అల్లు అరవింద్ భలేగా మాట్లాడతారు. వాస్తవానికి ఆయన మెగా క్యాంప్ కే పెద్దాయిన. అయినా కూడా ఆయన హద్దుల్లో ఆయన వుంటూ, చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వుంటారు. అలాంటిది ఇటీవల తేజ్ ఐ లవ్యూ ఫంక్షన్ లో మాట్లాడుతూ, మెగా హీరోలు చాలా మందిని తాను వాడు, వీడు అనవడం అలవాటు, కానీ ఇటీవల అలా అనొద్దని కొందరు అంటున్నారని చెప్పుకొచ్చారు.
నిజానికి అరవింద్ ఎలా పిలిచినా తప్పులేదు. ఎందుకంటే మెగాస్టార్ ను, నాగబాబును పక్కన పెడితే, మిగిలిన హీరోలంతా ఆయన కళ్లముందు పుట్టి పెరిగిన వారే. అందువల్ల ఒరే అన్నా, ఏరా అన్నా తప్పులేదు. కానీ అలా బహరంగ వేదికల మీద అనొద్దని అరవింద్ కు సూచించినది ఎవరో అన్నది ఒక ప్రశ్న.
కానీ ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, బన్నీ రెండు మూడు సినిమాలు చేసి, హీరో అనిపించుకున్న తరువాత అల్లు అరవింద్ నే బన్నీతో కలిసి తిరిగే బ్యాచ్ కుర్రాళ్లని, ముఖ్యంగా గీతాతో అసోసియేట్ అయ వుండేవారిని, వన్ ఫైన్ మార్నింగ్ పిలిచి, బన్నీని, బన్నీ అని పేరు పెట్టి పిలవకండి, బాబూ అని పిలవండి అని ప్రత్యేకంగా చెప్పారట. ఇది చాలాకాలం కిందటి సంగతి.
అరవింద్ తన కొడుకు బన్నీ విషయంలో ఆ మాత్రం జాగ్రత్త తీసుకున్నపుడు, మిగిలిన వారు కూడా అదేబాటలో వెళ్లడం ఆశ్చర్యం కాదేమో ?