ఎంటర్ టైన్ మెంట్ సిటీ..డబ్బున్న మారాజుల కోసం సదా ఆలోచించి ప్రణాళకలు రూపొందించే చంద్రబాబు అమలు చేస్తున్న మరో వ్వవహారం. నలభై యాభై రూపాయిల టిక్కెట్ వుండే శిల్పారామాలు, లక్షలకు లక్షలు ఖర్చుచేస్తే తప్ప బుక్ చేసుకోలేని కన్వెన్షన్ సెంటర్ల తదుపరి ఆయన అమలు చేస్తున్న మరో పథకం ఎంటర్ టైన్ మెంట్ సిటీ.
పూర్వం ఎమ్యూజ్ మెంట్ పార్కులు, సంతల్లో గుళాటలు అంటే బ్యాన్. అదే గోవాలో కాసినోవాలు అంటే ప్రభుత్వానికి ఆదాయ మార్గం. జనాల దగ్గర డబ్బును ఎలా లాగేసుకోవాలా అన్నదే ఈలాంటి సిటీల పరమార్థం. జెయింట్ వీళ్లు, ఇతరత్రా వ్యవహారాలు అన్నీ వుంటాయి. ఇక జనం డబ్బులు వదుల్చుకోవడమే ఆలస్యం.
ఇదిలా వుంటే ఇది ఒక తరహా ఫిలి సిటీగా కూడా వుంటుంది. ఎందుకంటే ఇందులోనే లాడ్జ్ లు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లు, టీవీ, సినిమా ప్రొడక్షన్ కు సంబందించిన సదుపాయాలు కూడా వుంటాయి. అంటే ఒక విధంగా మరో రామోజీ ఫిలిం సిటీ అనుకోవాలి. ఇప్పుడు ఆంధ్ర నుంచి రామోజీ ఫిలిం సిటీ చూడ్డానికి వచ్చేవారు ఇక ఈ కొత్త సిటీ రెడీ అయ్యాక అటు వెళ్తారన్నమాట.
ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ భాగస్వామ్య సంస్థలు, విదేశీ సంస్థలు కలిసి, ఈ సిటీని నిర్మిస్తాయి. ఇందుకు సంబంధించి ఈ రోజు పర్యాటక శాఖతో ఎమ్ఓయు కుదిరింది. మరి ఇంతకీ ఇది ఎక్కడ నిర్మిస్తారన్నది ఇంకా తెలియదు. బహుశా రాజధానికి అట్రాక్షన్ గా దీన్ని వాడతారని అనుకోవాలి. విశాఖ అయి వుంటే ఇప్పటికే ప్రకటించి వుండేవారు కదా.
సిటీ ఎక్కడన్నది ప్రకటించలేదు అంటే, బహుశా రాజధాని వ్యవహారం కొలిక్కి వచ్చాక దాన్ని అక్కడే ప్రకటిస్తారని అనుకోవాలి. రాజధానిలో ఉపాధి అవకాశాలు, అలాగే టూరిస్టు అట్రాక్షన్, వాణిజ్య అవకాశాలు కల్పించాలంటే ఇలాంటి సిటీ అవసరం కాబట్టి, ఇది అక్కడే ఏర్పాటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.