బాహుబలి హవా పీక్స్ లో ఉన్న రోజులవి. మరోవైపు వెయ్యికోట్ల రూపాయలతో మహాభారతం రాబోతోందంటూ ప్రచారం జరుగుతున్న సమయం. అలాంటి టైమ్ లో రేసులోకి అల్లు అరవింద్ కూడా చేరారు. మహాభారతాన్ని మించిన బడ్జెట్ తో రామాయణం తీస్తానని ప్రకటించారు.
అందరూ సంబరాలు చేసుకున్నారు. రాముడు, లక్ష్మణుడు, సీత పాత్రల్లో మెగా హీరోల్ని ఊహించుకున్నారు. కొందరైతే రాముడి పాత్రలో రామ్ చరణ్ ను ఊహించుకొని ఫ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా తయారుచేసి వదిలారు. మరి అంతలా ఊపేసిన ఆ ప్రాజెక్టు ఇప్పుడు ఏమైంది..? దాని గురించి మేకర్స్ ఎందుకు మాట్లాడ్డం లేదు.?
భారతీయ సినీచరిత్రలోనే భారీ బడ్జెట్ తో రామాయణం రాబోతోందని ప్రకటించిన అల్లు అరవింద్.. మధు మంతెన, నమిత మల్హోత్రాతో కలిసి ఈ వెండితెర అద్భుతాన్ని సృష్టిస్తామని ఘనంగా ప్రకటించారు. నటీనటుల ఎంపిక జరుగుతోందని, అక్టోబర్ లేదా నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లిపోతామని కూడా ప్రెస్ నోట్ లో చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఆ ఊసే మరిచారు.
వెయ్యికోట్ల రూపాయలతో మహాభారతం వస్తుందంటూ ఘనంగా ప్రచారం జరుగుతున్న టైమ్ లో మీడియాను తమవైపు తిప్పుకునేందుకే మెగా ప్రొడ్యూసర్ ఈ ప్రకటన చేశారా..? అదే నిజం. అందుకే అప్పట్లో ఈ ప్రకటన చేశారు తప్ప నిజంగా సినిమా చేయాలనే ఉద్దేశమైతే నిర్మాతల్లో కనిపించడం లేదు. ప్రకటనదేముంది చేసేద్దాం.. అడిగినప్పుడు ప్రాసెస్ లో ఉందని చెప్పేద్దామనే ధీమాతో అప్పట్లో ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఉంటారు.
వాళ్లు చెప్పిన ప్రకారమే చూసుకుంటే ఈపాటికి రామాయణం సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభం అవ్వాలి. అలా ప్రారంభించాలంటే దర్శకుడు ఉండాలి కదా. కనీసం ఇప్పటివరకు దర్శకుడ్ని కూడా ఫైనలైజ్ చేయలేదంటే ఈ ప్రాజెక్టుపై మేకర్స్ కు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమౌతోంది.
చిరంజీవి-పవన్ ను పెట్టి ఓ మెగా మల్టీస్టారర్ తీస్తానని అప్పట్లో సుబ్బరామిరెడ్డి ఘనంగా ప్రకటించారు. తర్వాత మళ్లీ చప్పుడు చేయలేదు. మెగా రామాయణం కూడా అలాంటి ప్రాజెక్టు అనుకోవాలేమో.