హీరోయిన్ గా కెరీర్ కొనసాగించడానికి కిందా మీదా అవుతూనే, నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది రాశీఖన్నా. తనతో బాటు వచ్చిన రెజీనా కన్నా రాశీ కెరీర్ కాస్త బాగానే వుంది. మంచి సినిమాలే చేస్తూ వస్తోంది. మరోపక్క సింగర్ గా కూడా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది.
ఎప్పడో మూడేళ్ల క్రితం సందీప్ కిషన్ తో కలిసి నటించిన జోరు సినిమా కోసం తొలిసారి గొంతు సవరించకుంది. ఆ తరువాత మళ్లీ తెలుగులో తన గొంతుతో పాడలేదు. ఆ మధ్య మలయాళీ సినిమా విలన్ కోసం ఓ పాట పాడింది. అయితే అది సినిమా ప్రోమో కోసమే.
ఇన్నాళ్లకు మళ్లీ తెలుగులో రెండు పాటలు చకచకా పాడేసింది. పైగా ఈ రెండు పాటలు కూడా మాంచి హిట్ సాంగ్స్ అవుతున్నాయి. ఒక పాటను సాయి ధరమ్ తేజ జవాన్ సినిమా కోసం, థమన్ మ్యూజిక్ డైరక్షన్ లో పాడేసింది. ఆ తరువాత మరోపాటను మణిశర్మ మ్యూజిక్ డైరక్షన్ లో నారా రోహిత్ బాలకృష్ణుడు కోసం పాడేసింది. ఈ రెండు సినిమాల్లో కూడా రాశీఖన్నా నటించడం లేదు. కానీ సింగర్ గా మాత్రం అదరగొట్టేసింది.
అంటే ఇకపై డైరక్టర్లు మాత్రమే కాకుండా ఎవరైనా మ్యూజిక్ డైరక్టర్లు కూడా రాశీని సంప్రదించవచ్చు అన్నమాట. తెలుగులో సెలబ్రిటీ సింగర్ గా రాశీ నిలదొక్కుకుంటుందేమో?