తండ్రి ఇమేజ్‌ని అడ్డం పెట్టుకుని కూతుళ్ళు సాహసాల మీద సాహసాలు చేసేస్తున్నారు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే తండ్రి ఇమేజ్‌తో ఆటలాడేసుకుంటున్నారు. ఆ మధ్య సౌందర్య, తన తండ్రి రజనీకాంత్‌తో 'కొచాడియాన్' సినిమా తెరకెక్కించి, తన 'గ్రాఫిక్స్' సరదా తీర్చుకున్న విషయం విదితమే. ఇండియన్ సినిమా స్క్రీన్‌పై అదో అద్భుతమవుతుందని ఆమె అనుకుందిగానీ, ఆ సినిమా అందర్నీ నిలువునా ముంచేసింది.
ఇప్పుడు తాజాగా రజనీకాంత్ మరో కుమార్తె ఐశ్వర్య, తన తండ్రి సినిమాకి దర్శకత్వం వహించేందుకు సిద్ధంగా వుంది. రజనీకాంత్ బయోపిక్‌ని ఆమె తెరకెక్కిస్తుందట. ప్రస్తుతం రజనీకాంత్ 'మార్కెట్' ఏమంత బాగా లేదు. సినిమా విడుదలకు ముందు హైప్ సంగతెలా వున్నా, విడుదలయ్యాక నిర్మాతలకి రక్త కన్నీరు మిగుల్చుతున్నాయి రజనీకాంత్ సినిమాలు.
'కొచాడియాన్', 'లింగా', 'కబాలి'.. ఈ మూడు సినిమాలూ నిర్మాతల్ని నట్టేట్లో ముంచేశాయి.. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు రోడ్డున పడిపోయారు. అయినాసరే, రజనీకాంత్ సినిమాకి విపరీతమైన హైప్ క్రియేట్ అవుతోంది కదా, అంటూ ఆయన ఇమేజ్‌తో చెలగాటమాడుతూనే వున్నారు. ఆ లిస్ట్‌లో ఇప్పుడు ఐశ్వర్య చేరిపోయిందంతే. రజనీకాంత్ తెరవెనుక జీవితం ఏంటో, ఆమెకు మాత్రమే తెలుసట. అదేంటో తెరపై చూపించాలని తహతహలాడుతోందట. వామ్మో, ఈ పేరు చెప్పి ఐశ్వర్య పబ్లిసిటీ సంపాదించుకోవచ్చుగాక.. కానీ, ఆమె ప్రయోగం కాసుల్ని రాల్చే ఛాన్సే లేదు. ఎందుకంటే, గత అనుభవాలు అలా వున్నాయ్ మరి.