అస్సలు మాట్లాడనంటూ అలీ ప్రతిజ్ఞ. మాట్లాడితే అలాగే మాట్లాడుతా! లేకుంటే…అస్సలు మాట్లాడనంటూ ప్రకటన. ఈ రెండింటికీ మధ్యేమార్గం లేదా? ఆడియో వేడుకల్లో మాట్లాడిన ప్రతిఒక్కరిపై ఇలాంటి అభ్యంతరాలు లేవే? ఒక్కతనపైనే ఎందుకు వస్తున్నాయని తరచి చూసి…వైఖరి మార్చుకుని ఎవరి మనోభావాలు నొప్పించకుండా మాట్లాడితే ఎవరికి ఏ అభ్యంతరం ఉంటుంది? అసలు ఆలీయే కాదు…ఎవరైనా ఇలాగే మాట్లాడాలనే మార్గదర్శకాలు ఏవీ ఉండవు. వేదిక, సమయం, సందర్భాన్ని బట్టీ…అనువుగా నాలుగు మంచిమాటలు చెప్తే సరిపోతుంది. అంతదానికి…ఏదో మాట్లాడి ఎవరేదో అన్నారని, ఇకపై ఎవరేదైనా అంటే చూస్తూ ఊరుకోనంటూ హెచ్చరించడం ఆలీలాంటి సీనియర్‌మోస్ట్ కమెడియన్‌కి సరికాదు. ఎవరో అనడం కాదు…ఆ ఆడియో ఫంక్షన్‌లో ఆ తరహా వ్యాఖ్యలు సముచితమేనా? అని ఒక్కసారి అంతర్మథనం చేసుకుంటే నిజం నిగ్గుతేలుతుంది. సరైనదేనంటూ సమర్ధించుకుంటున్నా…తనకుతాను అనుకూలవాదన నిర్మించుకోవడమే అవుతుందేమో…ఇంకొక్కసారి ఆలోచిస్తే మంచిది.
-పి.వి.డి.ఎస్.ప్రకాష్