ఆలు లేదు చూలూ లేదు రాముడు రామ్ చరణ్

నూటికి తొంభై మంది పనిచేసేది కంప్యూటర్ల మీదే. పనిలో పనిగా కెలికేది నెట్ నే. పైగా ప్రతి వోడీకి ఫోటొషాప్ నో మరో అప్లికేషన్ నో బాగానే వంటపడుతూంది. అందుకే నెట్ అంతా రకరకాల…

నూటికి తొంభై మంది పనిచేసేది కంప్యూటర్ల మీదే. పనిలో పనిగా కెలికేది నెట్ నే. పైగా ప్రతి వోడీకి ఫోటొషాప్ నో మరో అప్లికేషన్ నో బాగానే వంటపడుతూంది. అందుకే నెట్ అంతా రకరకాల ఇమేజినేషన్ పోస్టింగ్ లతో నిండిపోతోంది. అల్లు అరవింద్ అదిగో రామాయణం అంటే, ఇలాంటి జనం ఇదిగో రాముడు అంటూ కామిక్స్ పిక్చర్స్ తో మిక్స్ చేసిన రామ్ చరణ్ ఫొటో వదిలారు. వాళ్ల అభిమానం వాళ్లది. అంతే కానీ, ఎన్టీఆర్, శోభన్ లాంటి వాళ్లను రాముడిగా చూసిన కళ్లతో తెలుగు జనాలు రామ్ చరణ్ ను రాముడిగా చూడగలరా? అన్నదే ఆలోచించలేదు.

మొన్నటికి మొన్న రాఘవేంద్రరావుకు వెంకటేశ్వరుడి పాత్రకు నటుడు కావాల్సి వస్తే నార్త్ కు పరుగెత్తాల్సి వచ్చింది. ఇప్పుడు టాలీవుడ్ లో నటులు వున్నారు, హీరోలు వున్నారు. కానీ అందమైన ఫేస్ లు అన్నవి వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఎవరేమనుకున్నా ఇది వాస్తవం. సరే, ఈ సంగతి అలా వుంచితే అరవింద్ రామాయణం అన్నది తెలుగు ప్రాజెక్టు కాదని తెలుస్తోంది. ఈ ఫ్రాజెక్టు నిర్మాత మధు మంతెన బ్రెయిన్ చైల్డ్. ఆయన తెలుగు వ్యక్తే కానీ, బాలీవుడ్ లో సినిమా తీయాలని చూస్తున్నారు.

గతంలో గజని కి పార్టనర్ గా వ్యవహరించారు. అందువల్ల వీలయినంత వరకు బాలీవుడ్ నటులతోనే సినిమా చేయాలని చూస్తున్నారు. కుదిరితే ఒకరిద్దరు సౌత్ నటులను తీసుకుంటారు. అంతే కానీ, 500 కోట్లు పెట్టి, తెలుగు నటులతో సినిమా తీసి, బాలీవుడ్ లో విడుదల చేసేంత సీన్ లేదక్కడ.కానీ ఇక్కడ అరవింద్ నుంచి ప్రకటన రావడంతో మెగాభిమానులు కాస్త ఎక్కువ ఊహించేసుకుంటున్నారు. కానీ అంత వుండదని త్వరలో తెలుస్తుంది.